No Headline
సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వ నేతృత్వంలో ఇసుక మాఫియా బరితెగిస్తోంది. అధికార పార్టీల ప్రజాప్రతినిధులు అండగా ఉన్నారన్న ధైర్యంతో అడ్డగోలు వ్యవహారానికి తెర తీస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా డ్రెడ్జింగ్ చేయడంతో పాటు నిషేధిత సమయమైన రాత్రి వేళల్లో ఇసుక తరలిస్తూ లక్షల రూపాయలు అక్రమంగా గడిస్తోంది. కూటమి నేతలు, ప్రజాప్రతినిధుల నుంచి ఫోన్లు చేయిస్తూండటంతో చేసేది లేక తనిఖీలకు వెళ్లిన అధికారులు మిన్నకుండిపోతున్న సందర్భాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ తంతు కోటిలింగాల–2 ఇసుక ర్యాంపులో నిత్యకృత్యంగా మారింది. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. అక్రమంగా తవ్వి, తరలిస్తున్న ఇసుకను ఇటీవల అధికారులు సీజ్ చేశారు. వారిపై కూటమి నాయకులతో ఒత్తిడి తెచ్చిన మాఫియా సదరు ఇసుకను రాత్రికి రాత్రే తరలించేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిని బట్టి చూస్తే ఇసుక మాఫియా అధికారులను సైతం బెదిరించే స్థాయికి చేరిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఒత్తిడి తెచ్చి.. తరలించుకుపోయి..
కోటిలింగాల–2 రేవులో ఇష్టానుసారం ఇసుక తవ్వేస్తున్నారు. ఈ అక్రమ వ్యవహారంపై పత్రికల్లో కథనాలు ప్రచురితం కావడంతో మేల్కొ న్న అధికారులు.. కొన్ని రోజుల క్రితం ర్యాంపులో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో సుమారు 20 లారీల అక్రమ ఇసుకను సీజ్ చేశారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఇప్పటికే డ్రెడ్జింగ్ చేసి, రాత్రిళ్లు అక్రమంగా ఇసుక తరలిస్తున్న మాఫియా కన్ను సీజ్ చేసిన ఇసుకపై పడింది. ఎలాగైనా దానిని తరలించుకుని పోయేందుకు వ్యూహం పన్నారు. అనుకున్నదే తడవుగా కూటమికి చెందిన ఓ ఎమ్మెల్యే వద్ద పంచాయితీ పెట్టారు. ఎలాగైనా ఆ ఇసుకను విడిపించాలని కోరారు. ఇసుకాసురుల అభ్యర్థనకు స్పందించిన సదరు ఎమ్మెల్యే వెంటనే రంగంలోకి దిగారు. అధికారులపై ఒత్తిడి తేవడం మొదలు పెట్టారు. ఎట్టకేలకు అనుకున్నది సాధించారు. సీజ్ చేసిన ఇసుకను తరలించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించేశారు. ఇంకేముంది! ఇదే అదునుగా గంటల వ్యవధిలోనే ఆ ఇసుకను మాఫియా తరలించుకుని పోయినట్లు చెబుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికారులు ఇసుకను సీజ్ చేస్తే.. దానిని విడిపించడానికి ఓ ప్రక్రియ ఉంటుంది. అదంతా తమకు పట్టదన్నట్లు అధికారులు ఎలా వదిలేశారన్నది ప్రశ్నార్థకంగా మారింది. గుట్టు చప్పుడు కాకుండా జరిగిన ఈ వ్యవహారం ఉన్నతాధికారులు దృష్టికి వెళ్లకుండా తొక్కిపెట్టినట్లు సమాచారం.
గతంలోనూ ఇదే తంతు
కోటిలింగాల–2 రేవులో గతంలోనూ ఇటువంటి వ్యవహారమే చోటు చేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా డ్రెడ్జింగ్ చేసి, ఇసుక తీస్తున్న వ్యవహారం బట్టబయలైంది. దీనిపై మైనింగ్, రెవెన్యూ, పోలీసుల సమక్షంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అధికారుల తనిఖీల్లో ఇసుక డ్రెడ్జింగ్ చేస్తున్న విషయం నిర్ధారణ అయ్యింది. డ్రెడ్జింగ్‌కు ఉపయోగించిన రెండు బోట్లు, ఇసుక రవాణాకు ఉపయోగించే రెండు లారీలు ర్యాంప్ వద్ద పట్టుబడ్డాయి. వాటిని సీజ్ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. విషయం పసిగట్టి, ఇసుక రవాణా చేస్తున్న కూటమి నేత వెంటనే అక్కడకు చేరుకున్నారు. అధికారులతో చర్చించి, చూసీచూడనట్లు వ్యవహరించాలని కోరారు. దీనికి అధికారులు అంగీకరించకపోవడంతో విషయాన్ని ఓ కూటమి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాలతో అధికారులు పట్టుకున్న బోట్లు, లారీలను వదిలేసి వెనుదిరిగిపోయారు. అప్పట్లో కొద్ది రోజుల పాటు మిన్నకుండిపోయిన మాఫియా తిరిగి రంగంలోకి దిగి అక్రమంగా ఇసుక తవ్వకాలను ప్రారంభించినట్లు తెలిసింది.
యథేచ్ఛగా డ్రెడ్జింగ్
ర్యాంపుల్లో డ్రెడ్జింగ్, యంత్రాలతో ఇసుక తవ్వకాలపై నిషేధం ఉంది. బోట్స్‌మెన్ సొసైటీల ఆధ్వర్యాన కూలీలతోనే ఇసుక తవ్వకాలు జరగాలన్నది నిబంధన. రాత్రిళ్లు ఇసుక తవ్వరాదు. తరలించడం కూడా చేయకూడదు. కోటిలింగాల–2 ర్యాంపులో మాత్రం అలాంటివేమీ పట్టించుకోవడం లేదు. డ్రెడ్జింగ్ బోట్లను తీసుకొచ్చి రాత్రిళ్లు అక్రమంగా ఇసుక తవ్వుతున్నట్లు ఆరోపణలున్నాయి. తీసిన ఇసుకను రాత్రి వేళల్లో ఒడ్డుకు చేరుస్తున్నారు. దీనిని రాత్రికి రాత్రే పెద్ద లారీల్లో ఇతర ప్రాంతాలకు తరలించేసి రూ.లక్షలు దండుకుంటున్నారు. రాత్రి 11 గంటలకు ప్రారంభమవుతున్న ఈ దందా తెల్లవారుజాము వరకూ సాగుతోంది. ఉదయం మాత్రం ఏమీ తెలియనట్లు కూలీల ద్వారా ఇసుక తవ్వుతున్నట్లు కలరింగ్ ఇస్తున్నారు. సెలవు రోజులు, ఆదివారాలైతే ఇక పండగే. పట్టపగలే డ్రెడ్జింగ్ బోట్లతో ఇసుక తవ్వుతున్నట్లు సమాచారం. ఇదంతా తెలిసినా.. అధికార పార్టీ నేతల అండదండలు ఉండటంతో అటువైపు వెళ్లేందుకు కూడా అధికారులకు సాహసించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇసుక లోడింగ్‌కు సిద్ధంగా ఉంచిన జేసీబీ (ఫైల్)
ఫ అక్రమంగా తవ్విన ఇసుక సీజ్
ఫ విడిచిపెట్టాలని కూటమి నేతల ఒత్తిళ్లు
ఫ తీవ్ర స్థాయిలో ప్రజాప్రతినిధి ఒత్తిడి
ఫ తలొగ్గిన అధికారులు
ఫ కోటిలింగాల–2 రేవులో
ఆగని అనధికారిక డ్రెడ్జింగ్
Comments
Please login to add a commentAdd a comment