నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలపై శిక్షణ
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): సమర్థవంతమైన, సమానమైన నీటి సరఫరా, పంపిణీకి నీటి వినియోగదారుల అసోసియేషన్ ఎన్నికలు కీలకమని జిల్లా రెవెన్యూ అధికారి టి.సీతారామమూర్తి అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత ఆధ్వర్యంలో నీటి వినియోగదారుల అసోసియేషన్ ఎన్నికలపై శిక్షణ నిర్వహించారు. డీఆర్వో సీతారామమూర్తి మాట్లాడుతూ మూడు విభాగాల్లో నీటి సంఘాల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. నీటి వినియోగదారులు, పంపిణీ, రెవెన్యూ కేటగిరిలలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్డీవో రాణి సుస్మిత ఓటరు జాబితా రూపకల్పన, ఓటరు గుర్తింపు తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆర్.రమణ నాయక్, ఎస్.సరళ వందనం, కె.ఎల్.శివజ్యోతి, ఎం.మాధురి, పౌర సరఫరాల డీఎం టి.రాధిక పాల్గొన్నారు.
అలరించిన అష్టావధానం
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): పవిత్ర గోదావరి తీరంలో జగద్గురువులు విధుశేఖర భారతీ మహాస్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో అష్టావధాన కార్యక్రమం బుధవారం రాత్రి శ్రీనారాయణదాసా సేవా సమితి ప్రాంగణంలో జరిగింది. శతావధాన శతధృతి గన్నవరం లలితాదిత్య అష్టావధానం చేశారు. కార్యక్రమ నిర్వహణ బహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ, సంస్కృత సమస్య మహామహోపాధ్యాయ శలాక రఘనాథ శర్మ, తెలుగు సమస్య అవధాన ప్రాచార్య ఽడాక్టర్ ధూళిపాళ మహాదేవమణి, నిషిద్ధాక్షరి గురు సహస్రావధాని కడిమెళ్ల వరప్రసాద్, సంస్కృత దత్తపతి అసమాన అవధాన సార్వభౌమ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, తెలుగు దత్తపది శతావధాన శరచ్చంద్ర తాతా సందీప్ శర్మ, వర్ణన అకెళ్ల బాల భాను, వ్యస్తాక్షరి రాంభట్ల పారర్వతీశ్వర శర్మ, అప్రస్తుత ప్రసంగం అచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి, ఆశీరభినందన మహామహోపాధ్యాయ దోర్బల ప్రభాకర శర్మ నిర్వహించారు.
క్రీడా నైపుణ్యంతో
ఉన్నతమైన భవిష్యత్తు
ప్రకాశం నగర్ (రాజమహేంద్రవరం) : యువత క్రీడల్లో నైపుణ్యం పెంచుకోవడం ద్వారా ఉన్నతమైన భవిష్యత్తు ఉంటుందని అడిషనల్ ఎస్పీ చెంచురెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఎస్పీ కార్యాలయం క్రికెట్ గ్రౌండ్‌లో జిల్లా ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌ను అడిషనల్ ఎస్ఫీ తొలుత బ్యాటింగ్ చేసి టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడాల్లో రాణిస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో నిర్వాహకులు ఈ టోర్నమెంట్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు జైకిషన్, మూర్తి పాల్గొన్నారు.
ఇంటర్ ఉత్తీర్ణత
పెంచేందుకు కార్యాచరణ
అమలాపురం టౌన్: ఇంటర్మీడియట్ విద్యార్థుల ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకు ఆ బోర్డు కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోందని జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారి (డీఐఈవో) వనుము సోమశేఖరరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న స్టడీ అవర్ల సమయాన్ని పెంచడం, ఆర్టీసీ అధికారులతో మాట్లాడి మారుమూల ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించడం వంటి చర్యలు తీసుకుందన్నారు. విద్యార్థులు ఏ విషయంలోనైనా అసౌకర్యానికి గురైతే వారి తల్లిదండ్రులు ఆ సమస్యను నేరుగా సంబంధిత కళాశాల ప్రిన్సిపాళ్లకు తెలియజేయవచ్చన్నారు. లెక్చరర్ల బోధనా సామర్థ్యం, విద్యార్థుల అభ్యాసన ప్రక్రియను ఇంటర్ విద్యాశాఖ ఉన్నతాధికారులే కాకుండా కలెక్టర్, ఆర్డీవో స్థాయి అధికారులు తరచూ తనిఖీ చేసేలా ఆదేశాలిచ్చిందన్నారు. ఈ కార్యాచరణ ప్రణాళికపై ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్ కృతికా శుక్లా ఆ విద్య రీజినల్ జాయింట్ డైరెక్టర్లు, డీఐఈవోలు, రీజినల్ పర్యవేక్షణ అధికారులతో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment