8, 9 తేదీల్లో ప్రపంచ తెలుగు మహాసభలు
రాజానగరం: తెలుగు భాష సంస్కృతీ సాహిత్యాలను కాపాడుతూ, భావితరాలకు మాతృ భాషను సమృద్ధిగా అందించాలనే సంకల్పంతో ఈ నెల 8, 9 తేదీల్లో స్థానిక గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జీజీయూ)లో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించనున్నామని యూనివర్సిటీ చాన్సలర్ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు) తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆదివారం ఆవిష్కరించారు. గత ఏడాది జనవరిలో మూడు రోజులపాటు జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు ప్రాంగణంలోనే ఆదికవి నన్నయ, రాజరాజనరేంద్ర, కందుకూరి వీరేశలింగం పేరిట వేదికలను ఏర్పాటు చేసి, ఈ సభలను నిర్వహించనున్నామని అన్నారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణలతోపాటు పలువురు కేంద్రం మంత్రులు, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి గవర్నర్లు, మంత్రులు, స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సినీ నటులు, న్యాయకోవిధులు, భాషా పండితులు, రచయితలు హాజరవుతారన్నారు. వీసీ డాక్టర్ యు.చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇందుకు సంబంధించిన కార్యక్రమాలు సోమవారం ఉదయం 6 గంటలకు గణపతి పూజతో ప్రారంభమవుతాయన్నారు. 7న అబ్బురపరిచే ఆవిష్కరణలు ఉంటాయన్నారు. సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు 560 మంది కవులచే కవితా గోష్టులు ఉంటాయన్నారు. ఈ ప్రాంగణంలో అయోధ్యలోని బాలరాముని ఆలయం నమూనాను సాంకేతిక పరిజ్ఞానంతో అందరినీ ఆకట్టుకునే రీతిలో నిర్మిస్తామన్నారు. ఈ సభలను విజయవంతం చేయడానికి 18 కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో సాహితీవేత్త యర్రాప్రగడ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment