ప్చ్‌.. నిరాశే.. | - | Sakshi
Sakshi News home page

ప్చ్‌.. నిరాశే..

Published Sun, Feb 2 2025 12:13 AM | Last Updated on Sun, Feb 2 2025 12:13 AM

ప్చ్‌

ప్చ్‌.. నిరాశే..

ఆదివారం శ్రీ 2 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

చంద్రబాబు, పవన్‌ సిగ్గుపడాలి

ఢిల్లీ, బీహార్‌ రాష్ట్రాల్లో త్వరలో జరిగే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో రాష్ట్రానికి మొండిచెయ్యి చూపించారు. రాజధానికి నిధులు కానీ, ప్రత్యేక హోదా ఊసు కానీ లేదు. ఈ బడ్జెట్‌ చూసి చంద్రబాబు, పవన్‌ సిగ్గుపడాలి. ఆదాయ పన్ను రాయితీ ఇచ్చినా.. పెరిగే ధరలతో మధ్య తరగతి జేబులు ఖాళీ అవుతాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రజలు ఉపాధి లేక పట్టణాలకు వలస వెళ్తున్నారు. కనీసం ఉపాధి హామీ పథకానికి కూడా నిధులు సరిగ్గా కేటాయించలేదు. ఈ పథకాన్ని ఎత్తివేసేందుకు కుట్ర జరుగుతోంది. ఈ బడ్జెట్లో కార్పొరేట్‌ పారిశ్రామికవేత్తలకు మరోసారి ఫుల్‌ మీల్స్‌ పెట్టారు. – తాటిపాక మధు, సీపీఐ జిల్లా కార్యదర్శి

సాక్షి, రాజమహేంద్రవరం: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ బడ్జెట్‌ తీవ్ర నిరాశకు గురి చేసిందని పలువురు అభిప్రాయడ్డారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ, జనసేనతో కూడిన ఎన్‌డీఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి రాజమహేంద్రవరం ఎంపీగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర బడ్జెట్‌లో ఈ ప్రాంతానికి వరాలు కురుస్తాయని జిల్లా ప్రజలు భావించగా.. వారి ఆశలపై కేంద్ర బడ్జెట్‌ నీళ్లు జల్లింది. తన పార్లమెంటరీ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు సాధించుకోవడంలో పురందేశ్వరి శ్రద్ధ చూపకపోవడమేమిటనే ప్రశ్న రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. తమ మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తోందన్న బీరాలు పలుకుతున్న టీడీపీ, జనసేన నేతలు బడ్జెట్‌లో జిల్లాకు కేటాయింపులపై ఎందుకు దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం కేంద్రం ఇచ్చిన నిధులను దేహీ అంటూ తీసుకోవడం తప్ప డిమాండ్‌ చేసే పరిస్థితి లేకపోవడం దారుణమని అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీ, బిహార్‌ రాష్ట్రాలకు త్వరలో జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు తప్ప.. ఈ బడ్జెట్‌ ప్రజల కోసం కాదని పలువురు విమర్శిస్తున్నారు.

అన్ని వర్గాల వారికీ అనువైన బడ్జెట్‌

ఇది అన్ని వర్గాల వారికీ అనువైన బడ్జెట్‌. ఇన్‌కం ట్యాక్స్‌ బెనిఫిట్లు బాగున్నాయి. ఉద్యోగులకు, వ్యాపారులకు అన్ని రకాల ప్రయోజనాలు అందించేలా ఈ బడ్జెట్‌ ఉంది.

– మద్దుల మురళీకృష్ణ, మాజీ సెక్రటరీ,

ది రాజమండ్రి చాంబర్‌ ఆప్‌ కామర్స్‌,

రాజమహేంద్రవరం

ధరల అదుపు చర్యలేవీ?

