ఫీజు పోరును విజయవంతం చేయండి
ఫ 5న రాజమహేంద్రవరం తరలిరండి
ఫ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు
ఫ పోస్టర్ విడుదల
బిక్కవోలు: ఈ నెల 5న రాజమహేంద్రవరంలో చేపట్టనున్న ఫీజు పోరును విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పిలుపునిచ్చారు. బిక్కవోలులో వైఎస్సార్ సీపీ మండల ముఖ్య నాయకులతో ఆయన, పార్టీ అనపర్తి నియోజకవర్గ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ శనివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మాజీ ఏఎంసీ చైర్మన్ జంగా వీర వెంకట సుబ్బారెడ్డి ఇంటి వద్ద జరిగిన ఈ సమావేశంలో మండలంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ, పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి మండలానికి ఒక గ్రామంలో మండల ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహించి, సూచనలు, సలహాలు స్వీకరిస్తున్నానని చెప్పారు. ఇందులో భాగంగా ఈ సమావేశం ఏర్పాటు చేశానన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజావ్యతిరేకతతో కొట్టుమిట్టాడుతోందని, సూపర్ సిక్స్ హామీల అమలులో కాలపయాపన చేస్తోందని విమర్శించారు. నాలుగు విడతలకు సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారన్నారు. ప్రతి పేద విద్యార్థీ ఉన్నత విద్య అభ్యసించాలనే సమున్నత లక్ష్యంతో గత ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు పరిచారన్నారు. కూటమి ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారని చెప్పారు. అటువంటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు మద్దతుగా వైఎస్సార్ సీపీ ఈ నెల 5న రాజమహేంద్రవరంలో కలెక్టరేట్ వద్ద ఫీజు పోరు నిర్వహించనుందని, అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తామని వేణు తెలిపారు. ఫీజు పోరును విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆ రోజు రాజమహేంద్రవరం తరలి రావాలని కోరారు. సమావేశంలో మాజీ ఏఎంసీ చైర్మన్లు సబ్బెళ్ల కృష్ణారెడ్డి, వైఎస్సార్ సీపీ బిక్కవోలు మండల అధ్యక్షుడు పోతుల ప్రసాద్‌రెడ్డి, ఎంపీపీ బుద్దాల కన్నారావు, ఉప సర్పంచి డాక్టర్ జంగా మురళీకృష్ణారెడ్డి, కాపవరం, రంగాపురం సర్పంచులు సత్యంశెట్టి వెంకట రమణ, గండికోట వీరభద్రరావు, పందలపాక సొసైటీ మాజీ అధ్యక్షుడు సత్తి హరిప్రసాద్‌రెడ్డి, జేసీఎస్ మండల కన్వీనర్ బొడ్డు ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment