సీతారామపురం కార్యదర్శికి షోకాజ్ నోటీసు
ప్రజ ఫిర్యాదుల పరిష్కార వేదికలో
కలెక్టర్ ప్రశాంతి
రాజానగరం: ప్రభుత్వ ఉద్యోగిగా బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే తగిన చర్యలు తీసుకోకతప్పదని జిల్లా కలెక్టరు పి. ప్రశాంతి హెచ్చరించారు. మండలంలోని సీతారామపురం పంచాయతీ కార్యదర్శికి షోకాజ్ నోటీసు జారీ చేస్తున్న విషయాన్ని మీడియాకు తెలియజేస్తూ పై విధంగా అన్నారు. స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రజల నుంచి వివిధ సమస్యలపై 59 దరఖాస్తులొచ్చాయి. రంగంపేటకు చెందిన కొంతమంది వ్యక్తులు ఏడీబీ రోడ్డు విస్తరణలో తమ భూములు పోయాయని, ఇంతవరకు ఒక్క రూపాయి కూడా నష్టపరిహారంగా అందలేదని వాపోయారు. ఇందుకు కారణాలను తెలుసుకుని, తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సీతారామపురం పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి పై కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులపై కార్యదర్శి సహేతుకమైన సమాధానం ఇవ్వలేక పోయారు. గ్రామంలోని స్థితిగతులపైన, సమస్యల పైన ఆమెకు ఏమాత్రం అవగాహన లేకపోవడమే కాకుండా తరచుగా సెలవులు పెడుతూ బాధ్యాతారాహిత్యంగా విధులు నిర్వర్తించడాన్ని కలెక్టరు తీవ్రంగా పరిగణించారు. దీంతో కార్యదర్శికి షోకాజ్ నోటీసు జారీ చేస్తున్నానన్నారు. నందరాడ పంచాయతీ కార్యదర్శిపై ప్రజల నుంచి ఫిర్యాదులొచ్చాయి. అయితే మండలంలో ఈ ఇద్దరి పైనే ఫిర్యాదులొచ్చాయి. మిగిలిన వారంతా విధులు సక్రమంగా నిర్వర్తిస్తున్నట్టుగా భావించరాదన్నారు. చాలామంది కార్యదర్శులు గ్రామ సిబ్బందిపై ఆధారపడుతున్నట్టుగా పరిశీలనలో గ్రహించామన్నారు. ఎవరి బాధ్యతలను వారు సక్రమంగా నిర్వర్తిస్తే సమస్యలే ఉండవన్నారు.
అనుమతులు లేకుండా మట్టి తవ్వడం నేరం
అనంతరం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా మట్టి తవ్వకాలు చేపట్టడం నేరం అవుతుందన్నారు. గతంలో ఇక్కడ ఇటువంటి చర్యలు ఎక్కువగా జరగడం వల్లనే తహసీల్దారును మార్చవలసి వచ్చిందన్నారు. మండలంలోని రామస్వామిపేట, ప్రాథమిక పాఠశాల ఏడీబీ రోడ్డు విస్తరణలో పోతున్నందున ప్రభుత్వం నుంచి వచ్చిన నష్టపరిహారాన్ని సద్వినియోగం చేసి, మరోచోట పాఠశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ, ఎంఈఓలకు సూచించారు. జాయింట్ కలెక్టరు చినరాముడు, డీఎల్‌డీఓ వీణాదేవి, ఎంపీడీఓ జేఎల్ ఝాన్సీ, తహసీల్దారు జీఏఎల్‌ఎస్ దేవి, ఎంపీపీ మండారపు సీతారత్నం, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పోలీసు పీజీఆర్‌ఎస్‌కు 23 అర్జీలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం’ (పీజీఆర్‌ఎస్)కు 23 ఫిర్యాదులు అందాయి. జిల్ల్లా ఎస్పీ నిర్వహించి పీజీఆర్‌ఎస్‌కు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చి అర్జీలు అందించారు. ఎస్పీ నరసింహకిశోర్ వారి బాధలను స్వయంగా అడిగి తెలుసుకుని, వెంటనే నేరుగా సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి ఫిర్యాది దారుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వరమే న్యాయం చేయాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment