శబరిమల యాత్రకు ప్రత్యేక బస్సు
రాజమహేంద్రవరం సిటీ: శబరిమల యాత్రకు వెళ్లే భక్తులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నామని ఏపీఎస్ ఆర్టీసీ రాజమహేంద్రవరం డిపో మేనేజర్ షేక్ షబ్నం తెలిపారు. రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపో నుంచి 36 మంది అయ్యప్ప భక్తులతో శనివారం బయలుదేరిన ప్రత్యేక బస్సును ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 7 రోజుల యాత్ర అనంతరం ఈ బస్సు తిరిగి రాజమహేంద్రవరం చేరుతుందని చెప్పారు.
నిరుద్యోగుల ఆశలపై
కూటమి నీళ్లు
రాజమహేంద్రవరం సిటీ: అధికారంలోకి వచ్చిన అనంతరం మెగా డీఎస్సీ ఫైలుపై సీఎం చంద్రబాబు నాయుడు మొదటి సంతకం చేశారని, ఐదు నెలలు గడుస్తున్నా నోటిఫికేషన్ మాత్రం ఇవ్వలేదని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి జీవీ సుందర్ విమర్శించారు. రాజీవ్ గాంధీ డిగ్రీ కళాశాల సమావేశ హాలులో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నోటిఫికేషన్ ఇచ్చి, త్వరగా పోస్టులు భర్తీ చేస్తారనుకుంటే ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అంశం నేపథ్యంలో వచ్చే ఫిబ్రవరికి వాయిదా వేసి, నిరుద్యోగుల ఆశలపై కూటమి ప్రభుత్వం నీళ్లు జల్లిందని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పోలీసు శాఖను పటిష్టపరుస్తామంటూ హోం మంత్రి ప్రకటించార ని, ఖాళీగా ఉన్న పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఏవిధంగా పటిష్టపరుస్తారని ప్రశ్నించారు. పోలీసు శాఖలో ఖాళీల భర్తీకి సంబంధించిన ఫిజికల్ పరీక్షలను ఫిబ్రవరికి వాయిదా వేశారని చెప్పారు. అలాగే గ్రూప్–1 పోస్టుల భర్తీని కూడా వాయిదా వేశారన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వడానికి సైతం బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదని గుర్తు చేశారు. సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టి, వేధించడం సరికాదని సుందర్ హితవు పలికారు.
అంతర్వేదిలో భక్తుల రద్దీ
సఖినేటిపల్లి: కార్తిక మాసం నాలుగో శనివారం సందర్భంగా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సాధారణ భక్తులతో పాటు అయ్యప్ప, భవాని, శివ మాలధారులు పోటెత్తారు. నిత్యం నిర్వహించే నారసింహ సుదర్శన హోమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment