కొవ్వూరులో టీఢీపీ
మామా అల్లుళ్ల సవాల్?
రాజీవ్‌కృష్ణ దివంగత ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు అల్లుడు. కాగా, కృష్ణబాబు సోదరుడైన ఆంధ్రా సుగర్స్ మేనేజింగ్ డైరెక్టర్ పెండ్యాల అచ్చిబాబు కొవ్వూరులో టీడీీపీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆయనకు అధిష్టానం వద్ద మంచి పేరుంది. తాను ఎవరికి చెబితే వారికి ఎమ్మెల్యే టికెట్ వచ్చేలా పావులు కదపడంలో దిట్ట. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో సైతం మాజీ మంత్రి జవహర్‌కు కాకుండా ఎవరికి ఇచ్చినా అభ్యంతరం లేదని పట్టుబట్టారు. దీంతో, అధిష్టానం గోపాలపురం నియోజకవర్గానికి చెందిన ముప్పిడి వెంకటేశ్వరావుకు ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఖరారు చేసింది. అంత పట్టున్న తనకు కనీస సమాచారం ఇవ్వకుండా.. విశాఖ ఎంపీ భరత్ నేతృత్వంలో రాజీవ్‌కృష్ణ టీడీపీలో చేరడంపై ఆయన చినమామ అయిన అచ్చిబాబు అసంతృప్తితో ఉన్నారని తెలిసింది. దీనికితోడు జవహర్ వర్గాన్ని దగ్గరకు తీస్తూండటం కూడా ఆయనకు మింగుడు పడటం లేదు. ఈ కారణంతోనే రాజీవ్‌కృష్ణ చేరిక సమయంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, పెండ్యాల అచ్చిబాబు దూరంగా ఉన్నారని అంటారు.
ఫ కత్తులు దూస్తున్న రెండు వర్గాలు
ఫ రాజీవ్‌కృష్ణ వర్గం బలపడితే తమకు ప్రాధాన్యం ఉండదని భావిస్తున్న మరో గ్రూపు
ఫ వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు
ఫ లోకేష్ వద్దకు పంచాయితీ
ఫ సయోధ్య కుదిర్చే బాధ్యత ఉత్తరాంధ్ర నేతకు..
ఫ ససేమిరా అంటున్న ఇరు వర్గాలు
సాక్షి, రాజమహేంద్రవరం: అధికార టీడీపీ నేతలు కొవ్వూరులో ఢీ అంటే ఢీ అంటున్నారు. మాజీ మంత్రి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్, ద్విసభ్య కమిటీ సభ్యుల మధ్య ఇప్పటికే తీవ్ర స్థాయిలో విభేదాలున్న సంగతి తెలిసిందే. దివంగత ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు అల్లుడు రాజీవ్‌కృష్ణ, ఆయన వర్గీయులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సమక్షంలో కొన్నాళ్ల కిందట టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆ పార్టీలో వర్గ విభేదాలు మరింతగా భగ్గుమంటున్నాయి. రాజీవ్‌కృష్ణ చేరికపై అగ్గి మీద గుగ్గిలమైన ఆయన వ్యతిరేక వర్గం ఇటీవల ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఎదుట ఆందోళనకు దిగింది. రాజీవ్‌కృష్ణ చేరికను జవహర్ వర్గం స్వాగతిస్తూంటే.. ద్విసభ్య కమిటీలోని ఓ సభ్యుడి వర్గం వ్యతిరేకిస్తోంది. రాజీవ్‌కృష్ణ చేరిక వలన పార్టీలో తన ఆధిపత్యానికి చెక్ పడుతుందనే భావనతోనే ఇలా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.
ద్విసభ్య కమిటీలో చీలిక?
మాజీ మంత్రి జవహర్, సీనియర్ నేత పెండ్యాల అచ్చిబాబు వర్గాల మధ్య విభేదాలను చల్లార్చేందుకు టీడీపీ అధిష్టానం గతంలో ద్విసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. జవహర్ వర్గం నుంచి జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, పెండ్యాల అచ్చిబాబు వర్గం నుంచి కంఠమణి శివరామకృష్ణ ఇందులో సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతం ఈ కమిటీ రెండుగా చీలిపోయింది. మరో వర్గం నేతల వ్యవహార శైలి నచ్చకపోవడంతో జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో సైతం అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. దీంతో ద్విసభ్య కమిటీ కాస్తా ఏకసభ్య కమిటీగా మారిపోయింది. మరో సభ్యుడైన కంఠమణి రామకృష్ణ నేతృత్వంలోని ఏకసభ్య కమిటీ మాత్రమే ప్రస్తుతం పార్టీ వ్యవహాలు చూస్తోంది. అది కూడా ఎమ్మెల్యేని సైతం పక్కన పెట్టేసి, అన్నీ తామై వ్యవహరిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం ఎమ్మెల్యేకి సైతం తలనొప్పిగా మారిందని, చేసేది లేక మిన్నకుండిపోతున్నారని సమాచారం.
అందుకే వ్యతిరేకిస్తున్నారా?
నియోజకవర్గంలో రాజీవ్‌కృష్ణ బలపడితే తమకు ప్రాధాన్యం దక్కదని, తమ ఇసుక, ఇతర వ్యాపారాలకు గండి పడుతుందని భావిస్తున్న వర్గం మాత్రమే ఆయనను వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. త్వరలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందనే చర్చ విస్తృతమవుతోంది. అదే జరిగితే కొవ్వూరు నియోజకవర్గం ప్రస్తుతం ఉన్న ఎస్సీ నుంచి జనరల్‌గా మారే అవకాశం ఉందని అంటున్నారు. అప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిత్వం రాజీవ్‌కృష్ణ కుటుంబానికే దక్కుతుందనే ప్రచారం జోరందుకుంది. ఒకవేళ అలాగే జరిగితే నియోజకవర్గం తమ చేతి నుంచి జారిపోతుందనే భావనలో కంఠమణి వర్గం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనికి తగినట్లు రాజీవ్‌కృష్ణకు మద్దతుగా ఇటీవల న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ పెద్ద బ్యానర్లు దర్శనమిచ్చాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం నియోజకవర్గలో హాట్ టాపిక్‌గా మారింది.
విభేదాలు లేవంటూనే..
కొవ్వూరు టీడీపీలో గ్రూపు విభేదాల ‘పంచాయితీ కాస్తా’ ప్రస్తుతం లోకేష్ వద్దకు చేరింది. ఆయన జోక్యం చేసుకున్నా విభేదాల అగ్గి మాత్రం చల్లారడం లేదు. ఎవరికి వారే అన్నట్లుగా పార్టీ కార్యక్రమాలు వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఉత్తరాంధ్రకు చెందిన ఓ టీడీపీ ముఖ్య నేతను రంగంలోకి దింపారు. ఆయన ఇరు వర్గాలతో ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. అయితే, అచ్చిబాబు, ఆయన వర్గీయులు మాత్రం పార్టీలో ఎలాంటి విభేదాలూ లేవని, రాజీవ్‌కృష్ణ చేరికతో తమకు ఎలాంటి ఇబ్బందీ లేదని చెప్పిట్లు సమాచారం.
పైకి అలా చెబుతూనే లోలోపల మాత్రం రాజీవ్ వర్గాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది. లోకేష్ ఆదేశాలను సైతం లెక్క చేయకుండా వర్గాలు విడిపోవడంపై అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. పార్టీలో చేరిన వారిని కలుపుకోలేకపోతూండటంపై లోకేష్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారం దేనికి దారి తీస్తుందోనని నియోజకవర్గ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment