అభయారణ్యంలో పక్షుల గణన
తాళ్లరేవు: అభయారణ్యంలో పక్షులను లెక్కించేందుకు ప్రత్యేక బృందం శ్రమించింది. ప్రత్యేక కెమెరాలతో కోరింగ అభయారణ్యం, సముద్ర తీర ప్రాంతంలో అణువణుమూ జల్లెడ పట్టింది. ఏషియన్ వాటర్ బర్డ్ సెన్సస్– 2025లో భాగంగా ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన 12 బృందాలు ఇందులో పాలుపంచుకున్నాయి. పర్యావరణంలోని ప్రస్తుత పరిస్థితులను తెలుసుకోవడంతోపాటు, దూర ప్రాంతాల నుంచి వచ్చే వలస పక్షుల సంఖ్యను లెక్కించేందుకు ప్రభుత్వం ఏటా పక్షుల గణన చేపడుతోంది. దీనికోసం ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎస్‌ఎస్‌ఆర్ వరప్రసాద్ నేతృత్వంలో సుమారు 60 మందితో కూడిన బృందానికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. లెక్కింపులో అటవీ సిబ్బందితోపాటు ఒక వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్, ఒక సైంటిస్ట్, ఒక స్టూడెంట్‌తో పాటు ఒక వలంటీర్ పాల్గొన్నారు. ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి ప్రత్యేక కెమెరాలతో కోరంగి మడ అటవీ ప్రాంతం, సముద్ర తీర ప్రాంతంలో సంచరించే వివిధ రకాల పక్షులు, దూర ప్రాంతాల నుంచి వలస వచ్చే పక్షులను గుర్తించారు. నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ, ఏపీ స్టేట్ కో ఆర్డినేటర్ శ్రీరామ్‌రెడ్డి, సీనియర్ సైంటిస్ట్, బీఎన్‌హెచ్‌ఎస్ ప్రతినిధి ఎస్.శివకుమార్, రీసెర్చ్ సైంటిస్ట్ డి.మహేష్‌బాబు నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. దీనిని ఫారెస్ట్ రేంజర్ ఎస్‌ఎస్‌ఆర్ వరప్రసాద్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సిద్ధార్థ తదితరులు పర్యవేక్షించారు. కోరంగి బయోడైవర్సటీ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో పక్షి గణనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ వరప్రసాద్ సర్టిఫికెట్లను అందజేశారు. అన్నీ పరిశీలించిన తరువాత పక్షుల సంఖ్యను ప్రకటించనున్నట్లు వరప్రసాద్ వివరించారు. వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి డాక్టర్ ఈశ్వర్ సత్యనారాయణ, ఎఫ్‌ఎస్‌ఓలు, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment