కొవ్వూరులో చైన్ స్నాచర్ల హల్ చల్
కొవ్వూరు: పట్టణంలో పట్టపగలే చైన్‌స్నాచర్లు హల్‌చల్ చేశారు. ఇద్దరు మహిళల మెడలో పది కాసుల బంగారు ఆభరణాలను లాక్కుని పరారయ్యారు. నిత్యం రద్దీగా ఉండే జూనియర్ కళాశాల నుంచి గాయత్రి థియేటర్ సెంటర్‌కు వెళ్లే రోడ్డులో బుధవారం మధ్యాహ్నం 11 గంటల సమయంలో ఈ ఘటనలు జరగడం విశేషం. వివరాల్లోకి వెళితే.. కుమారదేవం గ్రామానికి చెందిన నక్కా ధనలక్ష్మి, వీర్ల సుబ్బలక్ష్మి బుధవారం కొవ్వూరులోని భారతీయ స్టేట్‌బ్యాంకులో పని నిమిత్తం వచ్చారు. వారిద్దరూ పట్టణంలోని సెయింట్ లూథరన్ చర్చి సమీపంలో రోడ్డు పక్కనే నిలబడి మాట్లాడుకుంటుండగా మోటారు సైకిల్‌పై వచ్చిన ఇద్దరు యువకులు..ధనలక్ష్మి మెడలోని మూడున్నర కాసుల బంగారు గొలుసు లాక్కున్నారు. పక్కనే ఉన్న సుబ్బలక్ష్మి మెడలోని గొలుసును లాగే ప్రయత్నం చేశారు. వారి నుంచి తప్పించుకునే సందర్భంలో ఆమె కిందపడిపోయింది. దీంతో ఆమెను వదిలేసి పరారయ్యారు. అనంతరం వంద మీటర్లు ముందుకెళ్లి బర్ల లలితా అపర్ణాదేవి అనే అంగన్‌వాడీ కార్యకర్త మెడలో ఆరున్నర కాసుల ఆభరణాలను లాక్కెళ్లారు. దొంగలను స్థానికులు వెంబడించినా ఫలితం లేకుండా పోయింది.
మోటారు సైకిల్‌పై వచ్చి..
చోరీకి పాల్పడిన దుండగులు మోటారు సైకిల్‌పై వచ్చారు. వాహనం నడిపే వ్యక్తి హెల్మెట్ ధరించాడు. వెనుక కూర్చున్న దుండగుడు మాస్క్, టోపీ ధరించాడు. చోరీ చేసిన అనంతరం జూనియర్ కళాశాల నుంచి మొయిన్ రోడ్డు విజయవిహార్ సెంటర్ వైపు వెళ్లిపోయారు. వీరిద్దరే బుధవారం ఉదయం రాజమహేంద్రవరంలోని కోటగుమ్మం సెంటర్ సమీపంలో చోరీకి పాల్పడినట్టు సమాచారం. సీసీ పుటేజ్ ఆధారంగా రెండు చోట్లా చోరీలకు పాల్పడిన నిందితులు ఒక్కరేనని పోలీసులు, అధికారులు నిర్ధారించారు. వీరు ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతానికి చెందిన దొంగలై ఉంటారని భావిస్తున్నారు. కొవ్వూరులో దొంగతనం చేసిన తర్వాత వెళ్లిపోతున్న వీరిని గోకవరం, రంపచోడవరం ప్రాంతాల్లో ఆయా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ దొరకలేదని సమాచారం. కాగా.. ఘటనా స్థలాన్ని పట్టణ సీఐ పి.విశ్వం పరిశీలించారు. రూరల్ సీఐ కె.విజయబాబు, కై ్సం ఎస్సై పి.రవీంద్ర, పట్టణ ఎస్సై కె.జగన్‌మోహన్‌రావుతో పాటు ఇతర పోలీసులు బృందాలుగా విడిపోయి నిందితుల కోసం గాలిస్తున్నారు. చోరీలు జరిగిన రోడ్డు వెంబడి ఉన్న సీసీ పుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. బాధితులు పట్టణ పోలీసులను ఆశ్రయించారు.
ఇద్దరు మహిళల మెడలో
పది కాసుల బంగారం చోరీ
పట్టపగలే ఘటన
గాలింపు చేపట్టిన పోలీసులు
కొంతమూరులో మరో ఘటన
రాజమహేంద్రవరం రూరల్: కొంతమూరులోని ప్రకాశం నగర్ ఎంప్లాయీస్ కాలనీలో బుధవారం మధ్యాహ్నం నడిచి వెళుతున్న మహిళ మెడలోని బంగారు తాడును దొంగలు లాక్కుని పరారయ్యారు. కల్యాణ్ నగర్‌కు చెందిన సాగిరాజు చంద్రావతి నడిచి వెళుతుండగా వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. ఆమె మెడలోని తొమ్మిది కాసుల విలువైన బంగారు నల్లపూసల తాడు, చైన్ లాక్కుని వెళ్లిపోయారు. అలాగే కుడిపూడి పార్వతి మెడలో బంగారు గొలుసును లాగడానికి ప్రయత్నించినప్పటికీ ఆమె గట్టిగా విదుల్చుకోవడంతో కుదరలేదు. దొంగలు వేగంగా అక్కడ నుంచి పరారయ్యారు. సంఘటన స్థలాన్ని రాజానగరం ఇన్‌స్పెక్టర్ వీరయ్య గౌడ్, ఎస్సైలు, సిబ్బంది పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment