కానరాని దీపావళి కాంతులు
సాక్షి, భీమవరం: ఒకవైపు పనుల్లేవు.. మరోవైపు నిత్యావసరాలు, కూరగాయల ధరలు చుక్కలనంటాయి. ప్రభుత్వం సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. దీంతో పేదల ఇంట దీపావళి పండుగ కాంతులు కరువయ్యాయి. అమ్మకాలు లేక బాణసంచా దుకాణాలు వెలవెలబోతున్నాయి. రెండు రోజుల్లో 30 శాతం అమ్మకాలు కూడా జరగలేదు. గురువారం అమ్మకాలపైనే వ్యాపారులు అశలు పెట్టుకున్నారు. చీకట్లను పారదోలి వెలుగులు పంచే దీపావళిని ప్రతీ ఇంటా వేడుకగా జరుపుకుంటారు. ధనిక పేద తారతమ్యం లేకుండా అందరూ బాణసంచా కాలుస్తారు. జిల్లాలో లైసెన్స్ కలిగిన బాణసంచా తయారీ కేంద్రాలు ఏడు ఉండగా, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, మార్టేరు, నరసాపురం తదితరచోట్ల హోల్‌సేల్ దుకాణాలు 24 ఉన్నాయి. జిల్లాలో రూ.35 కోట్లు మేర బాణాసంచా వ్యాపారం జరుగుతుందని అంచనా. పండుగకు కొద్ది రోజుల ముందు నుంచే తయారీదారులు, హోల్‌సేల్ వ్యాపారులు ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటుచేసి అమ్మకాలు ప్రారంభించారు. తక్కువ వ్యవధిలో ఎక్కువ లాభాలు ఆర్జించే వీలుండటంతో చిరు వ్యాపారులు, నిరుద్యోగ యువత రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షల పెట్టుబడితో రిటైల్ షాపులు ఏర్పాటు చేస్తుంటారు. మూడు రోజుల కాల పరిమితిపై ఈ ఏడాది జిల్లాలో 366 రిటైల్ షాపులకు అధికారులు తాత్కాలిక లైసెన్సులు మంజూరు చేశారు.
దుకాణాలు వెలవెల
ఏటా మాదిరి భీమవరం, తణుకు, నరసాపురం తదితర పట్టణాలు, గ్రామాల్లోని ఎంపిక చేసిన ప్రదేశాల్లో మంగళవారం నుంచి వ్యాపారులు తాత్కాలిక లైసెన్స్ షాపులను ప్రారంభించారు. సాధారణంగా షాపులు ఖాళీగా ఉండి నచ్చిన ఐటమ్స్ ఎంపిక చేసుకునే వీలుంటుందని చాలామంది ముందుగానే బాణసంచా కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలో దీపావళికి ముందే 50 శాతానికి పైగా అమ్మకాలు జరుగుతుంటాయి. ఈ ఏడాది పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. బుధవారం నాటికి 30 శాతం కూడా అమ్మకాలు జరగలేదని వ్యాపారులు అంటున్నారు. టెంపరరీ లైసెన్సుల నిమిత్తం పోలీస్, ఫైర్, రెవెన్యూ అధికారులకు మామూళ్లు, టెంట్లు, షామియానాల రూపంలో ఒక్కో షాపు ఏర్పాటుకు రూ.70 వేలు నుంచి రూ. లక్ష వరకు ఖర్చయ్యింది. లక్షలు పెట్టుబడి పెట్టామని, బాణసంచా సామగ్రి అమ్ముడుపోకుంటే తీవ్రంగా నష్టపోతామని వారు ఆందోళన చెందుతున్నారు. రెండు రోజుల అమ్మకాలు తీవ్రంగా నిరాశపర్చగా గురువారం వ్యాపారంపై గంపెడాసలు పెట్టుకున్నారు. అల్పపీడనం ప్రభావంతో బుధవారం జిల్లాలోని పలుచోట్ల వర్షం కురవడంతో షాపుల్లోని బాణసంచా తడవకుండా కాపాడుకునేందుకు వ్యాపారులు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. గురువారం వాతావరణం అనుకూలించి అమ్మకాలు బాగుంటేనే గట్టెక్కుతామని అంటున్నారు.
కనిపించని జోష్ : గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పేద వర్గాలకు కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలుజేసింది. కూటమి పాలనలో సంక్షేమం జాడ లేకుండా పోయింది. తాము అధికారంలోకి వస్తే అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి ఇస్తామంటూ ఊదరగొట్టిన కూటమి ఇప్పుడు వాటి ఊసెత్తడం లేదు. నాలుగు నెలలుగా ఇసుక కొరతతో నిర్మాణ రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. జిల్లాలో అధిక సంఖ్యలో ఉన్న భవన నిర్మాణ కార్మికులు పనుల్లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేక కుటుంబ పోషణ కోసం అయినకాడికి అప్పులు చేస్తున్న పరిస్థితి. మరోపక్క అడ్డూఅదుపూ లేకుండా పెరుగుతున్న నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు వారి జీవన ప్రమాణాలను మరింత దుర్భరంగా మార్చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బాణసంచా కొనుగోలుకు వారు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
పనుల్లేక, అధిక ధరలతో పేద వర్గాల ఇబ్బందులు
అమ్మకాలు లేక బాణసంచా దుకాణాల వెలవెల
ఏటా జిల్లాలో రూ.35 కోట్ల వరకు దీపావళి వ్యాపారం
ఇంతవరకు 30 శాతం కూడా జరగని అమ్మకాలు
ఆందోళన కలిగిస్తున్న వాతావరణం
అమ్మకాలు తగ్గిపోయాయి
ఈ ఏడాది బాణసంచా అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. గతంలో దీపావళికి ముందుగానే తణుకు ప్రాంతంలో రూ.10 కోట్ల వరకు వ్యాపారం జరిగేది. ఇప్పుడు సగానికి పైగా తగ్గిపోయింది. పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితి.
– పులపర్తి అజయ్‌రామ్, హోల్‌సేల్ వ్యాపారి, తణుకు
పనుల్లేక ఇబ్బంది
కొద్దినెలలుగా సరిగా పనులు లేక ఖాళీగా ఉంటున్నాం. దీనికి తోడు కూరగాయలు, సరుకుల ధరలు బాగా పెరిగిపోవడంతో కుటుంబ పోషణకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఈ సంవత్సరం పండుగ ఆనందం లేదు.
– ఎం.రామూనాయుడు, కూలీ, నరసాపురం
Comments
Please login to add a commentAdd a comment