పరిమతి లేకుండా..
● ఇసుక తవ్వకాల్లో నిబంధనలకు తిలోదకాలు
● ప్రభుత్వం నిర్దేశించిన పరిమితికి
మించి అక్రమ తవ్వకాలు
● పెండ్యాల, తీపర్రు, కోటిలింగాల
ర్యాంపుల్లో దందా
● ప్రతి రోజూ 500 పైగా లారీల్లో రవాణా
● పట్టించుకోని మైనింగ్ అధికారులు
సాక్షి, రాజమహేంద్రవరం: ఇసుకాసురులు బరి తెగిస్తున్నారు. గోదావరి నదిని గుల్ల చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లఘించి మరీ అడ్డగోలు వ్యవహారానికి తెర తీస్తున్నారు. ర్యాంపుల్లో ఇసుక తవ్వకాలకు పరి మితులు ముగిసినా లెక్క చేయకుండా యథేచ్ఛగా త వ్వకాలు సాగిస్తున్నారు. వందల లారీల ఇసుక అక్రమంగా తరలించి రూ.లక్షలు దండుకుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కో టిలింగాలు, పెరవలి మండలం కానూరు – పెండ్యా ల, తీపర్రు ర్యాంపుల్లో ఇసుక దందా మూడు ట్రాక్టర్లు –ఆరు లారీలు అన్న చందంగా సాగుతోంది. ఇదంతా తెలిసినా మైనింగ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదీ సంగతి
జిల్లా వ్యాప్తంగా ఉన్న ర్యాంపుల్లో ఇసుక తవ్వకాల బాధ్యతలను బోట్స్‌మెన్ సొసైటీలకు అప్పగించారు. సొసైటీ సభ్యులు ఇసుక తవ్వి ఒడ్డుకు చేరిస్తే.. దాన్ని ప్రజల అవసరాలకు సరఫరా చేస్తారు. దీనికి గాను జిల్లా అధికారులతో కూడిన జిల్లా స్థాయి శాండ్ అడ్వైజరీ కమిటీ (డీఎల్‌ఎస్‌ఏ) ఆయా ర్యాంపుల్లో ఏ మేరకు తవ్వకాలు జరపాలి, ఎంత ఇసుక విక్రయించాలనేది నిర్ణయిస్తుంది. అందుకు అనుగుణంగా ఆన్‌లైన్‌లో లక్ష్యం నిర్దేశిస్తుంది. కమిటీ నిర్ధారించిన లక్ష్యం పూర్తయిన వెంటనే తిరిగి తవ్వకాలు జరపాలంటే సదరు కమిటీ అనుమతులు పొందాల్సి ఉంది. జిల్లాలోని కొన్ని ర్యాంపుల్లో ఈ నిబంధనలకు నీళ్లొదిలారు. బోట్స్‌మెన్ సొసైటీల ముసుగులో ఇసుక మాఫియా రంగంలోకి దిగింది. ప్రభుత్వం నిర్దేశించిన తవ్వకాల పరిమితులు పూర్తయినా తమకేమీ పట్టనట్లు అక్రమ తవ్వకాలకు తెగబడుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి మరీ రాత్రుళ్లు యథేచ్ఛగా డ్రెడ్జింగ్ చేపట్టి వందల లారీల్లో ఇసుకను జిల్లా దాటించేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆ ర్యాంపులో అక్రమ దందా
కానూరు–పెండ్యాల ర్యాంపుల్లో అక్రమ దందా కొనసాగుతోంది. ర్యాంపులో 74,000 క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇప్పటికే పరిమితికి మించి ఒకటిన్నర కిలోమీటర్ల వరకూ తవ్వకాలు చేపట్టారు. ప్రభుత్వం నిర్దేశించిన పరిమితి ముగిసి మూడు రోజులవుతున్నా తవ్వకాలు మాత్రం ఇంకా ఆగడం లేదు. ప్రతి రోజూ ర్యాంప్ నుంచి 300 లారీల ఇసుక తరలిపోతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కానీ అధికారులు మాత్రం 6,000 క్యూబిక్ మీటర్ల తవ్వకాలే జరిగాయని చెబుతున్నారు. ఇదే అదునుగా భావించిన ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఒకే పర్మిట్‌పై పదుల సంఖ్యలో లారీల్లో ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించేస్తున్నారు. అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ పట్టించుకోవడం లేదు. ఇలా ప్రతి రోజూ 300కు పైగా లారీలు తరలుతున్నా 120 మాత్రమే వెళుతున్నాయని చెబుతున్నారు. దీని వెనుక రూ.లక్షలు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది.
కోటిలింగాలలో కొల్లగొట్టుడు
రాజమహేంద్రవరం అర్బన్‌లోని కోలిలింగాల రేవు వద్ద రీచ్‌ను 12 భాగాలుగా విభజించి తవ్వకాలు సాగిస్తున్నారు. దీనికి సైతం రెండు రోజుల క్రితమే ప్రభుత్వం అనుమతించిన తవ్వకాల పరిమితులు ముగిశాయి. ప్రభుత్వం నిర్దేశించిన 80,000 క్యూబిక్ మీటర్ల ఇసుక ఇప్పటికే తవ్వి తరలించేశారు. ఇకపై తవ్వకాలు చేపట్టాలంటే మళ్లీ అనుమతులు పొందాలి. కానీ, అవేమీ లేకుండానే యథేచ్ఛగా డ్రెడ్జింగ్ చేసి, ఇసుక కొల్లగొడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment