![నరసాపురంలో నిర్మాణంలో ఉన్న ఓపెన్ ఆడిటోరియం - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/5/04nsp01-290028_mr_0.jpg.webp?itok=nEv4il36)
నరసాపురంలో నిర్మాణంలో ఉన్న ఓపెన్ ఆడిటోరియం
నరసాపురం: పట్టణంలో మునిసిపాలిటీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఓపెన్ ఆడిటోరియం ఆధునికీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. మున్సిపల్ కార్యాలయం పక్కన విశాల స్థలంలో నిరుపయోగంగా ఉన్న మున్సిపల్ ఓపెన్ ఎయిర్ థియేటర్ స్థానే అధునాతన వసతులతో ఓపెన్ ఆడిటోరియం నిర్మిస్తున్నారు. రూ 3.50 కోట్లతో చేపట్టిన ఈ పనులు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది వేసవి నాటికి ఆడిటోరియం అందుబాటులోకి తెచ్చేలా పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మున్సిపల్ ఓపెన్ ఎయిర్ థియేటర్ భారీ విస్తీర్ణంలో విలువైన ప్రాంతంలో ఉన్నా మున్సిపాలిటీకి ఆదాయం కరువైంది. పైగా థియేటర్ నిర్వహణ మునిసిపాలిటీకి భారంగా మారింది. దీంతో ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు ఆదేశాల మేరకు మున్సిపల్ ఓపెన్ ఎయిర్ థియేటర్ స్థానంలో రూ.3.50 కోట్లతో మున్సిపల్ ఓపెన్ ఆడిటోరియం నిర్మాణాన్ని గత ఏడాది ఫిబ్రవరిలో చేపట్టారు.
మునిసిపాలిటీకి గుదిబండగా..
1991వ సంవత్సరంలో రూ.5 లక్షల వ్యయంతో ఓపెన్ ఎయిర్ థియేటర్ భవనాన్ని నిర్మించారు. రెండెకరాల స్థలంలో మునిసిపల్ కార్యాలయం పక్కనే నిర్మించిన ఈ థియేటర్‌లో ఎలాంటి మౌలిక సదుపాయాలు లేకపోవడంతో వివాహలు, ఇతర ప్రైవేట్ కార్యక్రమాల నిర్వహించుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. దీంతో థియేటర్ ద్వారా మునిసిపాలిటీకి ఏడాదికి కేవలం రూ.3 వేలు మాత్రమే ఆదాయం వచ్చేది. థియేటర్‌కు నెలనెలా చెల్లించే కరెంటు బిల్లు, వాచ్‌మెన్ జీతం.. ఇలా ఏడాది పొడవునా థియేటర్‌పై వచ్చే ఆదాయం కంటే ఖర్చే ఎక్కువే అయ్యేది. దీంతో మునిసిపాలిటీకి గుదిబండగా మారిన ఈ పాత భవనాన్ని పూర్తిగా పడగొట్టి అధునాతనంగా ఆడిటోరియం భవనం నిర్మాణం చేపట్టారు.
పనులు వేగంగా జరిగేలా ఆదేశాలు ఇచ్చాం
నిరుపయోగంగా ఉన్న మున్సిపల్ ఓపెన్ ఎయిర్ థియేటర్‌ను రూ 3.50 కోట్లతో అధునాతనంగా నిర్మిస్తున్నాం. కొంతమేర మున్సిపల్ జనరల్ ఫండ్స్‌ను కూడా ఖర్చు చేస్తున్నాం. పనులు వేగంగా జరిగేలా ఆదేశాలు ఇచ్చాం. ఇక నుంచి అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ఇక్కడే చేసుకునేలా భవన నిర్మాణం చేస్తున్నాం. అనువైన మంచి సెంటర్‌లో, పార్కింగ్‌కు కూడా ఇబ్బంది లేకుండా కొత్త ఓపెన్ ఆడిటోరియం అందుబాటులోకి వస్తుంది.
– ముదునూరి ప్రసాదరాజు, ప్రభుత్వ చీఫ్ విప్, నరసాపురం
రూ.3.50 కోట్లతో మునిసిపాలిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి
![1](https://www.sakshi.com/gallery_images/2024/01/5/04nsp02-290028_mr_0.jpg)
Comments
Please login to add a commentAdd a comment