రోడ్డెక్కితే టోల్ బాదుడే
సాక్షి ప్రతినిధి, ఏలూరు: రాష్ట్ర రహదారులకు టోల్ పెట్టేందుకు రంగం సిద్ధమైంది. కిరాయి మీద వచ్చే ఆదాయం రిపేర్లకు కొంత పోతే కొత్తగా టోల్‌గేట్లు పెడితే తమకు మిగిలేదేమి ఉండదని లారీ అసోసియేషన్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమలో పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంలో మూడు రహదారులను సర్వే పేరుతో ఎంపిక చేసి టోల్ బాదుడుకు సన్నద్ధం చేశారు.
ఉమ్మడి పశ్చిమలో 12 వేల వరకూ లారీలు
ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలో 13 రాష్ట్ర రహదారులున్నాయి. ప్రధానంగా ఏలూరు జిల్లా నుంచి ఇసుక, మొక్కజొన్న, కొబ్బరి, వరి, పామాయిల్, కలప, చేపలు, పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఆక్వా ఉత్పత్తులు, కొబ్బరితో పాటు ధాన్యం, ఉల్లిపాయలు, నూనె, ఐస్ తదితర ఉత్పత్తుల రవాణా నిత్యం జరుగుతుంటుంది. ఉమ్మడి పశ్చిమలో ఒక్కొక్క ఉత్పత్తి ఒక్కొ ప్రాంతంలో ప్రసిద్ధి చెందడంతో దానికి అనుగుణంగా లారీలు నడుపుతున్నారు. ఉమ్మడి పశ్చిమలో 12 వేల వరకు లారీలు ఉన్నట్లు అంచనా. వీటిలో 60 శాతం లారీలకు పూర్తి స్థాయిలో కిరాయిలు దొరుకుతుంటాయి. ఇప్పటికే ఉమ్మడి పశ్చిమలో కలపర్రు జాతీయ రహదారి టోల్‌గేటు, ఉంగుటూరు వద్ద టోల్‌గేట్లు ఉన్నాయి. లోకల్ లారీలకు రూ.250, నేషనల్ పర్మిట్ ఉన్న లారీలకు రూ.425 టోల్ వసూలు చేస్తున్నారు. కిరాయిలతో పాటు టోల్‌గేట్ చార్జీలు తప్పనిసరిగా యజమానుల నుంచి వసూలు చేస్తున్నారు.
తాజాగా మరో మూడు రహదారులు
జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మూడు రహదారుల్లో టోల్ ఏర్పాటు చేయడానికి అనువుగా ఉన్నట్లు నిర్ధారించింది. వీటిలో నర్సాపురం– అశ్వారావుపేట ప్రధాన రహదారి 100.55 కిలోమీటర్లు, ఏలూరు– మేడిశెట్టివారిపాలెం ప్రధాన రహదారి 70.93 కిలోమీటర్లు, ఏలూరు– జంగారెడ్డిగూడెం (51.73 కి.మీ.) ఉన్నాయి. ఈ మూడు రహదారుల్లో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో టోల్‌గేట్లను ఏర్పాటు చేసి కాంట్రాక్టర్లకు బాధ్యత అప్పగించాలని నిర్ణయించారు. దానిలో భాగంగా సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయడానికి రవాణ శాఖ, ఆర్‌అండ్‌బీ, ఇతర శాఖల అధికారులను నియమించారు. ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించి డీపీఆర్ సిద్ధం చేయించడంతో పాటు 15 రోజుల్లోగా అధికారుల నుంచి తుది నివేదిక తీసుకోనున్నారు.
టోల్‌గేట్లతో అదనపు భారం
రాష్ట్ర రహదారుల్లో ఇంతవరకు టోల్‌గేట్లు అనేవి లేవు. వ్యవసాయ ఆధారిత జిల్లా కావడంతో దానికి సంబంధించిన ఉత్పత్తులే నిత్యం రవాణా జరుగు తుంటాయి. మూడు ప్రధాన రహదారుల్లో టోల్‌గేట్లు ఏర్పాటు చేస్తే అదనపు భారం పడుతుంది. ఏలూరు జిల్లాలో 13 రాష్ట్ర రహదారులను అనుసంధానం చేస్తూ జాతీయ రహదారులున్నాయి. విజయవాడ–భువనేశ్వర్ జాతీయ ప్రధాన రహదారి కావడంతో ప్రతి నిత్యం 30 నుంచి 35 వేల వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయి. కొత్తగా ఎంపిక చేస్తున్న మూడు రహదారుల్లో రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది. సగటున మూడు రహదారుల్లో ఆటోలు మొదలుకొని లారీల వరకు 15 వేల వరకు వాహనాల రాకపోకలుంటాయని అధికారులు అంచనా.
ఉమ్మడి పశ్చిమలో మూడు రోడ్లు ఖరారు
పీపీపీ పద్ధతిలో ప్రైవేట్‌కు అప్పగించడానికి రంగం సిద్ధం
మొదటి విడత సర్వేలో జిల్లా రోడ్ల ఎంపిక
ప్రైవేట్ టోల్‌ను వ్యతిరేకిస్తున్న రవాణా రంగం అసోసియేషన్
Comments
Please login to add a commentAdd a comment