హాస్టల్ విద్యార్థులకు పుస్తకాల పంపిణీ
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): నూతన సంవత్సర వేళ తనకు అభినందనలు తెలిపేందుకు వచ్చిన వారు అందజేసిన పుస్తకాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు అందజేశామని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నూతన సంవత్సర వేళ శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే వారు ఇచ్చే బొకేలు తాత్కాలిక ప్రయోజనం మాత్రమే చేకూరుస్తాయని, దీనికి బదులు సామాజిక సేవకు దోహదపడే కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ పుస్తకాలను 322 సెట్లుగా హాస్టళ్ల విద్యార్థులకు అందజేశామని జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎంఎస్ శోభారాణి తెలిపారు.
6న జాబ్‌మేళా
రాజమహేంద్రవరం రూరల్: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యాన రాజమహేంద్రవరంలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో ఈ నెల 6న జాబ్‌మేళా నిర్వహిస్తున్నారు. జిల్లా ఉపాధి అధికారి హరీష్‌చంద్రప్రసాద్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పెరుమాళ్‌రావు శుక్రవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. యాక్సిస్ బ్యాంక్, పీఎన్‌బీ మెట్‌లైఫ్, లక్ష్మీ హ్యుండాయ్ కంపెనీల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి ఈ మేళా జరుగుతోందన్నారు. పదో తరగతి, ఐటీఐ, డిగ్రీ,, పీజీ పూర్తి చేసిన 19 నుంచి 35 సంవత్సరాలలోపు వారు అర్హులన్నారు. ఆసక్తి, అర్హత ఉన్న వారు ముందుగా https://naipunyam.ap. gov.in/user®istration వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలతో నమోదు చేసుకోవాలని సూచించారు. జాబ్ మేళాకు ఆ రోజు ఉదయం 10 గంటలకు రెజ్యూమ్, ఆధార్, ఇతర సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలు తీసుకుని రావాలన్నారు. వివరాలకు 99888 53335, 87126 55686, 87901 18349, 87901 17279 నంబర్లలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల్లోపు సంప్రదించవచ్చునన్నారు.
నేటి నుంచి పక్షుల గణన
తాళ్లరేవు: అంతర్జాతీయ నీటి పక్షులను గుర్తించేందుకు శని, ఆదివారాలలో నీటి పక్షుల గణన నిర్వహించనున్నట్లు ఫారెస్ట్ రేంజర్ ఎస్‌ఎస్‌ఆర్ ప్రసాదరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అటవీశాఖ ఆధ్వర్యంలో జరుగనున్న ఈ పక్షుల గణనకు సంబంధించి బాంబే నేషనల్ హిస్టరీ సొసైటీ (బీఎన్‌హెచ్‌ఎస్) బర్డ్స్ వాటర్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డెక్కన్ బర్డ్స్ హైదరాబాద్ తదితర సంస్థలతోపాటు కళాశాల విద్యార్థులు మొత్తం 60 మందికి పైగా పాల్గొంటారని తెలిపారు. దీనిలో భాగంగా 4వ తేదీన లెక్కింపు ఎలా చేయాలి అన్నఅంశంపై కోరంగి బయోడైవర్సిటీ సెంటర్‌లో అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. అభయారణ్యం పరిధిలోని 12 పక్షి ఆవాస ప్రాంతాల్లో బృందానికి ఐదుగురు చొప్పున నీటిపక్షుల గణన చేపడతారని ప్రసాదరావు తెలిపారు.
ఫిషింగ్ బోట్లలో తనిఖీలు
ఏడు ఆలివ్ రిడ్లే తాబేళ్లు సముద్రంలో విడుదల
తాళ్లరేవు: కాకినాడ జిల్లా పరిధిలోని ఎన్టీఆర్, ఉప్పాడ బీచ్‌లలో ఆలివ్ రిడ్లే తాబేళ్లు మృతిచెందుతున్నాయన్న వార్తల నేపథ్యంలో శుక్రవారం ఫారెస్ట్ అధికారుల బృందం తనిఖీలు నిర్వహించింది. ఫారెస్ట్ రేంజర్ ప్రసాదరావు ఆధ్వర్యంలో కోరంగి పంచాయతీ హోప్ ఐలాండ్ ప్రాంతంలో నిర్వహించిన ఈ తనిఖీలలో భాగంగా రెండు ఫిషింగ్ బోట్లలో తనిఖీ చేయగా ఒక బోటులో నాలుగు, మరో బోటులో మూడు తాబేళ్లు జీవించి ఉన్నట్లు గుర్తించామన్నారు. వలలను కత్తిరించి తాబేళ్లను సముద్రంలో వదిలివేసి బోట్లను స్వాధీన పరచుకున్నట్లు ప్రసాదరావు తెలిపారు. ఇకపై హోప్‌ఐలాండ్ ప్రాంతంలో 5 కిలోమీటర్ల దూరం దాటి ఫిషింగ్ చేసుకోవాలని లేకుంటే వారిపై వైల్డ్‌లైఫ్, ఫిషరీస్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment