భీమవరం: అధికారంలోకి వస్తే నిత్యావసరాలు ధరలు తగ్గిస్తామంటూ కూటమి నాయకులు ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆ మాటే మర్చిపోయారు. గత నెలలో వంట నూనెలు, టమాటాలు, ఉల్లిపాయల ధరల నియంత్రణకు ఏర్పాటుచేసిన ప్రత్యేక దుకాణాలు ప్రస్తుతం కన్పించడం లేదు. ఈ ప్రత్యేక దుకాణాలకు సరుకు సరఫరా లేక మూతపడ్డాయి. జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, నరసాపురం రైతు బజార్లతోపాటు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోను ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేసి ఉల్లిపాయలు, టమాటాలతోపాటు పామాయిల్, సన్‌ఫ్లవర్ విక్రయ కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఈ కౌంటర్ల వద్ద మార్కెట్ కంటే తక్కువ ధరకు విక్రయాలు చేస్తారని గొప్పగా ప్రచారం చేశారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక కౌంటర్ల వల్ల బహిరంగ మార్కెట్‌లో కూడా ధరలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ కౌంటర్ల వద్ద టమాటాలు కిలో రూ.50, ఉల్లిపాయలు కర్నూల్ రకం కిలో రూ.32, మహారాష్ట్ర రకం రూ.47కి విక్రయిస్తారని, పామాయిల్ 850 గ్రాముల ప్యాకెట్ రూ.119, సన్‌ఫ్లవర్ 910 గ్రాముల ప్యాకెట్ రూ.127కే విక్రయిస్తారని ప్రచారం చేశారు. కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు ఏమాత్రం తగ్గకపోగా మరింత పెరిగాయి. ప్రధానం ఉల్లి కిలో రూ. 80 వరకు విక్రయిస్తుంటే టమాటలు కిలో రూ. 60 పై మాటే. మిగిలిన కూరగాయల ధరలు కిల్లో రూ.50 తక్కువగాకుండా పలుకుతున్నాయి. పామాయిల్ ప్యాకెట్ రూ.135, సన్‌ఫ్లవర్‌వాయిల్ రూ.155కు విక్రయిస్తుండగా గ్రామాల్లో వీటి ధరలు మరింత ఎక్కువగానే ఉంటున్నాయని వినియోగదారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment