కలెక్టర్ ఎదుటే అవమాన పరిచారు
జెడ్పీటీసీ సభ్యుని ఆవేదన
రాజానగరం: సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసేందుకు వెళ్లిన తనను ప్రజాప్రతినిధినని కూడా చూడకుండా అవమానించారని వైఎస్సార్ సీపీకి చెందిన రాజానగరం జెడ్పీటీసీ సభ్యుడు వాసంశెట్టి పెదవెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆధ్వర్యంలో ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ సోమవారం జరిగింది. ఈ క్రమంలో తాను కూడా కొన్ని సమస్యలపై వినతిపత్రం ఇచ్చేందుకు వెళితే కలెక్టర్ ఎదుటనే సిబ్బంది అవమానకరంగా ప్రవర్తించారన్నారు. ప్రజాప్రతినిధినైన తనను కూడా అందరితోపాటు క్యూ లో రావాలని సిబ్బంది ఆదేశించడం ఆశ్చర్యపరచిందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిపక్షంలోని ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా బీసీ, ఎస్సీలకు కనీసం గౌరవ, మర్యాదలు కూడా లభించడం లేదని అన్నారు.
మధ్యవర్తిత్వంపై
లాయర్లకు శిక్షణ
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): మధ్యవర్తిత్వం, రాజీ ప్రాజెక్ట్ కమిటీ ఆధ్వర్యంలో కేసుల సత్వర పరిష్కారం అయ్యే అవకాశం ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. స్థానిక జిల్లా కోర్టు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సమావేశ మందిరంలో జ్యుడీషియల్ అధికారులకు, న్యాయవాదులకు మధ్యవర్తిత్వం కాన్సెప్ట్, టెక్నిక్‌లపై శిక్షణ కార్యక్రమాలు సోమవారం ప్రారంభమయ్యాయి. దీనికి హాజరైన సునీత మాట్లాడుతూ ఈ నెల 20 నుంచి 24 వ తేదీ వరకు ఈ శిక్షణ అందించనున్నామన్నారు. కోర్టు సంబంధిత కేసుల్లో పరిష్కారానికి నాలుగు విధానాలు ఉన్నాయన్నారు. దీనిలో మధ్యవర్తిత్వ రాజీ మార్గం, లోక్ ఆదాలత్ అనే రెండు అంశాలుగా ఉన్నాయన్నారు. దీనిలో మధ్యవర్తిత్వం కు సూచించిన కేసులకు సంబంధించి కేసు పరిష్కారం అయ్యే విధంగా శిక్షణ పొందిన జ్యుడీషియల్ అధికారులకు, అడ్వకేట్లను నామినేట్ చేస్తామన్నారు. వీరు సంబంధిత కేసులో ఇరు పార్టీలను పిలిపించి వారితో ఆమోదయోగ్యం దిశగా సంతకాలు చేయించి ఆరు నెలల లోపు కేసు రాజీ అయ్యే విధంగా పరిష్కరిస్తారన్నారు. ఇలా పరిష్కారమ య్యే కేసులకు లోక్‌అదాలత్ మాదిరిగానే అప్పీల్ కూడా ఉండదన్నారు. కోర్టుకు చెల్లించిన ఫీజు కూడా తిరిగి ఇస్తారన్నారు. కార్యక్రమంలో పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్మన్ ఎ.గాయత్రీదేవి, డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి కె.ప్రకాష్‌బాబు, సీనియర్ శిక్షకులు సురీందర్ సింగ్ (ఢిల్లీ), ఎస్.అరుణాచలం (తమిళనాడు), జ్యుడీషియల్ అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment