యూరియా.. ఏదయా!
ఫ సొసైటీల్లో అరకొరగా నిల్వలు
ఫ అక్కడే రైతుల పడిగాపులు
ఫ ఇదే అదునుగా ప్రైవేటు డీలర్ల అదనపు వసూళ్లు
కొవ్వూరు: జిల్లా రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. కూటమి సర్కారు రైతుల అవసరాలను గాలికి వదిలేయడంతో.. సరిపడినంత యూరియా దొరక్క వారు నానా ఇక్కట్లూ పడుతున్నారు. అరకొర సరఫరాతో సొసైటీల వద్ద గంటల తరబడి పడిగాపులు పడుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో రబీ సాగు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. నాట్ల సమయంలో దమ్ములో ఎకరాకు బస్తా చొప్పున యూరియా వేయాల్సి ఉంటుంది. నాట్లు వేసిన 15, 25, 35 రోజులకు ఒక్కో బస్తా చొప్పున యూరియా అవసరం ఉంటుంది. దీని ప్రకారం ఒక్కో ఎకరాకు 35 రోజుల వ్యవధిలో 4 బస్తాల యూరియా అవసరం. జిల్లాలో రబీ నాట్లు కూడా ఊపందుకున్న ప్రస్తుత తరుణంలో యూరియా కొరత రైతులను కలవరపరుస్తోంది.
డిమాండ్ ఎక్కువ.. సరఫరా తక్కువ
జిల్లావ్యాప్తంగా రబీ సాధారణ సాగు విస్తీర్ణం 60,042 హెక్టార్లు. ఈ నెల 3వ తేదీ నాటికి 8,227 హెక్టార్లలో రైతులు వరి నాట్లు వేశారు. ఈ పరిస్థితుల్లో యూరియా వినియోగం పెరిగింది. డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో రైతులు ఇబ్బందులు చవి చూస్తున్నారు. మూడు జిల్లాలకు 2,200 మెట్రిక్ టన్నుల చొప్పున యూరియా సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) వద్ద ప్రస్తుతం 2,626 మెట్రిక్ టన్నులు, ప్రైవేటు డీలర్ల వద్ద 2,811 మెట్రిక్ టన్నుల చొప్పున మొత్తం 5,437 మెట్రిక్ టన్నులు మాత్రమే యూరియా నిల్వలున్నాయి. అవసరమైన మేరకు గ్రామాల్లోని సొసైటీలకు యూరియా సరఫరా కావడం లేదు. డిమాండు ఎక్కువగా ఉండటంతో ఎప్పుడు వచ్చిన యూరియా అప్పడే అయిపోతోంది.
అధికంగా దండుతున్న డీలర్లు
ఇదే అదునుగా ప్రైవేటు డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తూ అధికంగా వసూలు చేస్తున్నారు. పీఏసీఎస్‌ల వద్ద 45 కిలోల బస్తా యూరియా రూ.266.50కే లభిస్తుండగా.. ప్రైవేటు డీలర్లు రూ.300కు పైగా విక్రయిస్తున్నారు. గతంలో రవాణా, దిగుమతి చార్జీలను ఎరువుల కంపెనీలు భరించేవి. ఇప్పుడు ఈ భారాన్ని చెరొక 50 శాతం భరించాలని కంపెనీలు చెబుతున్నాయి. అయితే, అదనపు భారాన్ని భరించేందుకు సొసైటీలు ముందుకు రావడం లేదు. ఫలితంగా అవసరమైన మేరకు సొసైటీలకు ఎరువులు రావడం లేదని చెబుతున్నారు. ప్రైవేటు డీలర్లు మాత్రం రవాణా, దిగుమతి చార్జీల పేరుతో అదనంగా మరో రూ.25 నుంచి రూ.35 పైగా వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ వారి వద్ద కూడా సరిపడినంత యూరియా లభ్యం కావడం లేదు. సొసైటీలకు వస్తున్న కొద్దిపాటి యూరియాను సిఫారసులతో వస్తున్న వారికి, పెద్ద రైతులకు కేటాయిస్తున్నారు. దీంతో చిన్న, సన్నకారు రైతులు ప్రైవేటు డీలర్లను ఆశ్రయించక తప్పడం లేదు.
కావల్సింది 25.. ఇచ్చింది 5
నేను 20 ఎకరాల్లో వరి నాట్లు వేశాను. ఒక విడతకు 25 బస్తాల యూరియా అవసరం. మలకపల్లి సొసైటీలో మాత్రం 5 బస్తాలే ఇచ్చారు. దీంతో మొత్తం పొలమంతటికీ ఒకేసారి ఎరువు వేసే అవకాశం లేకుండా పోయింది. నిత్యం యూరియా కోసం సొసైటీ చుట్టూ తిరుగుతున్నా. అష్టకష్టాలు పడుతున్నాం.
– యండపల్లి గంగాధర్, రైతు, పెద్దేవం,
తాళ్లపూడి మండలం
పనులు మానుకొని పడిగాపులు
యూరియా ఎప్పుడు వస్తుందో తెలియక పనులు మానుకోని సొసైటీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా. నిత్యం చుట్టుపక్కల రైతులం అధిక సంఖ్యలో సొసైటీ గోదాముకు వచ్చి పడిగాపులు పడుతున్నాం. అదును దాటిపోతోంది. ప్రభుత్వం ఎరువులు సకాలంలో అందించి రైతులను ఆదుకోవాలి. యూరియా కోసం పది రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్నాం.
– గుండేపల్లి సత్యనారాయణ, రైతు, పెద్దేవం,
తాళ్లపూడి మండలం
కొరత లేదు
రైతులు మోతాదుకు మించి యూరియా వాడుతున్నారు. జిల్లాలో యూరియాకు కొరత లేదు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. యూరియాతో పాటు పొటాష్, సూపర్, ఇతర కాంప్లెక్స్ ఎరువులు వాడుకోవాలి. నాట్ల సమయంలో ఎకరాకు 25 కిలోల యూరియా వేస్తే సరిపోతుంది. రైతులు 50 కిలోలు వరకూ వేస్తున్నారు. కాంప్లెక్స్ ఎరువుల బస్తా రూ.1,300కు పైగా ఉంది. అందువలన తక్కువ ధరకే వస్తోందని యూరియా అధికంగా వాడుతున్నారు. –ఎస్.మాధవరావు,
జిల్లా వ్యవసాయ అధికారి, రాజమహేంద్రవరం
పది రోజులుగా ఇక్కట్లు
యూరియా కోసం జిల్లా రైతులు పది రోజులుగా అవస్ధలు పడుతున్నారు. సొసైటీలకు తక్కువ మొత్తంలో కేటాయించడంతో అధికారులు ఒక్కో రైతుకు పరిమితంగానే యూరియా ఇస్తున్నారు. అయినప్పటికీ ఫలితం లేదు. ఈ నెల పదో తేదీ నాటికి 2,500 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత రబీలో అన్ని రకాల ఎరువులూ కలిపి జిల్లాకు 1.10 లక్షల మెట్రిక్ టన్నులు అవసరమని అధికారులు లెక్క తెల్చారు. దీనిలో 80 శాతం యూరియానే వినియోగిస్తున్నారని చెబుతున్నారు. కానీ, దీనికి తగినట్టుగా కేటాయింపులు లేకపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణంగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment