సమన్వయం, సహకారంతో అభివృద్ధి
సాక్షి, రాజమహేంద్రవరం: ప్రజలు, అధికారుల సమన్వయ సహకారాలతో గడచిన ఆరు నెలల్లో జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. ఇదే ఉత్సాహంతో భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి పనులకు నాంది పలుకుతామని చెప్పారు. తన క్యాంపు కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడుతో కలిసి గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో ఇప్పటి వరకూ 15 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందజేశామన్నారు. సెమీ మెకానిక్ విధానం ద్వారా 52.82 లక్షల మెట్రిక్ టన్నులు అందించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. మార్చి మొదటి వారం నుంచి దీనిని అందుబాటులోకి తీసుకురానున్నామని చెప్పారు. రాష్ట్రంలో సరఫరా అవుతున్న ఇసుకలో 65 శాతం మన జిల్లా నుంచే అందిస్తున్నామన్నారు. ఇసుక సరఫరా ఏజెన్సీల కాలపరిమితి ముగిసిందని, కొత్త ఏజెన్సీలు వస్తే మరింతగా ఇసుక అందుబాటులోకి వస్తుందని చెప్పారు. కలెక్టర్ ఇంకా ఏమన్నారంటే..
● జిల్లాలో 2.52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం.
● 146 చౌక డిపోల్లో డీలర్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశాం.
● ఆర్‌అండ్‌బీ రోడ్లకు 531 కిలోమీటర్ల మేర గుంతలు పూడ్చాల్సి ఉండగా.. 187 కిలోమీటర్ల వరకూ పూర్తి చేశాం.
● పల్లె పండగ ద్వారా సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ పథకం కింద 131 కిలోమీటర్ల మేర 666 సీసీ రోడ్ల పనులకు రూ.65.63 కోట్లు మంజూరు చేశాం.
● జిల్లాలో స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా శక్తిమంతంగా ఉన్నాయి. డెయిరీ యూనిట్లు, పౌల్ట్రీ, పీఎంఈజీపీ అభివృద్ధి ద్వారా స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా మరింత బలోపేతం చెందుతాయి. స్కిల్ డెవలప్‌మెంట్‌పై ఇంటింటి సర్వే ప్రారంభించాం.
● రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి పనులు విస్తృతం చేస్తాం.
● జిల్లాలో 286 చోట్ల రెవెన్యూ సదస్సుల నిర్వహణకు షెడ్యూలు రూపొందించాం.
● పరిశ్రమల అభివృద్ధిలో భాగంగా కలవచర్ల లే అవుట్ ప్రారంభమైంది. దీనికి సంబంధించి అప్రోచ్ రోడ్లు అందుబాటులోకి తెస్తాం.
● పోలవరం – జీలుగుమిల్లి జాతీయ రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
● కొవ్వూరు – పట్టిసీమ గోదావరి గట్టు రహదారి అభివృద్ధికి త్వరలో భూసేకరణ చేపడతాం.
● బొబ్బిల్లంక – ధవళేశ్వరం హేమగిరి రహదారి నిర్మాణానికి అంచనాలు రూపొందించాం.
● ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో టాయిలెట్లు, ఆర్‌ఓ ల్యాండ్స్ న్యూట్రి గార్డెన్లు ఏర్పాటు చేశాం.
● 15 జూనియర్ కళాశాలల్లో శనివారం నుంచి మధ్యాహ్న భోజన పథకం ప్రారంభిస్తున్నాం. దీని ద్వారా 5,425 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది.
అట్రాసిటీ ఘటనలపై పర్యవేక్షణ తప్పనిసరి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ఘటనలపై పర్యవేక్షణ తప్పనిసరని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి సాంఘిక సంక్షేమ శాఖ, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అట్రాసిటీ కేసులలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, సంబంధిత ఉత్తర్వులు జారీ చేసిన వాటికి 48 గంటల్లో పరిహారం అందజేయాలని అన్నారు. జిల్లాలో నమోదైన కేసులు వాటికి సంబంధించిన దశల వారీ వివరాలు, నివేదికలు, చెల్లింపుల స్థాయి, విడుదల చేయాల్సిన మొత్తం వంటి సమగ్ర వివరాలను సమర్పించాలని సూచించారు. కుల ధ్రువీకరణ పత్రాల కోసం వస్తున్న అర్జీల పరిష్కారానికి ఎక్కువ సమయం తీసుకోవడంపై ఆర్‌డీవోలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వసతి గృహాల సిబ్బంది విధులు, బాధ్యతల విషయంలో జవాబుదారీగా ఉండాలన్నారు. ఈ మేరకు క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేసి, నివేదిక అందజేయాలని ఆదేశించారు. సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాలు, బాలికల గురుకుల పాఠశాలలు, వర్కింగ్ వుమెన్స్ హాస్టళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, నిఘా పటిష్టం చేయాలన్నారు. జిల్లాలోని సంచార జాతుల కుటుంబాలను గుర్తించి, ఆదుకోవాలన్నారు. ఇప్పటికే గుర్తించిన వారికి ఆధార్, రేషన్ కార్డులు, ఇంటి స్థలం మంజూరు చేయాలని, డీఆర్‌డీఏ ద్వారా ఉపాధి కల్పనకు స్వయం సహాయక సంఘాల ఏర్పాటు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ మాట్లాడుతూ, అట్రాసిటీ కేసుల దర్యాప్తు, పరిష్కారంపై ప్రతి నెలా చివరి శనివారం మండల స్థాయి కమిటీ కచ్చితంగా సమావేశం నిర్వహించాలని అన్నారు. జిల్లావ్యాప్తంగా 101 కేసులు విచారణ దశలో ఉన్నాయని, 2024 సంవత్సరానికి చెందినవి 63 ఉన్నాయని వివరించారు. సమావేశంలో డీఆర్‌ఓ టి.సీతారామమూర్తి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎంఎస్ శోభారాణి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
15 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా
2.52 లక్షల మెట్రిక్ టన్నుల
ధాన్యం కొనుగోలు
కలెక్టర్ ప్రశాంతి వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment