పన్ను ఆలస్యమైతే వడ్డీ చెల్లించాల్సిందే
● మున్సిపల్ ఆర్‌డీ నాగనరసింహారావు
● వివిధ అంశాలపై సమీక్ష
కొవ్వూరు: పట్టణాల్లోని ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించపోతే వడ్డీ మాఫీ ఉండదనే విషయాన్ని మున్సిపల్ మంత్రి స్పష్టం చేశారని, ప్రతి నెలా 2 శాతం వడ్డీ పెరుగుతుందనే విషయాన్ని గుర్తించాలని మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ (ఆర్‌డీ) సీహెచ్ నాగనరసింహారావు అన్నారు. తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల పరిధిలోని ఆరు మున్సిపాలిటీల అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా పట్టణాల్లో గోతులు లేని రోడ్ల నిర్మాణం కొంత జాప్యమైందని, ఈ నెలాఖరుకు గుంతల్లేని రోడ్ల తయారీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆదాయ పన్ను, నీటి పన్ను, ట్రేడ్ లైసెన్స్‌ల వసూళ్లు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. మున్సిపాలిటీల వారీగా పన్ను వసూళ్లపై సమీక్షించారు. పన్ను వసూళ్లలో వెనుకబడిన అమలాపురం, రామచంద్రపురం మున్సిపల్ అధికారులకు అక్షింతలు వేశారు. మార్చి నెలాఖరుకు నిర్దేశిత లక్ష్యాలు సాధించేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు. తడి, పొడి చెత్త వేరు చేయడంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పారిశుధ్యం, వీధిలైట్ల నిర్వహణ, తాగునీటి సరఫరా, అక్రమ కుళాయి కనెక్షన్ల గుర్తింపు, నోటీసుల జారీ తదితర విషయాలపై సమీక్షించారు. సచివాలయ సిబ్బంది ఉదయం పూట విధులకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. ఔరంగబాద్, క్రిస్ట్రియన్‌పేట, ఆవులవారి వీధి, శ్రీరామ కాలనీ సచివాలయ సిబ్బంది పనితీరు మెరుగుపరచుకోవాలన్నారు. అమలాపురం, రామచంద్రపురం, మండపేట, ముమ్మిడివరం, నిడదవోలు మున్సిపాలిటీల్లో నాలుగేసి సచివాయాల పనితీరు బాగోలేదన్నారు. కాకినాడ – రాజమహేంద్రవరం మధ్య గుంటూరులో మాదిరిగా జిందాల్ పవర్ సంస్థ ద్వారా సాలిడ్‌వేస్ట్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ ప్లాంటు నిర్మించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. లే అవుట్లు, భవన నిర్మాణాల అనుమతులు, నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవడంపై మున్సిపాలిటీల వారీగా సమీక్షించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు టి.నాగేంద్ర కుమార్, రెండు జిల్లాల పరిధిలోని రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, టౌన్‌ప్లానింగ్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment