● పలువురు పంచాయతీ
కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు
● ఔట్‌సోర్సింగ్ సిబ్బంది తొలగింపు
● కలెక్టర్ ఉత్తర్వులు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, నిధులు దుర్వినియోగం చేసినా ఉపేక్షించబోనని కలెక్టర్ పి.ప్రశాంతి సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణ, విధుల్లో, పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన.. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన.. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు జారీ చేసిన పలువురు సిబ్బందిపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఆ వివరాలు..
● విధి నిర్వహణలో బాధ్యతారహితంగా ఉన్నారనే ఆరోపణలపై విచారణ అనంతరం బిక్కవోలు మండలం తొస్సిపూడి పంచాయతీ కార్యదర్శి డి.విజయరాజును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
● ప్రస్తుతం హుకుంపేట పంచాయతీ కార్యదర్శిగా ఉన్న కేఎస్ రాజశేఖర్ గతంలో సీతానగరం మండలం రఘుదేవపురంలో పని చేసినప్పుడు వసూలు చేసిన పన్ను మొత్తాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై సస్పెండ్ చేశారు. ఈ నిధుల దుర్వినియోగానికి సంబంధించి పంచాయతీ బిల్ కలెక్టర్ వై.అర్జునుడును కూడా సస్పెండ్ చేశారు. ఔట్‌సోర్సింగ్ సిబ్బంది టి.లాల్‌కుమార్‌ను విధుల నుంచి తొలగించారు.
● విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో కడియం మండలం దుళ్ళ (ప్రస్తుతం చినకొండేపూడి) పంచాయతీ కార్యదర్శి బి.సరోజరాణిని సస్పెండ్ చేశారు.
● తాళ్లపూడి మండలం పోచవరం పంచాయతీ కార్యదర్శి ఈఎన్ రామలక్ష్మి తప్పుడు తేదీతో జన్మదిన ధ్రువపత్రం జారీ చేయడంతో క్రిమినల్ కేసు నమోదు చేసి, విధుల నుంచి సస్పెండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment