క్యాబేజీపై తెగుళ్ల దాడి | - | Sakshi
Sakshi News home page

క్యాబేజీపై తెగుళ్ల దాడి

Published Thu, Jan 23 2025 12:12 AM | Last Updated on Thu, Jan 23 2025 12:13 AM

క్యాబ

క్యాబేజీపై తెగుళ్ల దాడి

పెరవలి: నిత్యావసరాలు, కూరగాయల ధరలు ప్రస్తుతం భాగా పెరిగిపోయాయి. వాటిని కొనుగోలు చేయడానికి సామాన్యుడు తీవ్ర అవస్థలు పడుతున్నాడు. ముఖ్యంగా కూరగాయల ధరలను చూస్తే వణుకు పుడుతోంది. కారణాలేవైనా గానీ వాటిని కొనుగోలు చేయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇదే సమయంలో పుండు మీద కారం చల్లినట్టుగా క్యాబేజీ పంటను తెగుళ్లు ఆశించాయి.

2,795 హెక్టార్లలో సాగు

జిల్లాలోని 2,795 హెక్టార్లలో కూరగాయల సాగు జరుగుతుండగా, వాటిలో క్యాబేజీని 300 ఎకరాల్లో పండిస్తున్నారు. పెరవలి, నిడదవోలు, కొవ్వూరు, నల్లజర్ల, కడియం, చాగల్లు, తాళ్లపూడి మండలాల్లో ఈ పంట అధికంగా సాగవుతోంది. ప్రస్తుతం క్యాబేజీని తెగుళ్లు ఆశించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎరువులను అధికంగా వినియోగించడం వల్ల ఇవి మరింత ఉధృతి చెందుతున్నాయి. క్యాబేజీని రెక్కల పురుగు, పేనుబంక, నారుకుళ్లు, నల్లకుళ్లు తెగుళ్లు ఆశించాయి. వీటి నివారణకు తీసుకునే చర్యలను కొవ్వూరు ఉద్యానవన అధికారి సీహెచ్‌ శ్రీనివాస్‌ వివరించారు.

రెక్కల పురుగు

ఈ పురుగు ఆకుల అడుగు భాగాన ఉండి ఆకులను తిని నాశనం చేస్తుంది. దీంతో సూర్యరశ్మిని స్వీకరించలేని ఆకులు పత్ర హరితం కోల్పోయి ఎండిపోతాయి. ఈ పురుగులు చిన్నవిగా, ఆకుపచ్చ, గోధుమ రంగులో ఉంటాయి. తెలుపు రంగు సన్నని రెక్కలు, పొడవాటి వెంట్రుకలు, వెనుక రెక్కలు ఉంటాయి. పైరుపై వీటి ప్రభావం ఉధృతంగా ఉన్నప్పుడు ఆకులన్నీ రంధ్రాలతో ఉండి క్యాబేజీ పరిమాణం కూడా చిన్నదిగా ఉంటుంది. దీంతో మార్కెట్‌లో గిట్టుబాటు ధర లభించక రైతులు నష్టాల పాలవుతారు.

నివారణ చర్యలు

క్యాబేజీ పంట వేసిన తర్వాత ప్రతి 25 వరసలకు రెండు వరసల చొప్పున ఆవ మొక్కలను ఎరపంటగా వేయాలి. రెక్కల పురుగు గుడ్లను నాశనం చేసేందుకు వేపగింజల ద్రావణాన్ని పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు లీటరు నీటికి స్పైనోసాడ్‌ 0.3 మిల్లీమీటర్లు కలిపి పిచికారీ చేయాలి. నారు నాటిన 30, 45 రోజుల్లో బీటీ మందులు ఒక గ్రామును ఒక లీటరు నీటిలో కలిపి చల్లాలి.

పేనుబంక

పేనుబంక పురుగులు ఆకుల అడుగు భాగాన గుంపులుగా చేరి ఆకుల్లో రసాన్ని పీల్చి నష్టాన్ని కలుగజేస్తాయి. రసం పీల్చడం వలన ఆకులు ఎండిపోయి రాలిపోతాయి. ఈ పురుగులు కనిపించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. డైమిథోయేట్‌ లేదా మిథైల్‌డెమటాన్‌ 2 మిల్లీలీటర్లను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

నల్లకుళ్లు

ఈ తెగులు పంటపై ఎప్పుడైనా ఆశించవచ్చు. తెగులు సోకిన ఆకులు పత్ర హరితాన్ని కోల్పోయి వి ఆకారంలో ఉన్న నల్లని మచ్చలు ఏర్పడతాయి. ఈ తెగులు ఆశించిన ఆకుల ఈనెలు కూడా నల్లగా మారతాయి. ఇది రాకుండా ఉండేందుకు స్ట్రెప్టోసైక్లిన్‌ ఒక గ్రామును పది లీటర్ల నీటిలో కలిపి అందులో విత్తనశుద్ధి చేయాలి. ఇదే మందును నారు నాటినప్పుడు, మొగ్గ తయారైనప్పుడు పిచికారీ చేయాలి. కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ మూడు గ్రాములను ఒక లీటరు నీటిలో కలిపి మొక్కల మొదలు చుట్టూ తడపాలి. ఎకరాకు ఐదు కిలోల బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లి పంట మార్పిడి చేయాలి.

నివారణ

ఈ పంట వేసే రైతులు ఎకరానికి 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువుతో పాటు భూసారాన్ని బట్టి 32 నుండి 40 కిలోల భాస్వరం, 40 కిలోల పొటాష్‌ ఎరువులను చివరి దుక్కులో వేసి బాగా కలియదున్నాలి. 32 కిలోల నత్రజనిని మూడు దఫాలుగా నాటిన 25, 30 రోజుల మధ్య ఒకసారి, 50 నుంచి 60 రోజులకు రెండోసారి, 75 నుంచి 80 రోజులకు మూడోసారి వేయాలి. ఎరువులు వేసిన వెంటనే నీటి తడులను అందించాలి.

నిలిచిపోతున్న మొక్క ఎదుగుదల

రైతుల ఆవేదన

నారుకుళ్లు

ఈ తెగులు సోకిన మొక్కల కాండం మొదలులో మెత్తగా తయారై కుళ్లి ఒడిలిపోయి చనిపోతాయి. ఈ తెగులు సోకినట్లుగా గుర్తించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.

నివారణ చర్యలు

ఈ తెగులు సోకకుండా నారుమడులను ఎత్తుగా ఉండే ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలి. విత్తనాన్ని పలుచగా వరసల్లో వేయాలి. ఎక్కువ నీటి తడులు ఇవ్వకుండా చూడటంతో పాటు మురుగునీరు బయటకు వెళ్లేలా మార్గాలను ఏర్పాటు చేయాలి. నారు మొలిచిన తర్వాత కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ మూడు గ్రాములను లీటరు నీటిలో కలిపి పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
క్యాబేజీపై తెగుళ్ల దాడి 1
1/5

క్యాబేజీపై తెగుళ్ల దాడి

క్యాబేజీపై తెగుళ్ల దాడి 2
2/5

క్యాబేజీపై తెగుళ్ల దాడి

క్యాబేజీపై తెగుళ్ల దాడి 3
3/5

క్యాబేజీపై తెగుళ్ల దాడి

క్యాబేజీపై తెగుళ్ల దాడి 4
4/5

క్యాబేజీపై తెగుళ్ల దాడి

క్యాబేజీపై తెగుళ్ల దాడి 5
5/5

క్యాబేజీపై తెగుళ్ల దాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement