కిర్లంపూడి: పోలీసులను కారుతో ఢీకొట్టి పరారైన వ్యక్తుల కేసులో పోలీసులు పురోగతి సాధించినట్టు తెలిసింది. విశాఖ నుంచి రాజమహేంద్రవరం వైపు వెళుతున్న వాహనంలో గంజాయి తరలిస్తున్నట్టు పోలీసులకు వచ్చిన సమాచారంతో గత మంగళవారం అర్ధరాత్రి జగ్గంపేట సీఐ వైఆర్‌కే శ్రీనివాస్, స్థానిక ఎస్సై జి.సతీష్ తమ సిబ్బందితో కృష్ణవరం టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో గంజాయి తరలిస్తున్న కారును అడ్డుకున్నారు. దీంతో కారును పక్కన పార్క్ చేస్తానని చెప్పి ఒక్కసారిగా ఎదురుగా ఉన్న కానిస్టేబుల్స్ లోవరాజును, హెడ్‌కానిస్టేబుల్ నాగరాజును ఢీకొట్టి వేగంగా వెళ్లిపోయారు. దీంతో పోలీసులు టోల్‌గేట్‌లోని సీసీ ఫుటేజీ ఆధారాలతో గురువారం పరారీలో ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని వాహనంలో తరలిస్తున్న గంజాయినీ, వాహనాన్ని సీజ్ చేసినట్టు సమాచారం. కాగా వారిపై కేసులు నమోదు చేసి శుక్రవారం అధికారికంగా వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment