మనోళ్లే.. వదిలేయండి!
మూడు డ్రెడ్జింగ్ బోట్లు సీజ్
సాక్షి, రాజమహేంద్రవరం: ‘వాళ్లు మనవాళ్లే వదిలేయండి. అక్కడి నుంచి వెళ్లిపోండి’. ఇదీ ఇసుకాసురులకు వత్తాసు పలుకుతూ అధికారులకు ఓ ఎమ్మెల్యే జారీ చేసిన అల్టిమేటం. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ఎమ్మెల్యే కావడం.. ‘మనవాళ్లు చేసుకుంటారు.. మీరు వెంటనే వచ్చేయండి’ అని ఆదేశించడంతో చేసేది లేక అధికారులు వెనుతిరిగిన సంఘటన రాజమహేంద్రవరం కోటిలింగాల రేవు–2 ఇసుక ర్యాంప్ వద్ద చోటు చేసుకుంది. దీనిని బట్టి చూస్తే కూటమి ప్రభుత్వంలోని ఇసుక మాఫియా అక్రమార్జన కోసం ఎంతకై నా తెగిస్తుందన్న భావన ప్రజల్లో కలుగుతోంది. వివరాలివీ..
‘సాక్షి’ కథనాలతో కదిలిన అధికారులు
కోటిలింగాల రేవు–2లో అక్రమార్కులు నిబంధనలకు విరుద్ధంగా ఇసుక డ్రెడ్జింగ్‌కు పాల్పడుతున్నారు. ఇద్దరు కూటమి నేతల కనుసన్నల్లో ఈ దందా సాగుతోంది. రోజూ వందల లారీల ఇసుకను జిల్లా దాటిస్తున్న కూటమి నేతలు రూ.లక్షల్లో అక్రమంగా ఆర్జిస్తున్నారు. అధికార పార్టీ నేతలు కావడంతో అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తూ వచ్చారు. ఈ వ్యవహారంపై ‘తవ్వుకో.. దోచుకో’, ‘ఆపేదెవరు..?’ శీర్షికలతో ‘సాక్షి’ ఇటీవల వరుస కథనాలు ప్రచురించింది. దీంతో, ఎట్టకేలకు అధికార యంత్రాంగం స్పందించింది. కోటిలింగాలరేవు–2లో శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. మైనింగ్, రెవెన్యూ, పోలీసు శాఖల సమక్షంలో ఈ తనిఖీలు చేపట్టారు. ఇసుకాసురులు నిబంధనలను గోదావరిలో తొక్కి మరీ డ్రెడ్జింగ్ చేస్తున్న విషయం ఈ తనిఖీల్లో బట్టబయలైంది. ఈ సందర్భంగా అధికారులు రెండు డ్రెడ్జింగ్ బోట్లు, ఇసుక రవాణాకు ఉపయోగిస్తున్న రెండు లారీలను పట్టుకున్నారు. వాటిని సీజ్ చేసేందుకు సర్వం సిద్ధం చేశారు.
ఎమ్మెల్యే ఒత్తిళ్లతో..
అధికారుల తనిఖీల నేపథ్యంలో ఇసుక రవాణా చేస్తున్న కూటమి నేత ర్యాంపు వద్దకు చేరుకున్నాడు. అధికారులతో చర్చించాడు. చూసీచూడనట్లు వ్యవహరించాలని అధికారులను కోరాడు. దీనికి వారు ససేమిరా అనడం.. అక్రమ వ్యవహారం బట్టబయలవడంతో ఆ నేత ఈ విషయాన్ని ఓ కూటమి ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వెంటనే రంగంలోకి దిగిన సదరు ఎమ్మెల్యే తనిఖీకి వచ్చిన అధికారులతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది. ‘మన వాళ్లే వదిలేయండి. అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ మామూలే’ అంటూ అధికారులపై ఆ ఎమ్మెల్యే చిందులు వేశారని చెబుతున్నారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అధికారులు కిమ్మనకుండా పటుకున్న డ్రెడ్జింగ్ బోట్లను, ఇసుక లారీలను అక్కడే వదిలేసి వెనుతిరిగారు. దీనిని బట్టి చూస్తే ఇసుకారుసురుల అవతారం ఎత్తిన కూటమి నేతలు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడినా వదిలేసి వెళ్లిపోండని ఆదేశాలు జారీ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటనే ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమవుతోంది. పట్టుబడిన బోట్లు, లారీలకు సంబంధించి అధికారులు చిన్నపాటి కేసు కూడా పెట్టకుండా వెళ్లిపోయారంటే కూటమి నేతలు ఏ స్థాయిలో ఇక్కడ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
పోలీసులు.. చూసీ చూడనట్లు!
రాత్రి వేళ ఇసుక రవాణా చేపట్టకూడదన్నది ప్రభుత్వ నిబంధన. ర్యాంపుల్లో సైతం సాయంత్రం 6 గంటల లోపే ఇసుక తవ్వకాలు, లోడింగ్ వంటి పనులన్నీ ముగించాలి. కానీ, వ్యవహారం మాత్రం అందుకు విరుద్ధంగా సాగుతోంది. సాయంత్రం వరకూ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారికి ఇసుక అందిస్తున్న మాఫియా.. 6 గంటలు దాటిన తర్వాత అక్రమ రవాణాకు తెర తీస్తున్నారు. కోటిలింగాలరేవు–2 నుంచి శుక్రవారం అర్ధరాత్రి భారీ వాహనాల్లో ఇసుక అక్రమంగా రవాణా చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో అక్కడ పోలీసులున్నా చూసీచూడనట్లు వ్యవహరించారని తెలిసింది. ఇసుక తరలిస్తున్న లారీని ఆపిన పోలీసులు తిరిగి నిమిషాల వ్యవధిలోనే దానిని వదిలేశారని సమాచారం. కనీసం కేసు కూడా నమోదు చేయకుండా అలా వదిలేయడంలో ఆంతర్యం ఏమిటనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఒకవేళ ఇసుక తరలిస్తున్న లారీకి అనుమతులున్నాయనుకున్నా.. అర్ధరాత్రి ఇసుక లోడింగ్, రవాణా నిబంధనలకు విరుద్ధం. అటువంటప్పుడు ఇసుక తరలిస్తున్న లారీలపై చర్యలు ఎందుకు తీసుకోలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఫ కోటిలింగాలరేవు–2లో ఇసుక
డ్రెడ్జింగ్‌పై ‘సాక్షి’ వరుస కథనాలు
ఫ ఎట్టకేలకు స్పందించిన యంత్రాంగం
ఫ పోలీసు, మైనింగ్, రెవెన్యూ
అధికారుల ఆకస్మిక తనిఖీలు
ఫ 2 డ్రెడ్జింగ్ బోట్లు,
2 ఇసుక లారీల పట్టివేత
ఫ అక్రమార్కులకు అండగా
రంగంలోకి దిగిన ఓ ఎమ్మెల్యే
ఫ మనోళ్లే.. వదిలేయాలంటూ హుకుం
ఫ గత్యంతరం లేక
వెనుతిరిగిన అధికారులు
కొవ్వూరు: పట్టణం సమీపంలోని ఔరంగాబాద్–2 ఇసుక ర్యాంపులో అనధికారికంగా వినియోగిస్తున్న మూడు డ్రెడ్జింగ్ బోట్లను కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత సీజ్ చేశారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ర్యాంపులో ఇసుక డ్రెడ్జింగ్ జరుగుతోందని ఎంపీపీ కాకర్ల సత్యనారాయణ శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు టాస్క్‌ఫోర్స్ టీముతో కలిసి ఆర్‌డీఓ శనివారం రాత్రి ర్యాంపులో ఆకస్మికంగా తనిఖీ చేశారు. బోట్స్‌మెన్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఔరంగాబాద్–2 ర్యాంపులో నిబంధనలకు విరుద్ధంగా మూడు డ్రెడ్జింగ్ బోట్లు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఈ మూడు బోట్లను సీజ్ చేయాలని, సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని, బోట్లు ఎవరివో విచారించాలని అధికారులను ఆర్‌డీఓ ఆదేశించారు. ఈ మేరకు ఇరిగేషన్ ఏఈ జి.మణికంఠరాజు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు. దీనిపై మైనింగ్ శాఖ అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటారని ఆర్‌డీఓ సుస్మిత స్పష్టం చేశారు. తహసీల్దార్ ఎం.దుర్గాప్రసాద్, ఏఎస్సై జీజీ ప్రకాష్, ఇతర అధికారులు ఆమె వెంట ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment