ఆలయ షెడ్డు తొలగింపుతో ఉద్రిక్తత
రాజమహేంద్రవరం రూరల్: హుకుంపేట ఆవ రోడ్డులో ఎస్టీ ప్లాంట్ ఎదురుగా ఉన్న పొలిమేర సత్తెమ్మ తల్లి ఆలయం పక్కనే ఉన్న షెడ్డును నగరపాలక సంస్థ అధికారులు తొలగించడంతో బుధవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్‌గార్గ్ బుధవారం ఎస్టీ ప్లాంట్ ప్రాంతాన్ని పరిశీలించారు. దాని ముందు ఉన్న సత్తెమ్మతల్లి ఆలయం ముందు భాగాన్ని, పక్కనే షెడ్డును తొలగించాలని అధికారులకు ఆదేశించారు. దీంతో టౌన్ ప్లానింగ్ అధికారులు షెడ్డును తొలగించేందుకు సన్నద్ధమవ్వడంతో విషయం తెలుసుకున్న ఆలయ కమిటీ పెద్దలతో పాటు రెల్లి కులస్తులు భారీ సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. తమ కుల దైవం పొలిమేర సత్తెమ్మతల్లి ఆలయాన్ని ఎట్టి పరిస్థితిల్లో కూల్చడానికి వీలులేదని విన్నవించారు. చివరకు టౌన్ ప్లానింగ్ అధికారులు ఆలయం పక్కన ఉన్న షెడ్డును తొలగించారు. దీంతో కమిటీ పెద్దలు, రెల్లి కులస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్తెమ్మతల్లి ఆలయాన్ని కూల్చవద్దని అమ్మవారి జాతర సైతం మంగళవారం రాత్రితోనే ముగిసిందని కావున అధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు. ఇలా మూడు గంటల పాటు సత్తెమ్మతల్లి ఆలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. చివరకు టౌన్ ప్లానింగ్ అధికారులు షెడ్డును ఒక్కటే తొలగించి అక్కడ నుంచి వెనుదిరగడంతో ఆందోళనకారులు శాంతించారు. ఆలయాన్ని యథాతథంగా ఉంచాలని కమిషనర్‌ను కోరతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment