కానిస్టేబుల్ నిజాయితీ
జగ్గంపేట: ఓ కానిస్టేబుల్ నిజాయితీ చాటుకున్నాడు. సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ కథనం ప్రకారం.. జగ్గంపేటలో కాకినాడ ఏపీఎస్పీ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ తోట సూరిబాబు దుస్తులు కొనుగోలు చేశారు. అయితే దుస్తుల సంచితో పాటు రూ.8 లక్షలు ఉంచిన సంచిని కూడా సూరిబాబుకు ఆ వస్త్ర దుకాణ యజమాని శేఠ్ బబ్లూ అందజేశారు. ఇది గమనించని కానిస్టేబుల్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తరువాత పొరపాటును గమనించిన బబ్లూ జగ్గంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వైఆర్‌కే శ్రీనివాస్, ఎస్సై రఘునాథరావు, రైటర్ కృపావరం తక్షణం స్పందించి సీసీ కెమెరాలు, ఫోన్ పే చేసిన నంబర్ ద్వారా నగదు కవరును పట్టుకుని వెళ్లిన వ్యక్తిని గుర్తించారు. అతను కాకినాడకు చెందిన కానిస్టేబుల్ కావడంతో అతనికి జరిగిన పొరపాటును వివరించారు. అది గమనించిన కానిస్టేబుల్ సూరిబాబు నిజాయితీగా నగదు ఉన్న సంచిని సీఐ, ఎస్సైలకు అందజేశారు. దానిని వారు షాపు యజమాని బబ్లూకి అందజేయడంతో అతను పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment