ప్రజల పక్షాన పోరాటాలు ఉధృతం
సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వం ప్రజలను తీవ్ర వంచనకు గురి చేసిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజల పక్షాన పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పారు. పార్టీ రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ కార్యాలయంలో మంగళవారం జరిగిన వైఎస్సార్ సీపీ జిల్లా స్థాయి సమావేశం జరిగింది. భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణపై నేతలు చర్చించారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక కూటమి తుంగలోకి తొక్కిందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను కాలరాసిందని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్నా.. సంక్షేమంపై దృష్టి పెట్టకుండా, గత ప్రభుత్వంపై బురద జల్లేందుకే సమయం కేటాయిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు, నిజానిజాలను ప్రజలకు వివరించేందుకు ఇకపై నేతలంతా ప్రజల్లో ఉంటారని చెప్పారు. దీనికోసం ప్రత్యేక ఉద్యమ కార్యాచరణ రూపొందించామన్నారు. ఇందులో భాగంగా ప్రతి వారం ఒక మండలంలో జిల్లా నేతలందరితో సమావేశం ఏర్పాటు చేస్తామని, ఆ సందర్భంగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచిని వివరిస్తామని చెప్పారు. అదే సమయంలో అధికార కూటమి చేస్తున్న మోసాన్ని ఎండగడతామని, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుంచే తొలిసారిగా శ్రీకారం చుడుతున్నామని వేణు చెప్పారు. మాజీ సీఎం వైఎస్ జగన్ జిల్లా పర్యటనలను జయప్రదం చేసే విధంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని నేతలు నిర్ణయించారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం నియోజకవర్గ ఇన్‌చార్జి జక్కంపూడి రాజా, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్, మాజీ హోం మంత్రి, గోపాలపురం నియోజకవర్గ ఇన్‌చార్జి తానేటి వనిత, రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, అనపర్తి, నిడదవోలు, కొవ్వూరు నియోజకవర్గాల ఇన్‌చార్జులు, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, జి.శ్రీనివాస నాయుడు, తలారి వెంకటరావు పాల్గొన్నారు.
ఫ హామీలు తుంగలో తొక్కిన
కూటమి సర్కారు
ఫ వైఎస్సార్ సీపీ జిల్లా
అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు
ఫ భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణపై చర్చ
Comments
Please login to add a commentAdd a comment