నేతి చమురు వదిలిపోతోంది
ఫ తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వివాదం ఫలితం
ఫ అన్ని దేవస్థానాల్లో టెండర్ ద్వారా ఆవు నెయ్యి కొనుగోలుకు ప్రభుత్వం బ్రేక్
ఫ విధాన నిర్ణయం తీసుకునే వరకూ సహకార డెయిరీల నుంచి కొనాలని ఆదేశం
ఫ సర్కారు నిర్ణయంతో సత్యదేవుని ప్రసాదం తయారీ మరింత ప్రియం
ఫ ఇప్పటికే సుమారు రూ.67 లక్షల భారం
అన్నవరం: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని సామెత. సరిగ్గా ఇదే విధంగా తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారనే ఆరోపణలతో రాష్ట్రంలోని అన్ని దేవస్థానాల్లోనూ టెండర్ ద్వారా నెయ్యి కొనుగోలును ప్రభుత్వం నిలిపివేసింది. దీనిపై పూర్తి స్థాయిలో విధానపరమైన నిర్ణయం తీసుకునేంత వరకూ సహకార డెయిరీల నుంచి నెయ్యి కొనుగోలు చేయాలని ఆదేశించింది. సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం అన్నవరం దేవస్థానంపై అదనపు భారం మోపుతోంది. సత్యదేవుని ప్రసాదంలో ఉపయోగించే ఆవు నెయ్యిని టెండర్ ద్వారా కాకుండా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సహకార డెయిరీల నుంచి అధిక రేటుకు కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఫలితంగా తాజా లోయెస్ట్ టెండర్ రేటుతో పోల్చి చూస్తే గత మూడు నెలల్లో దేవస్థానం నెయ్యి కొనుగోలుకు రూ.67 లక్షలు పైగా వెచ్చించాల్సి వచ్చింది. చాలా కాలం నుంచి అన్నవరం దేవస్థానం అవసరాలకు ఆవు నెయ్యిని టెండర్ ద్వారానే కొనుగోలు చేస్తున్నారు. ఎప్పుడూ నెయ్యి నాణ్యతపై ఇక్కడ ఎటువంటి వివాదమూ తలెత్తలేదు. అయినప్పటికీ ప్రభుత్వం టెండర్ ద్వారా నెయ్యి కొనవద్దని ఆదేశించడంతో దేవస్థానానికి శ్రీనేతిశ్రీ చమురు వదిలిపోతోంది.
ఇదీ గత విధానం
అన్నవరం దేవస్థానంలో ప్రసాదం తయారీకి ఏటా సుమారు 2 లక్షల కిలోల నెయ్యి ఉపయోగిస్తున్నారు. ప్రతి నెలా సుమారు 12 వేల కేజీల నుంచి 20 వేల కేజీల వరకూ వినియోగిస్తారు. ఆరు నెలలకోసారి టెండర్ పిలిచి నెయ్యి కొనుగోలు చేస్తూంటారు. దీనికోసం దేవస్థానం ఏటా రూ.6 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకూ ఖర్చు చేస్తోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో లోయెస్ట్ టెండర్ ఖరారయ్యాక మళ్లీ రివర్స్ టెండర్ ద్వారా ఎవరు తక్కువకు ఇస్తే వారి నుంచే కొనుగోలు చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం రైతు డెయిరీ సంస్థ టెండర్ ద్వారా 2022 నుంచి రెండేళ్ల పాటు కేజీ ఆవు నెయ్యిని రూ.564కే సరఫరా చేసింది. ఆ టెండర్ కాలపరిమితి ముగియడంతో గత ఏడాది అక్టోబర్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకూ ఆవు నెయ్యి సరఫరాకు ఈ–ప్రొక్యూర్‌మెంట్ టెండర్ పిలిచారు. తరువాత రివర్స్ టెండర్ ద్వారా తిరుపతికి చెందిన వినాయక ఏజెన్సీ కిలో నెయ్యి రూ.484కు, విశాఖ డెయిరీ కిలో రూ.488కి సరఫరా చేయడానికి కొటేషన్లు దా ఖలు చేశాయి. ఎల్–1గా ఉన్న వినాయక ఏజెన్సీకి టెండర్ దక్కింది. అయితే తిరుమల లడ్డూ తయారీకి సరఫరా చేస్తున్న నెయ్యి కల్తీ అయిందనే ఆరోపణలతో నెయ్యి కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసి, సహకార డెయిరీల నుంచి కొనుగోలు చేయాలని ఆదేశించింది.
చమురు వదులుతోందిలా..
ఫ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గత ఏడాది అక్టోబర్ 10 నుంచి నవంబర్ 10వ తేదీ వరకూ విజయవాడలోని విజయా డెయిరీ నుంచి 15 టన్నుల ఆవునెయ్యిని కేజీ రూ.640 చొప్పున కొనుగోలు చేశారు. గతంలో రైతు డెయిరీ సరఫరా చేసిన ఆవు నెయ్యి కిలో రూ.564. ఇది గతంలో రైతు డెయిరీ రేటు కంటే రూ.76 ఎక్కువ. దీని ప్రకారం 15 టన్నులకు అన్నవరం దేవస్థానం రూ.12.40 లక్షలు అధికంగా చెల్లించినట్లు తెలుస్తోంది. అలాగే, తాజా లోయెష్ట్ టెండర్ రేటు రూ.484తో పోలిస్తే కేజీకి రూ.156 ఎక్కువ. దీని ప్రకారం 15 టన్నులకు రూ.23.40 లక్షలు అదనంగా వదిలిపోయింది.
ఫ నవంబర్ పదో తేదీ నుంచి సంగం డెయిరీ ఆవు నెయ్యి కేజీ రూ.595కి కొనుగోలు చేస్తున్నారు. రైతు డెయిరీ నెయ్యి కేజీ ధర రూ.564తో పోలిస్తే సంగం ధర రూ.31 అధికం. సంగం డెయిరీ నుంచి ఇప్పటి వరకూ 40 టన్నులు కొనుగోలు చేయగా కేజీకి అదనంగా రూ.31 చొప్పున రూ.12.4 లక్షలు అధికంగా చెల్లించాల్సి వచ్చింది. అదే తాజా టెండర్ రేటు కేజీ రూ.484తో పోలిస్తే కేజీకి రూ.111 ఎక్కువ. దీని ప్రకారం ఏకంగా రూ.44.40 లక్షలు అధికంగా చెల్లించినట్లయ్యింది.
ఫ గత ఏడాది ఆగస్టులో పిలిచిన లోయెష్ట్ టెండర్‌దారు వినాయక ఏజెన్సీ నుంచి ఆవు నెయ్యి కొనుగోలు చేస్తే దేవస్థానానికి రూ.67.80 లక్షలు ఆదా అయ్యేది. లేదా రైతు డెయిరీ నుంచి కొనుగోలు చేసినా సుమారు రూ.25 లక్షలు ఆదా అయ్యేది.
ఫ నెయ్యి కొనుగోలుకు ఈవిధంగా చెల్లిస్తున్న ధర టెండర్ రేటుకంటే అధికంగానే ఉందని అధికారులు కూడా చెబుతున్నారు. సహకార డెయిరీల ద్వారా టెండర్లు ఆహ్వానించినా.. ఇప్పుడు కొనుగోలు చేసిన దాని కన్నా తక్కువ రేటుకే దేవస్థానానికి ఆవునెయ్యి లభించేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నాణ్యమైనదని తేలితేనే..
దేవస్థానానికి సరఫరా చేసిన నెయ్యి నాణ్యత విషయంలో గతంలో ఎప్పుడూ ఎటువంటి వివాదమూ లేదు. ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరించి టెండర్‌దారు నాణ్యమైన నెయ్యి సరఫరా చేయాలి. ఆ మేరకు ల్యాబ్ సర్టిఫికెట్లు జత చేస్తారు. అయినప్పటికీ దేవస్థానం కూడా విజయవాడలోని ల్యాబ్‌కు శాంపిల్స్ పంపించి మళ్లీ పరీక్షలు చేయిస్తుంది. నాణ్యమైన నెయ్యి అని తేలితేనే దానిని ప్రసాదంలో ఉపయోగిస్తామని అధికారులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment