ఉత్తరాది భక్తజన వాహిని
ఫ రత్నగిరికి ఏటా శీతాకాలంలో రాక
ఫ టూరిస్టు బస్సులలోనే వేల కిలోమీటర్ల ప్రయాణం
ఫ సొంతంగా వంటలు
ఫ బస్సు వద్దనే బస
ఫ సత్యదేవుని సన్నిధిలో సందడి చేస్తున్న భక్తులు
అన్నవరం: అయోధ్యలో బాలరాముడి దర్శనానికో.. కాశీ విశ్వనాథుని సన్నిధానానికో.. చార్‌ధామ్ యాత్రకో దక్షిణాది రాష్ట్రాల నుంచి భక్తులు ఉత్తర భారత్‌కు పోటెత్తడం సహజం. కానీ, ఉత్తరాదికి చెందిన భక్తులు దక్షిణ భారత్‌కు.. అందునా భక్తవరదుడైన సత్యదేవుని సన్నిధికి ప్రస్తుతం వేలాదిగా తరలివస్తున్నారు. సాధారణంగా ఉత్తరాది రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో వ్యవసాయ పనులు డిసెంబర్‌లో పూర్తవుతూంటాయి. దీంతో, అక్కడి భక్తులు ఇదే సమయంలో తీర్థయాత్రలకు శ్రీకారం చుడతారు. ఈవిధంగా డిసెంబర్‌లోనే అన్నవరం సత్యదేవుని సన్నిధికి వారి రాక ఆరంభమైంది. ఈ నెలలో వారి సందడి మరింత పెరిగింది. రెండు వారాల నుంచి వందలాది టూరిస్టు బస్సులలో వేలాదిగా ఉత్తరాది భక్తులు అన్నవరం తరలివస్తున్నారు. వారు వస్తున్న బస్సులతో కొండ దిగువన ఉన్న కళాశాల మైదానం నిండిపోతోంది. ఎక్కువగా మధ్య తరగతికి చెందిన మధ్య వయస్కులే ఈ యాత్రలు చేస్తూండటం విశేషం.
సమూహాలుగా..
గతంలో భక్తులందరూ టూరిస్టు బస్సులలోనే తీర్థయాత్రలు చేసేవారు. కానీ, ఇప్పుడు రైళ్లు, కార్లలో యాత్రలు చేస్తున్నవారే అధికంగా కనిపిస్తున్నారు. కానీ, ఉత్తరాది భక్తులు మాత్రం ఇప్పటికీ సమూహాలుగా టూరిస్టు బస్సులలోనే యాత్రలు చేస్తూండటం విశేషం. వేలాది కిలోమీటర్లు బస్సులలోనే ప్రయాణించడం వీరి ప్రత్యేకత. కనీసం పది బస్సులకు తక్కువ కాకుండా గరిష్టంగా 50 బస్సులలో కూడా భక్తులు వచ్చిన సందర్భాలున్నాయి. వీరు తమ బస్సులను గతంలో రత్నగిరిపై నిలుపు చేసి సత్యదేవుని దర్శనానికి వెళ్లేవారు. అయితే కొన్నాళ్లుగా కొండ దిగువన కాలేజీ మైదానంలో దేవస్థానం అన్ని వసతులూ కల్పించడంతో వీరు అక్కడే తమ బస్సులు నిలుపు చేసి, సత్యదేవుని దర్శించుకుంటున్నారు. ఉత్తరాది భక్తుల్లో ఎక్కువ మంది కొండ దిగువ నుంచి కాలి నడకనే సత్యదేవుని ఆలయానికి వెళ్లి, తిరిగి తమ బస్సుల వద్దకు చేరుకుంటున్నారు. పంపా ఘాట్‌లో స్నానం చేసి, ఘాట్ రోడ్డు మీదుగా నడుస్తూ ఆలయానికి వెళ్లేవారే ఎక్కువగా కనిపిస్తున్నారు.
సొంత వంట
సాధారణ భక్తులతో పోలిస్తే ఉత్తరాది భక్తుల వ్యవహార శైలి భిన్నంగా కనిపిస్తూంటుంది. వీరు వంట సామగ్రి, పొయ్యలు, గ్యాస్ సిలిండర్లు కూడా తమ వెంట తెచ్చుకుంటారు. బస్సులను నిలుపు చేసిన చోటే వంటలు చేసుకుని, సామూహికంగా భోజనాలు చేస్తూంటారు. బయట ఎక్కడా హోటళ్లలో కొనుక్కుని తినరు. ఫలహారమైనా, చపాతీలైనా, పూరీలైనా వండుకోవల్సిందే. ప్రతి బస్సులో ఒక వంట మేస్త్రి, ఇద్దరు సహాయకులు ఉంటారు. వీరికి మరి కొంత మంది భక్తులు సహాయం చేస్తారు. ఎక్కువగా చపాతీలు, పూరీలు, టమాటా – బంగాళాదుంప కూర వండుకుంటూంటారు. అవసరమైన గోధుమ పిండి, నూనె, బంగాళా దుంపలు, టమాటాలు, ఇతర కూరగాయలు వెంట తెచ్చుకుంటారు. అవి అయిపోతే స్థానికంగా కొనుక్కుంటారు. అందరూ వరుసగా కూర్చుని తింటూంటారు. దగ్గరలో సత్రాలుంటే వాటిలో హాల్స్ అద్దెకు తీసుకుని బస చేస్తారు. ఒకవేళ సత్రాలు లేకపోతే బస్సుల వద్దనే విశ్రమించడం వీరికి అలవాటు. చివరకు ధరించే వస్త్రాలు కూడా బస చేసిన చోటనే ఉతుక్కుని ఆరబెట్టుకుంటారు. అన్నవరానికి ఈ నెలాఖరు వరకూ ఉత్తరాది భక్తుల యాత్ర కొనసాగనుంది.
ఉపయోగపడుతున్న విశ్రాంతి షెడ్లు
టూరిస్టు బస్సులలో వస్తున్న భక్తుల కోసం కళాశాల మైదానంలో దేవస్థానం గతంలో విశ్రాంతి షెడ్లు నిర్మించింది. మొత్తం ఐదు విశ్రాంతి షెడ్లు, ఒక వంట చేసుకునే షెడ్డును 2023లో అప్పటి ఈఓ చంద్రశేఖర్ ఆజాద్ హయాంలో నిర్మించారు. వీటిలో అవసరమైన వసతులను గత ఏడాది నాటి ఈఓ కె.రామచంద్ర మోహన్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ షెడ్లు ఈ భక్తులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment