అందరమొకటై తరిమేద్దాం
ప్రజలు సహకరించాలి
కుష్ఠు వ్యాధి లేని ఉన్నతమైన సమాజం కోసం చేస్తున్న సర్వేకు ప్రజలు సహకరించాలి. వైద్యశాఖ సిబ్బంది ఇళ్ల వద్దకు వచ్చినప్పుడు శరీరంపై ఎలాంటి మచ్చలున్నా తెలయజేయాలి. కుష్ఠు వ్యాధి మచ్చలుగా అనుమానిస్తే పరీక్షలు చేయించి నిర్ధారణ అయితే వారి వివరాలు గోప్యంగా ఉంచి చికిత్స అందిస్తాం. ముందస్తు చికిత్స చేస్తే వ్యాధి నయమవుతుంది. భవిష్యత్తులో అంగవైకల్యం రాకుండా కాపాడొచ్చు.
– డాక్టర్ ఎన్.వసుంధర, జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ నివారణ అధికారి, తూర్పుగోదావరి
● కుష్ఠు వ్యాధిపై ఇంటింటి సర్వే ప్రారంభం
● జిల్లాలో 1,310 బృందాలతో పరిశీలన
● ముందస్తు చికిత్సతో అంగవైకల్యం దూరం
● అవగాహనతోనే వ్యాధికి చెక్
రాజమహేంద్రవరం రూరల్: కుష్ఠువ్యాధి సోకితే అంగవైకల్యం రావొచ్చు, రోగులను తక్కువ చేసి చూడకుండా అసలు వ్యాధినే తరిమివేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. జాతీయ కుష్ఠు నివారణ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి వైద్యశాఖ ఆధ్వర్యంలో సర్వే ప్రారంభించారు. వ్యాధిగ్రస్తులను సకాలంలో గుర్తించి చికిత్స అందించడం ద్వారా అంగవైకల్యం నుంచి కాపాడొచ్చు. అంతేకాకుండా వ్యాధిని దూరం చేసి అందరితో పాటు సంతోషంగా జీవించేలా చేయొచ్చు.
వైద్యశాఖ ఎన్ని చర్యలు తీసుకున్నా ఈ వ్యాధి వ్యాపిస్తోంది. జిల్లాలో కొన్నేళ్లుగా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయినా అక్కడక్కడా కొత్తవి నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 82మంది ఈ వ్యాధిన బారినపడ్డారు. ప్రస్తుతం వీరికి చికిత్స చేస్తున్నారు. కుష్ఠు వ్యాధి సోకిన వ్యక్తిని కొందరు చిన్నచూపు చూస్తారు. ఇది ఒకరి నుంచి ఒకరికి సోకే ప్రమాదం లేదు.
జిల్లాలో 13 కాలనీలు
జిల్లాలో అధికారికంగా 702 మందిలో కుష్ఠువ్యాధి వల్ల ఏళ్ల తరబడి అంగవైకల్యంతో కొంతమంది, మరికొంతమంది చిన్న చిన్నలోపాలతో బాధపడుతున్నారు. వీరి కోసం జిల్లాలో 13 కాలనీలను ఏర్పాటు చేశారు. కాలనీలో నివాసం ఉంటున్న వారికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సంవత్సరానికి రెండుసార్లు ఎంసీఆర్ చెప్పులు అందజేస్తోంది. సబ్బులు, టవల్స్ ఇస్తోంది. గాయాలు పెరగకుండా గట్టి పడిన చర్మం మెత్తపడేందుకు కాళ్లు, చేతులకు రాసుకునేందుకు ఆలివ్, వేపనూనెను పంపిణీ చేస్తోంది. స్వచ్ఛంద సంస్థలు, దాతలు సాయం చేస్తున్నారు.
అవగాహన పెంచుకుని..
కుష్ఠు అంటువ్యాధి కాదు. ఆ వ్యాధి ఉన్న వారితో ఏళ్ల తరబడి కలిసి ఉంటే ముక్కు, నోటి ద్వారా తుంపర్ల రూపంలో బ్యాక్టీరియా వ్యాపించవచ్చు. ఇతరుల చర్మంపై కోతలు, గాయాలుంటే అంటుకునే ప్రమాదముంది. ఒకసారి బ్యాక్టీరియా సోకితే దాని లక్షణాలు 2 నుంచి 20 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా బయటపడవచ్చు. ఈ వ్యాధిపై అవగాహన పెంచుకుని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కుష్ఠు రాకుండా ఉండటానికి టీకాల్లేవు. అయితే క్షయకు వాడే బీసీజీ టీకా కొంతమేరకు కుష్ఠు కొత్తవారికి రాకుండా ఉండేందుకు సాయపడుతుందని నూతన అధ్యయనాలు పేర్కొంటున్నాయి. శరీరంపై మచ్చలుంటే సకాలంలో డాక్టర్‌కు చూపించుకుని మందులు వాడితే కుష్ఠు రాకుండా అరికట్టవచ్చని డాక్టర్లు పేర్కొంటున్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో ఉంటే ఈ వ్యాధి కారకజీవులు వ్యాపించవని చెబుతున్నారు.
ఇంటింటి సర్వే ప్రారంభం..
సోమవారం నుంచి వచ్చే నెల 2వ తేదీవరకు జిల్లాలో లెప్రసీ(కుష్ఠు) సర్వే నిర్వహిస్తారు. ఇందుకోసం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ 1,310 బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో ఏఎన్‌ఎం సూపర్‌వైజర్‌గాను, ఆశా కార్యకర్త, మేల్ వలంటీర్‌లు ఉంటారు. క్షేత్రస్తాయిలో ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకుంటున్నారు. కుష్టుకు సంబంధించిన మచ్చలతో పాటు తామర, బొల్లి లాంటి మచ్చలున్నాయా అని ఆరా తీస్తారు. మచ్చలున్న వారిని సమీపంలోకి పీహెచ్‌సీకి తీసుకెళ్లి అక్కడి డాక్టర్లతో మళ్లీ పరీక్ష చేయిస్తారు. కుష్ఠుమచ్చలుగా అనుమానిస్తే నిర్ధారణ చేస్తారు. సాధారణమైతే వాటికి కూడా మందులు ఇస్తారు.
జిల్లా సమాచారం
సర్వేలో పాల్గొనే బృందాలు – 1,310
జిల్లాలో యూపీహెచ్‌సీలు – 15
జిల్లాలో పీహెచ్‌సీలు – 35
అంగవైకల్యంతో బాధపడుతున్నవారు – 702 మంది
కొత్తగా చికిత్స పొందుతున్నవారు – 82 మంది
Comments
Please login to add a commentAdd a comment