ఊరులోనే ఉపాధి బాట
ఫ జాతీయ గ్రామీణ ఉపాధి పథకానికి
19 ఏళ్లు
ఫ తొలిసారిగా వైఎస్సార్ హయాంలో అమలు
ఫ కూలీల వలసల నివారణకు దోహదం
ఫ టీడీపీ పాలనలో అక్రమాలకు నిలయం
ఫ మాజీ సీఎం వైఎస్ జగన్ పాలనలో నవోదయం
కపిలేశ్వరపురం: ఊరులోనే ఉపాధి దొరికితే అంతకన్నా ఆనందం ఉంటుందా... వలసల బాట లేకుండా, కూలి పనుల కోసం వెతుకులాడకుండా అందరికీ పనులు కల్పించే ఉద్దేశంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పురుడు పోసుకుంది.. పేదలకు ఈ పథకం ఎంతగానో ఆసరాగా నిలుస్తోంది. దేశంలో 2006కు ముందు గ్రామాల్లో పనులు లేక, పస్తులుంటూ జీవించిన కూలీలకు ఉపాధి కల్పించింది.. అప్పట్లో కేంద్రంలో ప్రధానిగా మన్మోహన్‌సింగ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలన సాగుతున్న రోజుల్లో ప్రజల ముందుకు ఈ పథకం వచ్చింది. దీనికి 19 ఏళ్లు నిండింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనేక గ్రామాల అభ్యున్నతికి దోహదపడింది. ప్రజల మేలు కోరి పాలన సాగించిన మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఈ పథకం క్షేత్ర స్థాయిలో మెరుగైన ఫలితాలనిచ్చింది. ఒకప్పటి టీడీపీ పాలనలో ఉపాధి హామీ పథకం అక్రమాలకు నిలయంగా, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు కాసులు కురిపించే పథకంగా మారింది. ప్రస్తుత కూటమి పాలనలో కూడా నిస్తేజంగా ఉంది.
పథకం ఉద్దేశమిది.. : ప్రతి కూలీకి ఏడాదికి వంద రోజు లు పని కల్పించే లక్ష్యంగా ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకం రూపొందింది. పనిలేక ఆకలితో చనిపోయే పరిస్థితులను రూపుమాపడం, ఇతర ప్రాంతాలు, వృత్తులకు మళ్లిపోతున్న వారిని ఈ పథకం వైపు తీసుకెళ్లడం ప్రధాన ధ్యేయం. క్షేత్ర స్థాయిలో ప్రజలకు పని కల్పించి కనీస కూలి కల్పించాలన్న ఆలోచన 1991 పీవీ నరసింహారావు హయాంలోనే కేంద్ర ప్రభుత్వం చేసింది. తర్వాత కాలంలో మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్న యూపీఏ ప్రభుత్వంలో పథకం కార్యాచరణ రూపం దాల్చింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 పేరుతో ఆగస్టు 23న బిల్లు ఆమోదమైంది. 2006 ఫిబ్రవరి 2న పథకం ప్రారంభమైంది. అలా ప్రారంభమైన ఉపాధి పథకానికి ఆదివారంతో 19 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ పథకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా నిధులు కేటాయిస్తున్నాయి.
ఉమ్మడి జిల్లాలో కూలీలు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 18,53,328 మంది జనాభా ఉండగా మొత్తం 1.53 లక్షల జాబ్ కార్డులు ఇచ్చారు. 2.27 లక్షల మంది కూలీలు ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 18,43,903 జనాభా ఉండగా, 1,61,372 మందికి జాబ్‌కార్డులు ఇవ్వగా 1,11,815 మంది కూలీలున్నారు. కాకినాడ జిల్లాలో 22,55,668 మంది ప్రజలు ఉండగా, 1.96 లక్షల కార్డులకు 1.95 లక్షల మంది కూలీలున్నారు.
గత ప్రభుత్వంలో ముందుకు..
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఉపాధి పథకాన్ని అభివృద్ధి పథకంలోకి తీసుకెళ్లారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వ్యవసాయ అనుబంధ, అభివృద్ధి పనులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూనే కూలీలతో పనులు చేపట్టే వాటికి మొదటి ప్రాధాన్యం ఇచ్చారు. ఉపాధి కూలీలకు పని కల్పనకే పరిమితం కాకుండా మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో అభివృద్ధికి బాట వేశారు. గ్రామ పాలనలో కీలకమైన సచివాలయం, రైతు భరోసా, పాల సేకరణ కేంద్రాలు, హెల్త్ క్లీనిక్‌ల నిర్మాణాలు చేపట్టారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 467 గ్రామ, 48 వార్డు సచివాలయాలు ఉన్నాయి. కాకినాడ జిల్లాలో 445 గ్రామ, 175 వార్డు సచివాలయాలు, తూర్పుగోదావరి జిల్లాలో 393 గ్రామ, 119 వార్డు సచివాలయాలుండగా వాటిలో అనేక సచివాలయాలకు సొంత భవనాలు సమకూరాయి. ప్రతి పనినీ జియోట్యాగింగ్ పద్ధతిలో చేసి పారదర్శక పాలనగా పేరు తెచ్చుకున్నారు. ఆధార్ అనుసంధానం చేసి కూలీలకు డబ్బు సక్రమంగా అందేలా డీబీటీ విధానాన్ని తీసుకొచ్చారు. పనులు చేసిన వెంటనే బిల్లులు సైతం జమ అవుతుండటంతో ఉపాధి పనులకు వస్తున్న కూలీల సంఖ్య పెరిగింది. అన్ సీజన్లో సైతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రోజుకు సుమారు 10 వేల మందికి పైగా ఉపాధి పొందగలిగారు. జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణంలో 90 పనిదినాలకు సంబంధించిన పనులు చేపట్టారు. నీటిపారుదలకు ఆటంకం కలగకుండా చెరువులు, పంట, పిల్ల కాలువల పూడికతీత పనులు, గ్రామీణ రహదారుల అనుసంధానం, హార్టికల్చర్, ఎవెన్యూ ప్లాంటేషన్, హౌసింగ్ కాలనీల్లో మ్యాజిక్ సోక్ పిట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మురుగు నీరు బయటకు వెళ్లేలా కమ్యూనిటీ సోక్ పిట్ల పనులు చేపట్టారు. వరుస వర్షాలకు ధాన్యం తడిచి అయోమయంలో ఉన్న రైతుకు ఉపాధి పథకం కూలీలు తోడుగా నిలిచే అవకాశాన్ని గత సీఎం వైఎస్ జగన్ కల్పించారు. తడిచిన ధాన్యాన్ని రైతు కోరిన చోటకు తరలించడం ద్వారా కూలీలు సామాజిక సేవలో భాగస్వాములయ్యారు.
వైఎస్సార్ హయాంలో ఉద్యమంలా..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఉపాధి పథకం అమలు ఒక ఉద్యమంగా సాగింది. చెరువులు, పంట కాలువలు, బోదెలు తవ్వకాలతో పెద్ద ఎత్తున కూలీలకు పని కల్పించారు. ఉద్యానవన విభాగంలో ఉద్యాన తోటల పెంపకానికి అవకాశం కల్పించారు. ఇందిర జలప్రభ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గీయులకు చెందిన బీడు భూములను సాగు భూములుగా మార్చారు. తర్వాత కాలంలో టీడీపీ అధికారంలోకి రాగా ఉపాధి హామీ పథకం అక్రమాలకు నిలయంగా మారింది. నీరు–చెట్టు పేరుతో టీడీపీ నాయకులు, కార్యకర్తలకు కాసుల వర్షం కురిపించింది. పని చేసిన కూలీలకు బకాయిలు పెట్టి నానా తిప్పలు పెట్టింది. చేసిన పనులు సైతం నాణ్యతా లోపంతో ఉండటంతో పథకం నిర్వహణ వివాదాస్పదమైంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏడు నెలల పాలనలోనూ తీరు మారలేదన్న విషయం ఇటీవల గ్రామ, మండల స్థాయిలో నిర్వహించిన గ్రామసభల్లో వ్యక్తమైంది.
Comments
Please login to add a commentAdd a comment