ద్రవ్యోల్బణం అదుపు, వడ్డీ రేట్ల తగ్గుదల, ఉత్పత్తి పెరుగుదల లేకుండా స్థూల జాతీయ పెరుగుదల సాధ్యం కాదు. తక్కువ వడ్డీకి రుణాలు, బ్యాంకు రుణ నిబంధనలు సరళీకరించి, సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమల ఉత్పత్తి పెరిగేలా చర్యలు తీసుకోవాలి. ఆర్థిక లోటు, ద్రవ్యోల్బణం తగ్గకుండా రిజర్వు బాంక్‌ వడ్డీ రేట్లు తగ్గించడం కుదరదు. కేంద్ర ప్రభుత్వమే రెవెన్యూ వ్యయం తగ్గించి, పెట్టుబడులు పెంచే దిశగా చర్యలు చేపట్టాలి.

– సుంకవల్లి వెంకన్న చౌదరి, పారిశ్రామికవేత్త, చైర్మన్‌, సుంకవల్లి ఫౌండేషన్‌, మార్కొండపాడు, చాగల్లు

కూటమి

డొల్లతనానికి నిదర్శనం

కేంద్రంలో తిరిగి అధికార పగ్గాలు చేపట్టడంలో బీహార్‌, ఆంధ్రప్రదేశ్‌ కీలకంగా మారాయి. ఇలాంటి సమయంలో ఈ బడ్జెట్‌లో బీహార్‌కు అధిక మొత్తంలో నిధులు ఇచ్చారు. రాష్ట్రానికి ఇవ్వకపోవడానికి కారణమేమిటి? కేంద్ర ప్రభుత్వంలో తాము కీలకమన్న సీఎం చంద్రబాబు నాయుడు నిధులు సాధించలేకపోవడం కూటమి ప్రభుత్వ డొల్లతనానికి నిదర్శనం. 21 మంది ఎంపీలున్న కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు రాబట్టలేకపోవడం దారుణం.

– చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు

ఆదాయపన్ను తగ్గింపులో మతలబు!

బడ్జెట్‌లో ఆదాయ పన్ను రాయితీ ఇచ్చినా.. పెరిగే ధరలతో మధ్య తరగతి వర్గం జేబులు ఖాళీ కానున్నాయి. పన్నుల భారం పెంచేది కేంద్రమే, తగ్గిస్తున్నామని గొప్పలు చెప్పేది కేంద్రమేననే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే అధిక ధరలతో పేదలు, మధ్య తరగతి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ), పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు తగ్గించకుండా కేవలం కంటితుడుపుగా రూ.12 లక్షల వరకూ ఆదాయపన్ను మినహాయింపు అని ప్రకటించడంలో మతలబు ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేవలం రూ.4 లక్షల వరకే ఇది వర్తిస్తుందని ఆర్థిక నిపుణులు వెల్లడిస్తున్నారు. కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల పరిమితి పెంచడం ద్వారా రైతులకు కొంత మేలు చేకూరుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా ఈ బడ్జెట్‌ సామాన్యులకు పెను భారంగా మారుతుందని పలువురు అంటున్నారు.

గోదావరి పుష్కరాలపై కరుణేదీ?

గోదావరి పుష్కరాలు 2027లో జరగనున్నాయి. ఈ సందర్భంగా మహారాష్ట్రలోని నాసిక్‌, తెలంగాణలోని వివిధ ప్రాంతాలతో పాటు మన రాష్ట్రంలోని అంతర్వేది, పుదుచ్చేరి పరిధిలోని యానాం వరకూ పావన గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేస్తారు. దేశ, విదేశాల నుంచి కోట్లాది మంది యాత్రికులు తరలివస్తారు. వీరిలో అత్యధికులు రాజమహేంద్రవరంలో పుష్కర స్నానాలు చేయడానికి, తీర్థ విధులు నిర్వహించడానికే మొగ్గు చూపుతారు. ఈ సందర్భంగా నగరంతో పాటు, కొవ్వూరు తదితర ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు రూ.1,286 కోట్లు అవసరమని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతిపాదనలు పంపారు. దీనికి కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారేమోనని భావించారు. కానీ, ఆ ప్రస్తావనే ఎక్కడా లేకపోవడం గమనార్హం.

ఫ కేంద్ర బడ్జెట్‌తో ఒరిగింది శూన్యం

ఫ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీగా ఉన్నా.. ఈ ప్రాంతానికి మొండిచేయే

ఫ వ్యవసాయాధారిత జిల్లాలో రైతులకు దక్కని ప్రోత్సాహం

ఫ ఉపాధికి కేటాయింపులు అరకొరే..

ఫ కేంద్ర బడ్జెట్‌పై భిన్నాభిప్రాయాలు

కలగానే కొవ్వూరు – భద్రాద్రి కొత్తగూడెం రైల్వే లైన్‌

జిల్లాలోని కొవ్వూరు నుంచి భద్రాద్రి కొత్తగూడెం వరకూ కొత్త రైల్వే లైను నిర్మాణం అంశం ఈ బడ్జెట్‌లోనూ అటకెక్కింది. ఈ రైల్వే లైను నిర్మాణాన్ని నాలుగు దశాబ్దాల క్రితమే ప్రతిపాదించారు. ఇటీవల ఈ అంశం మళ్లీ తెర పైకి వచ్చింది.

నిర్మాణ పనులపై ఉన్న అవకాశాలను శోధిస్తూ అధ్యయనం కూడా చేశారు. ఈ రైల్వే లైను నిర్మిస్తే ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని నివేదికలు సైతం స్పష్టం చేశాయి. దీనివలన విశాఖ – హైదరాబాద్‌ మధ్య 130 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుందని నిర్ధారించారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ రైల్వే లైనుకు ఈ బడ్జెట్‌లో నయా పైసా కూడా కేటాయించలేదు.

ధరలు పెరిగే అవకాశం

ఫిస్కల్‌ డెఫిసిట్‌ 4.8 శాతం ఉందని కేంద్రం ప్రకటించింది. ఆ లోటును భర్తీ చేయాలంటే అంత మేర కరెన్సీ నోట్లు ప్రింట్‌ చేయాలి. దీనినిబట్టి చూస్తుంటే ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. కేంద్రానికి ఇన్‌కం ట్యాక్స్‌ ద్వారా 22 శాతం వస్తుందని చెప్పారు. ఇది ఎలా అంచనా వేశారనే దానిపై సందిగ్ధత నెలకొంది. వేతనాలు ఏమైనా పెరిగే అవకాశం ఉందా అనేది చూడాలి. ట్యాక్స్‌ లిమిట్‌ పెంచారు. తద్వారా సేవింగ్స్‌ పెరిగే అవకాశం ఉంటుంది. మధ్య తరగతి ప్రజలకు కొంత ఊరట కలగనుంది. కిసాన్‌ క్రెడిట్‌ కార్డు పరిమితిని రూ.5 లక్షలకు పెంచడం మంచి పరిణామం. ఉత్పత్తిని పెంచేందుకు ఎలాంటి ఇబ్బందులూ లేవు. వ్యవసాయంపై అంతగా దృష్టి పెట్టలేదు. పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇస్తామని చెప్పారు. అది ఎలాగనేది స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

– డాక్టర్‌ పి.లక్ష్మీనారాయణ, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, నన్నయ యూనివర్సిటీ

No comments yet. Be the first to comment!
Add a comment
ప్చ్‌.. నిరాశే..1
1/6

ప్చ్‌.. నిరాశే..

ప్చ్‌.. నిరాశే..2
2/6

ప్చ్‌.. నిరాశే..

ప్చ్‌.. నిరాశే..3
3/6

ప్చ్‌.. నిరాశే..

ప్చ్‌.. నిరాశే..4
4/6

ప్చ్‌.. నిరాశే..

ప్చ్‌.. నిరాశే..5
5/6

ప్చ్‌.. నిరాశే..

ప్చ్‌.. నిరాశే..6
6/6

ప్చ్‌.. నిరాశే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement