మన కళ్లను మనమే నమ్మలేని అరుదైన అసాధారణమైన ఉదంతాలు చరిత్రలో అప్పుడప్పుడు చోటు చేసుకుంటాయి. సోమవారం భద్రతామండలిలో జరిగిందదే. గాజాలో ఇజ్రాయెల్ దాష్టీకాన్ని నిలిపేయాలని, తక్షణం బేషరతు కాల్పుల విరమణ పాటించాలని కోరే తీర్మానంపై జరిగిన వోటింగ్‌కు అమెరికా గైర్హాజరైంది. నిరుడు అక్టోబర్‌లో హమాస్ మిలిటెంట్లు హఠాత్తుగా దాడిచేసి 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులను హతమార్చి 250 మందిని బందీలుగా తీసుకుపోయారు.
ఆ ఘటనలో అనేకమంది గాయాలపాలయ్యారు. ఆ సంస్థ చెరలో ఇంకా 134 మంది వరకూ వున్నారని అంచనా. ఆనాటినుంచీ ఇజ్రాయెల్ పగబట్టి గాజాలోని జనావాస ప్రాంతాలే లక్ష్యంగా క్షిపణుల వర్షం కురిపిస్తోంది. బాంబుల మోత మోగిస్తోంది. ఎడతెగని ఈ దాడుల్లో ఇంతవరకూ 32,000 మంది పాలస్తీనా పౌరులు మరణించారు. లక్షలమంది తీవ్రంగా గాయపడ్డారు.
ఆకలితో అలమటిస్తున్న వారు ఆహారం తీసుకొచ్చిన వాహనాలపైకి ఎగబడినప్పుడు వారిని అదుపు చేసే పేరిట అమానుషంగా ప్రవర్తించటంతోపాటు కాల్చిచంపుతున్న ఉదంతాలకు కొదవలేదు. మంచినీరు, ఆహారం,మందుల కొరతతో పాలస్తీనా పౌరులు పడుతున్న అగచాట్లు అన్నీ ఇన్నీ కాదు. ఇజ్రాయెల్ సాగిస్తున్న నరమేథం, విధ్వంసం ఆధునిక చరిత్రలో కనీవినీ ఎరుగనివి. ఇజ్రాయెల్‌ను సమర్థించటానికి అలవాటుపడిన అమెరికా, పాశ్చాత్య దేశాలు దీన్నంతటినీ నిర్వికారంగా చూశాయి. అదేమంత విషయం కాదన్నట్టు మొదట్లో వ్యాఖ్యానించాయి.
భద్రతామండలిలో ఇజ్రాయెల్‌ను అభిశంసిస్తూ ఇంతవరకూ వచ్చిన మూడు తీర్మానాలను వీటో చేశాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ‘యుద్ధం సాగుతున్నప్పుడు పౌరుల మరణాలు సంభవించటం రివాజే’ అని వ్యాఖ్యానిస్తే ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. ఒకపక్క ఇజ్రాయెల్‌కు ఆయుధాలు, ఇతర యుద్ధ సామగ్రి అందజేస్తూ, అంత ర్జాతీయ వేదికలపై దాని దురాగతాలను సమర్థిస్తూ... మరోపక్క పౌర ప్రాంతాల విషయంలో జాగ్రత్తలు పాటించాలని ఆ దేశానికి సుద్దులు చెబుతూ అమెరికా కాలక్షేపం చేసింది. హమాస్ అంత మొందేవరకూ ఇజ్రాయెల్ దాడులు ఆగరాదనీ, అలా ఆపితే అది ఆ మిలిటెంటు సంస్థకు బలం చేకూరుస్తుందనీ వాదించింది.
అంతర్జాతీయంగానూ, స్వదేశంలోనూ వస్తున్న ఒత్తిళ్ల కారణంగా దాదాపు ఆర్నెల్లయ్యాక ఇన్నాళ్లకు ఇజ్రాయెల్‌ను వ్యతిరేకించే తీర్మానంపై వోటింగ్‌లో గైర్హాజరైంది. నిజానికి ఇది కంటి తుడుపు చర్య. ఆ తీర్మానాన్ని సమర్థించి, ప్రతీకారానికి కూడా హద్దులుంటాయని చెప్తే వేరుగా వుండేది. ఇకపై ఇజ్రాయెల్‌కు అన్ని రకాల సాయం నిలిపేస్తామని ప్రకటించివుంటే హుందాగా వుండేది.
వాటన్నిటి బదులూ వోటింగ్‌కు గైర్హాజరు కావటంవల్ల పెద్దగా ఒరిగేది వుండదు. హమాస్ ఉగ్ర దాడిని ఎవరూ సమర్థించటం లేదు.దాని దుందుడుకు చేష్టలు స్వతంత్ర పాలస్తీనా లక్ష్యానికి విఘాతం కలిగిస్తాయని, రాజ్యాల అమానుష కృత్యాలకు సాధారణ పౌరులపై కక్ష తీర్చుకోవటం పరిష్కారం కాదని ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు దుయ్యబట్టాయి.
అయితే గత ఏడు దశాబ్దాలుగా ఇజ్రాయెల్ సాగిస్తున్న దురాగతాలు తక్కువేమీ కాదు. నిజానికి పాలస్తీనా సమస్య సాకుగా ఇజ్రాయెల్‌లో జాతీయవాదాన్ని రెచ్చగొట్టి ఎన్నికల్లో పబ్బం గడుపుకోవాలన్న మితవాద పక్షాల వైఖరివల్లే పరిష్కారం జటిలంగా మారింది. పాలస్తీనా పౌరుల నిరాశానిస్పృహలే మిలిటెంటు సంస్థ లకు ఊపిరులూదాయి. పాలస్తీనా మనోభావాలను బేఖాతరు చేసి ఇజ్రాయెల్ ఆవిర్భావానికి కారణమై, దాని దురాక్రమణలకు వంతపాడుతూ వచ్చిన అమెరికా, పాశ్చాత్య దేశాల వైఖరి సైతం మిలిటెంట్లకు బలం చేకూర్చింది.
భద్రతామండలి తీర్మానాన్ని అమెరికా వీటో చేయకుండా గైర్హాజరు కావటం సహజంగానే ఇజ్రాయెల్‌కు మింగుడుపడటం లేదు. ఆ దేశ ప్రధాని నెతన్యాహూ అలకబూనారు. జో బైడెన్‌తో చర్చల కోసం వాషింగ్టన్ వెళ్లబోతున్న ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం పర్యటనను చివరి నిమిషంలో రద్దుచేశారు. చరిత్ర తిరగేస్తే ప్రతి మలుపులోనూ ఇజ్రాయెల్‌కు అమెరికా అండగా నిలబడిన సంగతి కనబడుతుంది. దాని అకృత్యాలను తక్కువచేసి చూపడం లేదా మూర్ఖంగా సమర్థించటం కళ్లకు కడుతుంది.
అదే సమయంలో ప్రతి సందర్భంలోనూ అమెరికా హితవచనాలను ఇజ్రాయెల్ బేఖాతరు చేయటం కూడా తేటతెల్లమవుతుంది. ఈ యేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలుండటం, ఇజ్రాయెల్ సేనలు నిరాటంకంగా ఊచకోతను కొనసాగించటం బైడెన్‌కు ఇబ్బందిగా మారింది. ఒకపక్క ఇజ్రాయెల్‌కు అన్నివిధాలా సాయపడుతూ కూడా దాన్ని కించిత్తు కూడా ప్రభావితం చేయ లేని బైడెన్ తీరు ఆయన బలహీనతను ప్రస్ఫుటం చేసింది. ఇదంతా చివరకు తన విజయావకా శాలను దెబ్బతీసేలా వున్నదని ఆయన గ్రహించారు.
పర్యవసానంగా భద్రతామండలిలో భిన్నమైన వైఖరి తీసుకున్నారు. ఇది తమ విధానానికి అనుగుణంగానే వున్నదని అమెరికా చెబుతున్నా ఇజ్రాయెల్ స్పందననుబట్టే నిజానిజాలేమిటో గ్రహించవచ్చు. ఏదేమైనా భద్రతామండలి తీర్మానం ఆశించిన విధంగా గాజాలో తక్షణం కాల్పుల విరమణ అమల్లోకి రావాలి.
రంజాన్ మాసం పూర్తయ్యే వరకూ ఇది అమల్లోవుండాలని తీర్మానం కాంక్షిస్తున్నా ఈ కాలంలో ఉద్రిక్తతలు ఉపశమిస్తే... బందీల విడుదల జరిగితే అది శాంతికి దోహదపడుతుంది. ఆ పరిణామం సమస్య శాశ్వత పరిష్కారానికి దారితీస్తే అంతకన్నా కావలసిందేముంది? ఇజ్రాయెల్ మంకుపట్టు విడనాడాలి. గాజాలో హంతక దాడులకు స్వస్తి చెప్పాలి. తన సైన్యం చేసిన దురాగతాలపై విచారణకు అంగీకరించాలి.
పాలస్తీనాపై అమెరికా ‘ప్రేమ’!
Published Thu, Mar 28 2024 12:13 AM | Last Updated on Thu, Mar 28 2024 11:37 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment