గోదావరిలో గల్లంతై యువకుడి మృతి
ముమ్మిడివరం: ఒక్కగానొక కుమారుడు.. అనుకోని ప్రమాదంలో మృతి చెందడంతో తమకు దిక్కెవరంటూ ఆ కుటుంబ సభ్యులు బోరున విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ముమ్మిడివరం మండలం కొత్తలంక వృద్ధ గౌతమీ గోదావరి పాయలో మునిగి బీటెక్ విద్యార్థి మంగ విజయ వీరమణికంఠ గల్లంతు కాగా, అతని మృతదేహం ఆదివారం స్థానిక పుష్కర రేవులో లభ్యమైంది. వీరమణికంఠ ఇద్దరు స్నేహితులతో కలసి శుక్రవారం గోదావరి పాయ వద్దకు వెళ్లి స్నానం చేస్తుండగా గల్లంతైన విషయం తెలిసిందే. మృతుడి తల్లిదండ్రులు మంగ మహాలక్ష్మి, నాగేశ్వరరావు దంపతులు, కుటుంబ సభ్యులు ఆ యువకుడి మృతదేహాన్ని చూసి తల్లడిల్లిపోయారు. ఉన్నత చదువులు చదివి ప్రయోజకుడు అవుతాడకున్నామని, తన చెల్లులకు చేదోడుగా ఉంటాడని కలలు కన్నామని, ఇంతలో దేవుడు తమకు అన్యాయం చేశాడంటూ కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతదేహానికి ముమ్మిడివరం ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు ఎస్సై డి.జ్వాలాసాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment