ఫుల్‌ జోష్‌ | - | Sakshi
Sakshi News home page

ఫుల్‌ జోష్‌

Published Tue, Dec 31 2024 2:42 AM | Last Updated on Tue, Dec 31 2024 2:42 AM

ఫుల్‌

ఫుల్‌ జోష్‌

మద్యం రాకతో ట్రాఫిక్‌ జామ్‌

కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మద్యం ఏరులా పారుతున్న విషయం తెలిసిందే. దుకాణాలతో పాటు వాటి వద్ద అనధికార పర్మిట్‌ రూమ్‌లు, బెల్ట్‌ షాపులు పెరగడంతో మద్యం వినియోగం అధికమైంది. దీనికి తగ్గట్టుగా నూనత సంవత్సర వేడుకల్లో మద్యం అమ్మకాలు అంచనాలకు మించి ఉంటాయని వ్యాపారులు నమ్మకంతో ఉన్నారు. ఇందుకు తగినట్టుగానే డిపోలకు అక్కడ నుంచి మద్యం దుకాణాలకు మద్యం రావాణా జోరుగా సాగుతోంది. కోనసీమ జిల్లా అమలాపురం మద్యం డిపోకు పెద్ద ఎత్తున మద్యం లోడులు చేరుకున్నాయి. ఇక్కడ బైపాస్‌ రోడ్డులోని మద్యం డిపో వద్దకు ఒకేసారి 15 నుంచి 20 వరకు మద్యం లారీలు రావడం, వెంటనే దుకాణాలకు తరలించేందుకు చిన్న చిన్న వ్యాన్లు రోడ్డు మీదనే ఉంచడంతో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయిందంటే, నూతన సంవత్సర వేడుకల్లో మద్యం అమ్మకాలపై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయనేది తేటతెల్లమవుతోంది.

న్యూ ఇయర్‌కు సర్వం సిద్ధం

రిస్టార్ట్స్‌, హోటళ్లు నెల రోజుల ముందే బుక్‌

గోదావరి బాట పట్టిన ఐటీ ఉద్యోగులు

పుట్టగొడుగులుగా బిర్యానీ సెంటర్లు

మద్యం దుకాణాల్లో ఫుల్‌ స్టాక్‌

సాక్షి, అమలాపురం: మరికొద్ది గంటల్లో న్యూ ఇయర్‌ రాబోతోంది. ఏడాది పొడవునా జరిగిన సంఘటనలన్నీ గత వత్సర జ్ఞాపకాలుగా మారబోతున్నాయి. ఎన్నో అనుభూతులు.. మరెన్నో అనుభవాలు.. సుఖ సంతోషాలు.. బాధలు.. చేదు ఫలితాలను పంచి ఇచ్చిన మరో సంవత్సరం తెరమరుగు కాబోతోంది. రానున్న ఏడాదికి స్వాగతం చెప్పేందుకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఇప్పటికే రిసార్ట్స్‌ నిండుకున్నాయి. మద్యం షాపుల వద్ద స్టాక్‌లు రెట్టింపయ్యాయి. రెస్టారెంట్లు కాంబో ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. పూల బొకేల షాపులు, కేక్‌లు అమ్మే బేకరీల్లో సందడి మొదలు కానుంది.

నూతన సంవత్సర వేడుకలకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని గోదావరి.. సముద్ర తీరాల్లోని రిస్టార్ట్స్‌ ముస్తాబయ్యాయి. ఇక్కడకు హైదరాబాద్‌, బెంగళూరు వంటి మహా నగరాల నుంచి కొత్త అతిథులు వస్తున్నారు. ఐటీ ఉద్యోగులు, ఇతర ఉన్నత ఉద్యోగులు గోదావరి, సముద్ర తీరాల్లో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించేందుకు సమాయత్తం అయ్యారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ రిసార్ట్స్‌ ఈ నెల 31 నుంచి జనవరి 2వ తేదీ వరకూ రెండు నెలల క్రితమే బుక్‌ అయ్యాయి. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఏపీటీడీపీ పరిధిలోని దిండి రిసార్ట్స్‌, సమీపంలోనే ప్రైవేట్‌కు చెందిన సరోవర్‌ పోర్టు కో, అల్లవరం మండలం ఓడలరేవులోని సముద్రా రిసార్ట్స్‌తో పాటు కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గోవలంక వద్ద యానాం రిసార్ట్స్‌, గోదావరి, సముద్ర తీరాన్ని ఆనుకుని ప్రైవేట్‌ వ్యక్తులకు ఉన్న ఫామ్‌ హౌస్‌, గెస్ట్‌ హౌస్‌లు సైతం నిండుకున్నాయి. డిసెంబర్‌ 31 ఇయర్‌ ఎండింగ్‌ వేడుకలతోపాటు జనవరి 1 నూతన సంవత్సర వేడుకలు ఇక్కడ నిర్వహించుకునేందుకు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారితో వీటికి డిమాండ్‌ ఏర్పడింది. అలాగే అమలాపురం, మలికిపురం, తాటిపాక, పుదుచ్చేరి యానాంలోని ఒక మోస్తరు ప్రైవేట్‌ లాడ్జీల్లో రూమ్‌లకు సైతం డిమాండ్‌ ఏర్పడింది. యానాంలో పుదుచ్చేరి సీగల్స్‌ రెస్టారెంట్‌లో పలు కార్యక్రమాలు నిర్వహించేవారు. అయితే మాజీ ప్రధాన డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ మృతికి సంతాపంగా ఇక్కడ నూతన సంవత్సర వేడుకలు వాయిదా వేశారు.

సందడే సందడి

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం, పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలోని రివర్‌ ఫ్రంట్‌ రిసార్ట్స్‌తోపాటు ప్రధాన హోటళ్లు కూడా సందడిగా మారనున్నాయి. రాజమహేంద్రవరం మంజీరా హోటల్‌లో నూతన సంవత్సర వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాకినాడలో సైతం నూతన సంవత్సర వేడుకలకు పలు హోటళ్లు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయి.

కాంబో ఆఫర్లు

డిసెంబరు 31 ఇయర్‌ ఎండింగ్‌.. జనవరి ఒకటి నూతన సంవత్సర వేడుకలు ఇప్పుడు డిమాండ్‌ ఉన్న వ్యాపారంగా మారిపోయింది. మద్యం, బిర్యానీలు, మాంసాహారం విక్రయాలు మంగళవారం పెద్ద ఎత్తున జరగనున్నాయి. ఇందుకు తగ్గట్గుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మద్యం దుకాణాల వద్ద ఇప్పుటికే బీర్లు, ఇతర రకాల మద్యం పెద్ద ఎత్తున స్టాక్‌ చేసుకున్నారు. సాధారణ రోజులకన్నా రెట్టింపు స్టాక్‌ పెట్టుకున్నట్టు మద్యం వ్యాపారులు చెబుతున్నారు. ఇక రెస్టారెంట్లు సైతం ప్రత్యేక నాన్‌వెజ్‌, కాంబో అఫర్లు ప్రకటించాయి. తమ ఆకర్షణీయమైన ప్రచారంతో సామాజిక మాధ్యమాలను ముంచెత్తుతున్నాయి.

జోరుగా బొకేలు.. కేకుల విక్రయాలు

నూతన సంవత్సర వేడుకల్లో బొకేలు.. కేక్‌లు ప్రధానమైనవి. పెద్ద ఎత్తున సాగే వీటి కోసం పువ్వుల దుకాణాలు, బేకరీ యజమానులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బొకేల కోసం రప్పించిన ప్రత్యేక పువ్వులతో తూర్పు గోదావరి జిల్లాలోని కడియం పూల మార్కెట్‌ కళకళలాడుతోంది. బెంగళూరు, కడప, తమిళనాడు నుంచి నుంచి సోమ, ఆదివారాల్లో సుమారు 12 టన్నుల పువ్వులు తీసుకువచ్చారు. ఇప్పటికే ఇక్కడ బొకేలను సిద్ధం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మంగళ, బుధవారాల్లో సుమారు రూ.నాలుగు కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా.

అమలాపురంలో

సిద్ధమవుతున్న బొకేలు

No comments yet. Be the first to comment!
Add a comment
ఫుల్‌ జోష్‌1
1/2

ఫుల్‌ జోష్‌

ఫుల్‌ జోష్‌2
2/2

ఫుల్‌ జోష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement