కొవ్వూరు: దేచెర్ల సమీపంలో క్రేన్ ఢీకొట్టడంతో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. క్రేన్ ఆ వ్యక్తి రెండు కాళ్లపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. అతడిని వెంటనే కొవ్వూరు ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. రూరల్ ఎస్సై కె.శ్రీహరిరావు మాట్లాడుతూ ఆ వ్యక్తి రెండు, మూడు రోజులుగా మతిస్థిమితం లేకుండా రోడ్లపై తిరుగుతున్నాడన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, మృతదేహాన్ని కొవ్వూరు ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 94411 70899 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
రూ 3.60 లక్షల విలువైన ఎండుగడ్డి దగ్ధం
కరప: పేపకాయలపాలెంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో రూ 3.60 లక్షల విలువైన ఎండుగడ్డి దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పేపకాయలపాలెం గ్రామానికి చెందిన సలాది శ్రీనుబాబు ఎండుగడ్డి వ్యాపారం చేస్తుంటాడు. గత ఏడాది తొలకరి పంటలో 75 ఎకరాల్లోని ఎండుగడ్డిని కొనుగోలు చేశారు. దాన్ని ఆ గ్రామంలోని సాయిబాబాగుడి సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో కట్టలుగా కట్టి నిల్వ చేశాడు. కాకినాడ, పరిసర ప్రాంతాలకు ప్రతి రోజూ ఎండుగడ్డి కట్టలను తీసుకెళ్లి అమ్మకాలు చేస్తుంటాడు. మంగళవారం రాత్రి 12 గంటల సమయంలో కట్టలుగా పేర్చిన ఎండుగడ్డి వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో అటుగా వెళుతున్న కొందరు ఈ విషయాన్ని గుర్తించి, స్థానికులతో పాటు కాకినాడ జగన్నాథపురంలోని ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్ధలానికి వచ్చేసరికే ఎండుగడ్డి పూర్తిగా కాలిపోయింది. దీనిపై ఎటువంటి ఫిర్యాదు రాలేదని కరప పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment