వసతిగృహంలో సమస్యలు పరిష్కరించాలి
బుట్టాయగూడెం: గిరిజన సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పరిశీలించాలని కోరుతూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో బుధవారం కేఆర్‌పురం ఐటీడీఏ వద్ద విద్యార్థులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు బన్నే వినోద్ మాట్లాడుతూ బుట్టాయగూడెంలో ఉన్న గిరిజన బాలుర కళాశాల హాస్టల్‌కు సరైన గదులు, మరుగుదొడ్లు, డైనింగ్ హాల్ లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వసతిగృహం పూర్తిగా శిథిలమైందని చెప్పారు. గిరిజన బాలికల కళాశాల వసతిగృహంలో కూడా విద్యార్థులకు అనుగుణంగా గదులు, మరుగుదొడ్లు లేక విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనివినోద్ కోరారు. అనంతరం వినతిపత్రాన్ని కేఆర్‌పురం ఐటీడీఏ డీడీ పీవీఎస్ నాయుడుకు అందజేశారు.
8న ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): 2024–25 విద్యా సంవత్సరానికి జాతీయ ఉపకార వేతనం నిమిత్తం నిర్వహించే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్ష వచ్చే డిసెంబర్ 8న నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరిగే పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల హాల్ టిక్కెట్లను ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయం వెబ్‌సైట్‌లో స్కూల్ లాగిన్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
ఏరియా ఆసుపత్రికి అవార్డు
తాడేపల్లిగూడెం: ప్రాంతీయ ఆసుపత్రులలో పారిశుద్ధ్యం, పరిశుభ్రతకు ఇచ్చే అవార్డుల్లో భాగంగా 2023–24 సంవత్సరానికి తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి రాష్ట్ర స్థాయి కాయకల్ప అవార్డు దక్కింది. ఈ అవార్డు కింద రూ.10 లక్షల రివార్డు అందనుంది. రెండో స్ధానంలో ఏలూరు జిల్లా నూజివీడు ఆసుపత్రి ఎంపికై ంది. ఈ ఆసుపత్రికి రూ. 7 లక్షల రివార్డు ఇస్తారు. తమ ఆసుపత్రికి అవార్డు రావడం ఆనందంగా ఉందని సూపరింటెండెంటు డాక్టర్ తాతారావు చెప్పారు.
1న జానపద, దేశభక్తి పాటల పోటీలు
ఏలూరు (టూటౌన్): డిసెంబర్ 1న రాజమండ్రిలో అంబల్ల సూర్యారావు భవన్‌లో అభ్యుదయ జానపద, దేశభక్తి పాటలు, సాంఘిక ఏక పాత్ర అభినయం పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రజానాట్యమండలి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సీతారాం ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో 18 నుంచి 35 ఏళ్ల వయసున్న యువత పాల్గొన వచ్చన్నారు.
మావుళ్లమ్మ దీక్షల విరమణ
భీమవరం(ప్రకాశం చౌక్): మావుళ్లమ్మ అమ్మవారి దీక్ష విరమణ బుధవారం జరిగింది. ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు నిర్వహించారు. 400 మంది భక్తులు దీక్ష విరమించారు. అనంతరం భక్తులు పూజ సామగ్రి పూర్ణాహుతిలో సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మీ నగేష్ తదితరులు పాల్గొన్నారు.
డీఎస్సీ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
ఏలూరు (టూటౌన్): ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డీఎస్సీ పరీక్షకు హాజరయ్యే మైనారిటీ విద్యార్థులకు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎస్.కృపావరం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ దరఖాస్తులను డిసెంబర్, 12లోగా మైనార్టీ సంక్షేమ శాఖ, విజయవాడ 520 012 చిరునామాకు పంపాలన్నారు. ఇతర వివరాలకు 0866–2970567 నెంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment