సైన్స్ సంబరానికి వేళాయె..
విజయవంతం చేయాలి
పాఠశాల విద్యాశాఖ, ఎస్‌సీఈఆర్‌టీ ఆదేశాల మేరకు ఈ విద్యా సంవత్సరానికి గాను జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నేడు జరుగుతుంది. హెచ్‌ఎంలు, ముఖ్యంగా సైన్స్ ఉపాధ్యాయులు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలి. సైన్స్ ఎగ్జిబిషన్‌ను విజయవంతం చేయాలి.
– కె.వాసుదేవరావు, జిల్లా పాఠశాల
విద్యాశాఖాధికారి, రాజమహేంద్రవరం
సృజనాత్మకతను వెలికితీసేందుకే..
విద్యార్ధుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకే మండల స్థాయి పోటీలు నిర్వహించి, జిల్లా స్థాయికి ఎంపిక చేశాం. శాసీ్త్రయ దృక్పథం, సామాజికంగా ప్రయోజనకరంగా ఉండే ప్రాజెక్టులను ఎంపిక చేశాం. జిల్లాలోని 19 మండలాల నుంచి 57, అటల్ టింకరింగ్ ల్యాబ్‌ల నుంచి 32 చొప్పున ప్రాజెక్టులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యాయి.
– జీవీఎన్‌ఎస్ నెహ్రూ,
జిల్లా సైన్స్ అధికారి, రాజమహేంద్రవరం
●
● నేడు జిల్లా స్థాయి దక్షిణ
భారత విద్యా వైజ్ఞానిక ప్రదర్శన
● శ్రీ సత్యసాయి గురుకులంలో
పూర్తయిన ఏర్పాట్లు
● 89 ప్రాజెక్టుల ప్రదర్శన
● ఉత్తమ ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి ఎంపిక
రాజమహేంద్రవరం రూరల్: జిల్లా స్థాయి దక్షిణ భారత విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు రంగం సిద్ధమైంది. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను గుర్తించి, ప్రోత్సహించే లక్ష్యంతో స్థానిక శ్రీ సత్యసాయి గురుకులంలో శనివారం కార్యక్రమం నిర్వహించనున్నారు. జిల్లాలోని 217 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 8, 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులందరూ సైన్స్ ప్రాజెక్టుల ప్రదర్శనకు అర్హులు. గత నెల 31న నిర్వహించిన మండల స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన 57 ప్రాజెక్టులు జిల్లా స్థాయికి నేరుగా అర్హత సాధించాయి. మండల స్థాయి విజేతలుగా నిలిచిన విద్యార్థి వ్యక్తిగత విభాగంలో 19, విద్యార్థుల బృంద విభాగంలో 19, టీచర్ విభాగంలో 19 ప్రదర్శనలను జిల్లా పోటీలకు ఎంపిక చేశారు. వీటితో పాటు ఒక్కో అటల్ టింకరింగ్ ల్యాబ్ పాఠశాల నుంచి ఒక్కొక్కటి చొప్పున 32 ప్రాజెక్టులు కూడా ఎంపికయ్యాయి. జిల్లా స్థాయి విజేతలుగా నిలిచిన ప్రాజెక్టులను ఈ నెల 6, 7 తేదీల్లో అమరావతిలో జరిగే రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపిక చేస్తారు. సైన్స్ ప్రాజెక్టుల ప్రదర్శనకు జిల్లా నోడల్ అధికారిగా జిల్లా సైన్స్ అధికారి జీవీఎన్‌ఎస్ నెహ్రూను నియమించారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఎర్త్/స్పేస్ సైన్స్, ఎన్విరాన్‌మెంట్, ఇంజినీరింగ్, బయోసైన్స్/బయోకెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ అనే ఉప అంశాలపై మండల స్థాయి పోటీల్లో ప్రాజెక్టులను ప్రదర్శించారు. జిల్థా స్థాయి పోటీలను జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు పర్యవేక్షణలో నిర్వహించనున్నారు. జిల్లా స్థాయి సైన్స్ ప్రాజెక్టుల ప్రదర్శనలకు విద్యార్థులను ఉపాధ్యాయులు పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయాలని ఇప్పటికే సూచించారు. జ్యూరీ కమిటీకి ప్రాజెక్టు గురించి వివరించగలిగేలా తీర్చిదిద్దాలి. ఽథర్మకోల్‌తో తయారు చేసిన నమూనాలను ప్రదర్శనలకు అనుమతించరు.
Comments
Please login to add a commentAdd a comment