దోపిడీ ఉచితం! | - | Sakshi
Sakshi News home page

దోపిడీ ఉచితం!

Published Tue, Dec 24 2024 2:47 AM | Last Updated on Tue, Dec 24 2024 2:47 AM

దోపిడీ ఉచితం!

దోపిడీ ఉచితం!

పి.గన్నవరం: ఇసుక ఉచితం పేరుతో కూటమి నేతలు భారీగా దోచుకుంటున్నారు. నదీపాయలోకి అక్రమంగా ర్యాంపు ఏర్పాటు చేసి ఖనిజ సంపదను కొల్లగొడుతున్నారు. భారీ ఎత్తున ఇసుక దోపిడీ జరుగుతున్నా అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా పి.గన్నవరం శివారు డీఎస్‌ పాలెం సమీపంలో కూటమి నేతలు అనధికార ఇసుక ర్యాంపును నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తూరలు ఏర్పాటు చేసి, నదిలోకి బాట ఏర్పాటు చేశారు. పది రోజుల నుంచి రోజూ వందలాది ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తున్నారు. పి.గన్నవరం మండలం సీఆర్‌జెడ్‌ పరిధిలో ఉండడంతో ఇసుక తీయడానికి అనుమతులు లేవు. నియోజకవర్గ నేత ఆదేశాలతో ర్యాంపు నిర్వహిస్తున్నారని, అందుకే అధికారులు సైతం ఇటువైపు కన్నెత్తి చూడటం లేదని విమర్శిస్తున్నారు. రోజుకు సుమారు 400 ట్రాక్టర్ల ఇసుకను బయటకు తరలిస్తున్నారు. ఈ అనధికార ర్యాంపులో ట్రాక్టర్‌ ఇసుకను రూ.700కు లోడు చేస్తున్నారు. లోడు చేసే జట్టు కార్మికులకు రూ.350 చెల్లిస్తున్నారు. మిగిలిన రూ.350 బాటల నిర్వాహణ, ర్యాంపునకు వెళ్లే దారిలో రైతులకు ఇవ్వాలని వసూలు చేస్తున్నారు.

వివాదంతో విరామం..

స్థానిక అక్విడెక్టు దిగువన అనధికారికంగా బోట్సుమెన్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఇసుక ర్యాంపు నడిచేది. నిబంధనలకు విరుద్ధంగా పడవలపై ఇసుకను తీసి విక్రయించేవారు. అయితే డీఎస్‌ పాలెం వద్ద ఓపెన్‌ ర్యాంపు ఏర్పాటు చేయడంతో అక్విడెక్టు దిగువన ఇసుక విక్రయాలు తగ్గిపోయాయి. దీంతో డీఎస్‌ పాలెం ఓపెన్‌ ర్యాంపులో కూటమి నేతలతో పాటు బోట్సుమెన్‌ సొసైటీ కూడా వాటాదారుగా ఉన్నట్టు చెబుతున్నారు. అయితే ర్యాంపులోకి వెళ్లే ట్రాక్టర్ల వద్ద రూ.700 వసూలు చేసి ఇక స్లిప్‌ ఇస్తారు. దానిని కూలీలకు ఇస్తేనే ఇసుక లోడు చేస్తారు. కాగా ఆ స్లిప్పులపై డీఎస్‌ పాలెం ర్యాంపు అని ముద్రించడాన్ని బోట్సుమెన్‌ సొసైటీ సభ్యులు అభ్యంతరం చెప్పారు. బోట్సుమెన్‌ ర్యాంపుగా స్లిప్పులపై ముద్రించాలని పట్టుపట్టడంతో కొంతసేపు ర్యాంపు ఆగిపోయింది.

కలెక్టర్‌కు జనసేన ఎంపీటీసీ ఫిర్యాదు

పి.గన్నవరం మండలంలో అక్రమంగా మట్టి, ఇసుక తవ్వకాలు సాగిస్తున్న వారికి సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని, సుమోటో కేసుగా స్వీకరించాలని కోరుతూ జనసేన పార్టీకి చెందిన ఊడిమూడి–2 ఎంపీటీసీ సభ్యుడు ఆదిమూలం సూర్యనారాయణమూర్తి సోమవారం అమలాపుం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా స్పందనలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఉప ముఖ్యమంత్రికి వినతి పంపినట్టు తెలిపారు.

డీఎస్‌ పాలెంలో అనధికార ర్యాంపు

వందలాది ట్రాక్టర్లతో ఇసుక తరలింపు

పట్టించుకోని అధికారులు

అక్విడెక్టు సమీపంలో సైతం

తవ్వకాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement