వీఆర్‌ఓల సంఘం జిల్లా అధ్యక్షునిగా శ్రీనివాసరావు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్):
ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్‌ఓ) సంఘం జిల్లా అధ్యక్షునిగా సానా శ్రీనివాసరావు (రాజానగరం) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక ఏపీ రెవెన్యూ అసోసియేషన్ భవనంలో సంఘం జిల్లా సమావేశం కార్యదర్శి సొంగ రాజు అధ్యక్షతన ఆదివారం జరిగింది. జిల్లా అధ్యక్షుడు కేవీ సూర్యనారాయణ ఇటీవల తన పదవికి రాజీనామా చేయడంతో శ్రీనివాసరావును ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వీఆర్‌ఓల సమస్యలను ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. నూతన అధ్యక్షుడు శ్రీనివాసరావును రాష్ట్ర కమిటీ సభ్యులు సర్వేశ్వరరావు, మంగి అప్పలనాయుడు, జిల్లా కమిటీ సభ్యులు, కొవ్వూరు, రాజమహేంద్రవరం డివిజన్ల అధ్యక్షులు ప్రభాకరరావు, అనంతారపు శ్రీనివాసరావు అభినందించారు.
పింఛన్ల తనిఖీ తక్షణమే నిలిపివేయాలి
● దివ్యాంగులను దొంగలుగా
చిత్రీకరించే ప్రయత్నం తగదు
● వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు పోసికుమార్
ధవళేశ్వరం: ఎనిమిది లక్షల మంది దివ్యాంగులను దొంగలుగా చిత్రీకరించే ప్రక్రియ నిలుపుదల చేయాలని వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు ముత్యాల పోసికుమార్ ఆదివారం ప్రకటనలో డిమాండ్ చేశారు. సుమారు ఎనిమిది లక్షల పైచిలుకుగా ఉన్న దివ్యాంగుల పింఛన్లు తనిఖీ ప్రక్రియలు వెంటనే నిలుపుదల చేయాలని, రాష్ట్రంలో దివ్యాంగ పింఛనుదారులు అంటే దొంగలుగా కూటమి ప్రభుత్వం చిత్రీకరించడం దారుణమన్నారు. ఇలాంటి చర్యలు కూటమి ప్రభుత్వం వెంటనే నిలుపుదల చేయాలని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో దివ్యాంగ పింఛన్ పొందుతున్న వారందరూ దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. కల్లబొల్లి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పింఛన్‌దారులను దొంగలుగా చూపించే ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభించేందుకు సిద్ధమైందన్నారు. చంద్రబాబు నాయుడు కుటిల బుద్ధికి, దివ్యాంగుల పట్ల ఆయనకు ఉన్న వివక్షకు ఈ తనిఖీ ప్రక్రియ ఒక నిదర్శనం అన్నారు. వెంటనే తనిఖీ ప్రక్రియ నిలుపుదల చేసి తగిన చర్యలు చేపట్టకపోతే దివ్యాంగుల తరపున పోరాటానికి సిద్ధమని తెలిపారు. తల్లికి వందనం ఎగ్గొట్టి రాష్ట్రంలో ఉన్న తల్లుల ఉసురు మూట కట్టుకున్న చంద్రబాబు నాయుడు దివ్యాంగులందర్నీ దొంగలుగా చిత్రీకరించి వారి ఉసురు మూటకట్టుకోకుండా ఉండాలని పోసికుమార్ హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment