ఏషియన్ యోగా పోటీలకు ఎంపిక
దేవరపల్లి: రాష్ట్ర, జాతీయ స్థాయి యోగా పోటీల్లో అనేక విజయాలు సాధించిన ఇమ్మణి అర్మిత భవానీ చౌదరి అంతర్జాతీయ పోటీలకు ఎంపికై ంది. ఏషియన్ యోగా ఫెడరేషన్ ఆధ్వర్యాన ఈ నెల 6, 7, 8, 9 తేదీల్లో సింగపూర్‌లో పోటీలు జరుగుతున్నాయి. వీటికి అండర్–17 విభాగం భారత జట్టులో మన రాష్ట్రం నుంచి దేవరపల్లి మండలం చిన్నాయగూడేనికి చెందిన విద్యార్థిని భవానీ చౌదరి ఎంపికై ంది. ఆమె 2020లో శాప్ మాజీ డైరెక్టర్ పేరం రవీంద్రనాథ్ ప్రోద్బలంతో యోగాలో ప్రవేశించింది. కోచ్ మునేశ్వరరావు వద్ద శిక్షణ పొందింది. 2023–24లో యోగా ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యాన కర్నూలులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. 2023 నవంబర్‌లో అస్సాంలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ద్వితీయ స్థానం సాధించింది. ఉత్తర ప్రదేశ్‌లోని హజియాబాద్‌లో 2023 డిసెంబర్‌లో జరిగిన యూవైఎస్‌ఎఫ్ ప్రపంచ యోగా పోటీల్లో ద్వితీయ స్థానం సాధించింది. గత ఏడాది యోగా ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యాన విశాఖ జిల్లా భీమిలిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచింది. గత ఏడాది నవంబర్ 2, 3 తేదీల్లో నెల్లూరులో జరిగిన ఎస్‌జీఎఫ్ రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రథమ స్థానం కై వసం చేసుకుంది. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ద్వితీయ స్థానం సాధించింది. తాడేపల్లిగూడెం వద్ద ఉన్న భారతీ విద్యా భవన్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న భవానీ చౌదరి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు గురువారం సింగపూర్ బయలుదేరి వెళ్లింది. ఈ పోటీల్లో విజయం సాధిస్తానని ఆమె విశ్వాసం వ్యక్తం చేసింది.
గొర్రెలు, మేకల
పెంపకంపై శిక్షణ
రాజానగరం: గొర్రెలు, మేకల పెంపకం ఎంతో లాభదాయకమని కలవచర్ల కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ప్రధానాధికారి వీఎస్‌జీఆర్ నాయుడు అన్నారు. శాసీ్త్రయ పద్ధతిలో గొర్రెలు, మేకల పెంపకంపై జిల్లా ఆత్మ ప్రాజెక్టు ఆధ్వర్యాన గ్రామీణ యువతకు వారం రోజుల శిక్షణ, ప్రదర్శనను కేవీకేలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయుడు మాట్లాడుతూ, ఈ శిక్షణ ద్వారా గొర్రెలు, మేకల పెంపకంపై అవగాహన కల్పించుకోవాలని, మెళకువలు, లాభనష్టాల గురించి తెలుసుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధులు, వాటి నివారణ చర్యలపై కూడా అవగాహన కల్పిస్తారన్నారు. జిల్లా ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ వై.జ్యోతిర్మయి మాట్లాడుతూ, గొర్రెలు, మేకల పెంపకం రానున్న కాలంలో పరిశ్రమగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయన్నారు. దీనికి అవసరమైన మూలధనాన్ని బ్యాంకుల ద్వారా రుణాలుగా అందిస్తారన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని గొల్లప్రోలు, రాజానగరం, ప్రత్తిపాడు, తొండంగి, రాజమహేంద్రవరం రూరల్, అర్బన్ మండలాలకు చెందిన 15 మంది ఔత్సాహిక యువకులు ఈ శిక్షణకు హాజరయ్యారు. కార్యక్రమంలో పశు పోషణాధికారి బి.నాగేశ్వరరెడ్డి, కేవీకే అధికారులు రవీంద్ర సొంటెక్కే, సంజయ్ హెగ్డే, టి.విజయ వర్ధన్, ఆర్.రత్నాజీ తదితరులు పాల్గొన్నారు.
రైల్వే శాఖకు
భూములు అప్పగించాలి
అమలాపురం రూరల్: కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ అలైన్‌మెంట్ ప్రతిపాదనల ప్రకారం ఇప్పటికే సేకరించిన భూములను స్వాధీన పరుచుకుని రైల్వే శాఖకు అప్పగించాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ మహేష్‌కుమార్ ఆదేశించారు. గురువారం రెవెన్యూ అధికారులతో రైల్వే లైన్ అలైన్‌మెంట్ భూముల స్వాధీనం, అవార్డులు పాస్, భూ నష్టపరిహారాలు చెల్లింపు తదితర పెండింగ్ అంశాలపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ సమస్యలను అధిగమించే ప్రయత్నంతో పాటుగా భూముల సేకరణకు చర్యలు వేగవంతం చేయాలన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, ఇన్‌చార్జి డీఆర్‌ఓ కె.మాధవి, రెవెన్యూ డివిజనల్ అధికారులు డి.అఖిల పి.శ్రీకర్, ఆర్‌డబ్ల్యూ ఎస్‌ఈ సీహెచ్‌ఎన్వీ కృష్ణారెడ్డి, అయినవిల్లి తహసీల్దార్ నాగలక్ష్మి, డీటీ ఏసుబాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment