అభివృద్ధి నిల్.. అవినీతి ఫుల్
మధురపూడి: కూటమి ప్రభుత్వ ఏడు నెలల పాలనతో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. అభివృద్ధి నిల్, అవినీతి ఫుల్ అన్నట్టుగా కూటమి పాలన ఉందని ఎద్దేవా చేశారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఆయన కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారికి గురువారం తలనీలాలు సమర్పించారు. మెట్ల మార్గంలో కొండ మీదకు వెళ్లి, కొండపై స్వయంభువుగా కొలువైన స్వామివారిని దర్శించుకున్నారు. తొలుత స్వామివారి పాదాల చెంత పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజా విలేకర్లతో మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండేలా చూడాలని స్వామివారిని కోరుకున్నామన్నారు. స్వామివారి విశిష్టతను మరింతగా ప్రచారం చేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టానన్నారు. కూటమి ప్రభుత్వ ఏడు నెలల పాలనలో ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై, ప్రశ్నించిన వారిపై దాడులు, హత్యలు చేయడం తప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి, నిస్సిగ్గుగా వైఎస్సార్ సీపీ నాయకులపై నిందారోపణలు చేస్తున్నారన్నారు.
దేశానికి అన్నం పెడుతున్న రైతుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రాజా అన్నారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలులో బాధ్యతా రహితంగా వ్యవహరించడాన్ని తప్పు పట్టారు. పండించిన ప్రతి గింజనూ కొంటామని ప్రగల్భాలు పలికిన మంత్రులు, ఎమ్మెల్యేలు ధాన్యం కొనుగోలు చేయకుండా తాత్సారం చేస్తున్నారన్నారు. తుపానులు, వర్షాల కారణంగా తడిసిన ధాన్యం కొనుగోలు సందర్భంగా తేమ శాతం పెరిగిందంటూ 10 కేజీల తరుగు తీయడం దుర్మార్గమని రాజా దుయ్యబట్టారు.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వివిధ శాఖల ద్వారా చేపట్టిన పనులను పూర్తి చేయకుండా కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తోందని రాజా విమర్శించారు. వివిధ దశల్లో మంజూరైన, టెండర్లు పిలిచిన అభివృద్ధి పనులను చేపట్టకపోవడం సబబు కాదని హితవు పలికారు. డ్రగ్స్, గంజాయి, రేవ్ పార్టీలు, మహిళలపై అఘాయిత్యాలను అరికట్టకుండా నిర్వాహకుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం వసూళ్లు చేస్తోందని ఆరోపించారు. అనకాపల్లిలో గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన వారు స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ బంధువులని అన్నారు. సంక్షేమ పథకాల అమలును ప్రజలు మరచిపోవాలనే దురుద్దేశంతో ప్రతిపక్ష నాయకులపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అమ్మ ఒడి, రైతుభరోసా, చేయూత, ఆసరా తదితర పథకాలను గాలికొదిలేశారని అన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది బదిలీల్లో పర్సంటేజీలు తీసుకోవడం తప్ప అభివృద్ధి కార్యక్రమాలు లేవని చెప్పారు. లిక్కర్ సిండికేట్‌లో కూటమి నాయకులే ఉన్నారని రాజా అన్నారు. న్యూ ఇయర్ పేరిట అత్యధిక వ్యాపారాలు చేయించి, ప్రజలను దోచుకుంటున్నారన్నారు. ఇసుక, మట్టి దోపిడీ అధికమైందని, పని తీరు మార్చుకోకపోతే కూటమి ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురి కాక తప్పదని హెచ్చరించారు. ప్రజల తరఫున వైఎస్సార్ సీపీ పోరాడుతుందని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ జెడ్పీటీసీ సభ్యుడు కర్రి నాగేశ్వరరావు, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ అడపా కనకరాజు, కో కన్వీనర్ గణేశుల పోసి, గుమ్ములూరు, నర్సాపురం సర్పంచులు నక్కా రాంబాబు, కడియాల పాపారావు తదితరులు పాల్గొన్నారు.
ఇదే కూటమి ప్రభుత్వ
7 నెలల పాలన తీరు
ధాన్యం కొనుగోలు చేయకపోతే
ఆందోళన చేస్తాం
వైఎస్సార్ సీపీ నేత జక్కంపూడి రాజా
Comments
Please login to add a commentAdd a comment