మరింత రుచిగా ప్రసాదం
ఫ ఈఓ సుబ్బారావు ఆదేశం
ఫ సత్యదేవుని ప్రసాదం తయారీ విభాగంలో ఆకస్మిక తనిఖీ
ఫ నేతి కొనుగోళ్లపై ఆరా
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో గోధుమ నూక ప్రసాదాన్ని మరింత రుచిగా, శుచిగా, భక్తులందరూ సంతృప్తి చెందేలా తయారు చేయాలని అన్నవరం ఆ విభాగం అధికారులను దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు ఆదేశించారు.
సత్యదేవుని ప్రసాదం తయారీలో ఉపయోగించే నేతిని టెండర్ ద్వారా కాకుండా సహకార డైరీల నుంచి కొనుగోలు చేయడం వలన దేవస్థానానికి రూ.67 లక్షల అదనపు భారం పడిన విషయాన్ని ‘నేతి చమురు వదిలిపోతోంది’ శీర్షికన సాక్షి దినపత్రిక సోమవారం వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఈఓ సుబ్బారావు మంగళవారం ప్రసాదం తయారీ విభాగాన్ని ఆకస్మికంగా ఆకస్మికంగా తనిఖీ చేశారు. వేడి ప్రసాదాన్ని రుచి చూశారు. ప్రసాదం తయారీలో వాడే దినుసుల కొనుగోలుపై పీఆర్‌ఓ కృష్ణారావు, సూపరింటెండెంట్ భాస్కర్ తదితరులను అడిగి తెలుసుకున్నారు. ప్రసాదం తయారీకి అవసరమైన గోధుమ నూక, పంచదార, యాలకులు టెండర్ ద్వారా కొనుగోలు చేస్తున్నామని, నెయ్యి మాత్రం ప్రభుత్వ ఆదేశాల మేరకు సంగం డెయిరీ నుంచి కొంటున్నామని వారు చెప్పారు. ఒక కళాయిలో 15 కిలోల గోధుమ నూక, 30 కిలోల పంచదార, ఆరు కేజీల నెయ్యి, 200 గ్రాముల యాలకులు, తగినంత నీటితో సుమారు 80 కేజీల ప్రసాదం తయారవుతుందని వివరించారు. ఒక కళాయి ప్రసాదంతో 150 గ్రాముల ప్రసాదం ప్యాకెట్లు 533 తయారవుతాయని తెలిపారు. ఒక్కో ప్యాకెట్టును రూ.20కి విక్రయిస్తున్నామని, రోజుకు 60 నుంచి 70 కళా యిల ప్రసాదం తయారు చేస్తున్నామని చెప్పారు. సాధారణ రోజుల్లో తెల్లవారుజామున 5 గంటల నుంచి, కార్తిక మాసం వంటి పర్వదినాల్లో అర్ధరాత్రి నుంచి ప్రసాదం తయారు చేస్తామన్నారు. నిల్వ ఉండే బంగీ ప్రసాదం కూడా తయారు చేస్తామని, అయితే గోధుమ నూక ప్రసాదాలతో పోల్చితే దీని తయారీ 5 శాతం మాత్రమే ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా ఈఓ సుబ్బారావు మాట్లాడుతూ, నెయ్యి మినహా మిగిలిన దినుసులను టెండర్ ద్వారా కొనుగోలు చేస్తున్నామని, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నేతిని సంగం డెయిరీ నుంచి కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ఇకపై తరచూ ప్రసాదం విభాగాన్ని సందర్శిస్తానని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment