![వృద్ధురాలి గోడు వింటున్న కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/23/22nzd304-290083_mr_0.jpg.webp?itok=8hl24Eq4)
వృద్ధురాలి గోడు వింటున్న కలెక్టర్ ప్రసన్న వెంకటేష్
కలెక్టర్ ప్రసన్న వెంకటేష్
ముసునూరు: మారుమూల పల్లెల్లో సమస్యల సమగ్ర పరిష్కారంతో ప్రజలకు మరింత చేరువ కావడమే జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ అన్నారు. నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్శ్ రాజీంద్రన్ అధ్యక్షతన శుక్రవారం ముసునూరు హైస్కూల్‌లో జగనన్నకు చెబుదాం మండల స్థాయి కార్యక్రమాన్ని జేసీ లావణ్యవేణితో కలిసి కలెక్టర్ నిర్వహించారు. కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. ప్రజల నుంచి 242 అర్జీలను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అర్జీల సత్వర పరిష్కార దిశగా, జవాబుదారీగా అధికారులు పనిచేయాలని ఆదేశించారు.
అర్జీల్లో కొన్ని..
● లోపూడికి చెందిన కోటేశ్వరరావు, కల్కిమూర్తిల భూమి ఆక్రమణ పాలైందని, గుళ్లపూడికి చెందిన మందలపు నాగభూషణం తమ భూమి రికార్డుల్లో పోరంబోకుగా కనిపిస్తుందని, అక్కిరెడ్డిగూడెంకు చెందిన ప్రజలు గ్రామంలో శ్మశానానికి భూమి కేటాయించాలని, రమణక్కపేట ప్రజలు శివాలయం భూమి ఆక్రమణకు గురైందని, గోపవరంలో జగనన్న కాలనీల ప్రదేశాలను మార్చాలని కోరగా, సమస్యలను తక్షణం పరిష్కరించాలని తహసీల్దార్ దాసరి సుధను కలెక్టర్ ఆదేశించారు.
● ముసునూరులో పశువుల ఆస్పత్రికి, ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాలుకు నూతన భవనాలు, పీహెచ్‌సీకి మరమ్మతులు చేయాలని మాజీ సర్పంచ్ గోపాలకృష్ణ, తదితరులు కోరగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈని ఆదేశించారు. పశువుల ఆస్పత్రి నిర్మాణాలకు నివేదిక ఇవ్వాలని ఆ శాఖ జేడీని ఆదేశించారు.
● తన పిల్లలు తనను చూడటం లేదని కాట్రేనిపాడుకు చెందిన వృద్ధురాలు పల్లి నక్షత్రం కలెక్టర్ వద్ద మొరపెట్టుకోగా ఆమె కుమారులతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని సచివాలయ మహిళా సంక్షేమ సహాయకురాలిని ఆదేశించారు.
ఎంపీపీ ఆర్.కృష్ణకుమారి, వైస్ ఎంపీపీ రాజానాయన, జెడ్పీటీసీ సభ్యుడు వరికూటి ప్రతాప్, మండల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు ఎం.నాగవల్లేశ్వరరావు, స్టేట్ హిస్టరీ అకాడమీ డైరెక్టర్ స్వరూపరాణి, జెడ్పీ సీఈఓ రవికుమార్, డీఆర్‌డీఏ పీడీ ఆర్.విజయరాజు, డీపీఓ శ్రీనివాస్, జిల్లా అధికారులు, డీటీ ఎమిలీ కుమారి, ఇన్‌చార్జ్ ఎంపీడీఓ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment