కూటమిలో నామినేటెడ్‌ చిచ్చు | - | Sakshi
Sakshi News home page

కూటమిలో నామినేటెడ్‌ చిచ్చు

Published Sat, Sep 28 2024 1:28 AM | Last Updated on Sat, Sep 28 2024 1:28 AM

కూటమిలో నామినేటెడ్‌ చిచ్చు

త్యాగం చేస్తే.. కనీసం పట్టించుకోరా ?

సాక్షి ప్రతినిధి, ఏలూరు: చంద్రబాబును అందలం ఎక్కించడం కోసం జనసేన నేతలు, కార్యకర్తలు కష్టిస్తే ఇప్పుడు తమను పరిగణనలోకి తీసుకోవడం లేదని అసంతృప్తితో రగిలిపోతున్నారు. నియోజకవర్గంలో మాట చెల్లుబాటు కావడం లేదు... ఎమ్మెల్యేలు కనీసం పట్టించుకోవడం లేదు.. మనం త్యాగం చేసి.. వాళ్ళని పల్లకి ఎక్కిస్తే పట్టించుకోవడం లేదని తీవ్ర అంతర్మథనం చెందుతున్నారు. ఎన్నికల్లో త్యాగం చేస్తే కనీసం నామినేటెడ్‌ పదవులకు కూడా తమను పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నామినేట్‌ పదవులు ప్రకటన ఉమ్మడి పశ్చిమలో ముఖ్యంగా జనసేనలో చిచ్చురేపింది. రూ.కోట్లు ఖర్చు పెట్టి, ఏళ్ళ తరబడి పార్టీ జెండా మోసినా పట్టించుకోరా? అంటూ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మూడూ టీడీపీ నేతలకే..

కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వంద రోజులు తరువాత నామినేట్‌ నియామకాలు జరిగాయి. 20 నామినేట్‌ పోస్టులు రాష్ట్ర స్థాయిలో ప్రకటిస్తే మూడు పదవులు ఉమ్మడి పశ్చిమకు దక్కాయి. మూడు కూడా టీడీపీ నేతలకే రావడంతో జనసేన ముఖ్యనేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఏలూరు జిల్లాకు సంబంధించి పోలవరం టీడీపీ నేత బొరగం శ్రీనివాస్‌కు ఏపీ ట్రైకార్డ్‌ చైర్మన్‌ పదవి దక్కగా పశ్చిమగోదావరి జిల్లా కోటాలో మాజీ మంత్రి పీతల సుజాతకు వినియోగదారుల ప్రొటెక్షన్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ పదవులు, ఉండి మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు ఏపీఐఐసీ చైర్మన్‌ పదవి దక్కాయి. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో జనసేనకు నియోజకవర్గ ఇన్‌చార్జులతోపాటు కీలక నేతలు, అలాగే బీజేపీకి కొందరు నేతలు జిల్లాలో ఉన్నారు. ఎక్కువ మంది నేతలకు ఎమ్మెల్సీలు, కీలక నామినేట్‌లు ఇస్తామని ప్రకటించారు. కార్యాచరణలో మాత్రం ఎక్కడా అమలు కాలేదు.

ఉమ్మడి పశ్చిమలో జనసేనకు మొండిచేయి

ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నా ఒక్క పదవీ దక్కని వైనం

జనసేన శ్రేణుల్లో అసమ్మతి.. ఇప్పటికే పట్టించుకోని టీడీపీ ఎమ్మెల్యేలు

ప్రాధాన్యం లేక, పదవులు దక్కక నేతల్లో అంతర్మథనం

చిన్నచూపు చూస్తున్నారు జనసేన నేతలు

టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచిన చోట జనసేన నేతలకు విలువ లేకుండా పోయింది. ఎన్నికల సమయంలో ప్రచారానికి వినియోగించి తరువాత పూర్తి ప్రాధాన్యత తగ్గించడంతో పాటు మాట కూడా చెల్లుబాటు కాకుండా చేయడంతో అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఏలూరు, దెందులూరు, చింతలపూడి, పోలవరం, ఉండి, తణుకు నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. మరోవైపు పోలవరంలో జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు సమాంతరంగా టీడీపీ నియోజకవర్గనేత బొరగం శ్రీనివాస్‌కు నామినేటెడ్‌ పదవి కట్టబెట్టడంపై జనసేన ఎమ్మెల్యేకు పొగపెట్టారంటూ పార్టీ శ్రేణులే బహిరంగంగానే వ్యాఖ్యనిస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరిలో చాలా నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు జనసేన కేడర్‌ను పట్టించుకోవడం లేదు. మరోవైపు నామినేట్‌ పదవుల్లో జనసేనకు మొండిచేయి చూపడంతో అసమ్మతి సెగలు కొనసాగుతున్నాయి.

ఉమ్మడి పశ్చిమలో జనసేనకు సంబంధించి ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఉన్నారు. ఈ పరిణామాల క్రమంలో జిల్లాలో జనసేన సీట్ల ప్రాధాన్యత క్రమంలో పదవులు ఇవ్వాలనే డిమాండ్‌ గతంలోనే బలంగా తెరపైకి తెచ్చారు. పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినా కార్యరూపం దాల్చలేదు. ఏలూరు జిల్లాలో రెడ్డి అప్పలనాయుడు, ఘంటా వెంకటలక్ష్మి, కొఠారు ఆదిశేషు, ఈశ్వరయ్య, నారా శేషుతో పాటు పలువురు ముఖ్యనేతలు పదవులు ఆశిస్తూ జనసేన కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో కొటికలపూడి గోవిందరావు, గుండా జయప్రకాష్‌నాయుడు, విరివాడ రామచంద్రరావు ఇలా అనేక మంది నేతలు పదవులు ఆశిస్తున్నారు. ఒక్కరిని కూడా కనీసం పరిగణనలోకి తీసుకోకపోవడంతో శ్రేణులు పూర్తిగా రగిలిపోతున్నాయి. ఏళ్ళ తరబడి పార్టీని నమ్ముకుని కోట్లు ఖర్చుపెడితే, చివరికి సీట్లు త్యాగం చేసినా కనీస గౌరవం కూడా ఇవ్వలేదని వాపోతున్నారు. ఇప్పుడు కేడర్‌కు ఏం చెప్పాలంటూ కొందరు నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement