నేడు పెన్షన్ల పంపిణీ
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): వచ్చే నెల ఒకటో తేదీన పంపిణీ చేయాల్సిన ఎన్టీఆర్ భరోసా పింఛన్లను మంగళవారమే అందజేస్తామని కలెక్టర్ పి.ప్రశాంతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లావ్యాప్తంగా 17 కేటగిరీల్లో 2,36,927 మందికి రూ.101,93,56,000 మేర పింఛన్లు అందిస్తామన్నారు. లబ్ధిదారులకు ఇంటివద్దనే ఉదయం 6 గంటల నుంచి పింఛన్లు అందజేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.
పీజీఆర్‌ఎస్‌కు 120 అర్జీలు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)కు 120 అర్జీలు వచ్చాయని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. రెవెన్యూ 65, పంచాయతీరాజ్ 19, పురపాలక శాఖ 14, ఇతర శాఖలవి 22 చొప్పున అర్జీలు వచ్చాయని వివరించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి శాఖల వారీగా టేబుళ్లు ఏర్పాటు చేసి, ఆయా జిల్లా అధికారి వద్దకు నేరుగా అర్జీదారును పంపి వ్యక్తిగతంగా సమస్య వివరించేలా ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు, డీఆర్‌ఓ టి.సీతారామమూర్తి, ముఖ్య ప్రణాళికాధికారి ఎల్.అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు.
చట్టపరిధిలో అర్జీల పరిష్కారం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రజలు అందించిన అర్జీలను చట్టపరిధిలో సకాలంలో పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ అన్నారు. స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు 22 అర్జీలు అందించారు. వారి కష్టాలను, బాధలను ఎస్పీ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత స్టేషన్ పోలీస్ అధికారులతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫిర్యాదుదారుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించాలని ఉత్తర్వులు జారీ చేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) ఎన్‌బీఎం మురళీకృష్ణ, ఇన్‌స్పెక్టర్ (ఎస్‌బీ) శ్రీనివాసరావు, ఇన్‌స్పెక్టర్ (డీసీఆబీ) పవన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment