రోలర్ స్కేటింగ్‌లో విద్యార్థుల ప్రతిభ
భీమవరం (ప్రకాశంచౌక్): తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్‌లో ఈనెల 5వ తేదీన నిర్వహించిన 62వ జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో తణుకు మాంటిస్సోరి స్కూల్ విద్యార్థులు సత్తా చాటి విజేతలుగా నిలిచారు. ఇన్‌లైన్ హాకీ కాడెట్ అండర్–11 విభాగం నందు మైత్రి దాస్ బంగారు పతకం, రోరల్ మిక్స్‌డ్ హాకీ కాడెట్ అండర్–11 విభాగం నందు కె.నితేష్ గౌడ్ కాంస్య పతకం, రోలర్ మిక్స్‌డ్ హాకీ సబ్ జూనియర్ అండర్ –14 విభాగం నందు జి.జస్వంత్ కాంస్య పతకంలను సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను కలెక్టరేట్ చాంబర్ నందు కలెక్టర్ చదలవాడ నాగరాణి సోమవారం అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. జాయింట్ కలెక్టర్ టి రాహుల్‌కుమార్‌రెడ్డి, మాంటిస్సోరి స్కూల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ.జ్ఞాన మంజరి, ఆంధ్రప్రదేశ్ టీమ్ కోచ్ ఏ.భార్గవ్, జిల్లా రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ నందమూరి రాజేష్, జిల్లా స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అధికారి ఎం.రాజేష్ ఉన్నారు.
27న క్రికెట్ సెలెక్షన్స్
ఏలూరు రూరల్ : ఈ నెల 27వ తేదీన ఏలూరు ఆశ్రం వైద్య కళాశాల ఆవరణలో ఉమ్మడి పశ్చి మగోదావరి జిల్లా అండర్–12 బాలుర క్రికెట్ జట్టు సెలక్షన్స్ నిర్వహించనున్నామని అసోసియేషన్ అధ్యక్షుడు జి ఆదిత్యవర్మ, కార్యదర్శి వీవీఎస్‌ఎం శ్రీనివాసరాజు సంయుక్త ప్రకటనలో తెలిపారు. జట్టుకు ఎంపికై న వారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిర్వహించబోయే అంతర జిల్లాల పోటీల్లో పాల్గొంటారని వివరించారు. ఆసక్తి గలవారు పుట్టినతేదీ సర్టిఫికెట్, ఆధార్ ఒరిజినల్, జిరాక్స్ కాపీలతో శుక్రవారం ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు.
గేదెను కాపాడదామని వెళ్లి..
చింతలపూడి : గేదెను కాపాడదామని వెళ్లి చెరువులో మునిగి ఓ వ్యక్తి మృతి చెందాడు. చింతలపూడి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన అనుపోజు ధర్మలింగాచారి (55)కు పాడి గేదె ఉంది. చెరువులోకి దిగిన గేదె మెడకు కాలికి బంధం ఉండటంతో ఈత కొట్టలేక గిలగిలాడుతున్న పరిస్థితిని రాజు గమనించి చెరువులోకి దిగి ఆ బంధాన్ని తొలగించాడు. అయితే అప్పటికే మరణించిన గేదె రాజుపై పడిపోవడంతో ఉక్కిరిబిక్కిరి అయి ప్రాణాలు వదిలేశాడని గ్రామస్తులు తెలిపారు. రాజుకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్సై కుటుంబరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చెట్టుపై నుంచి పడి..
పాలకొల్లు అర్బన్: మండలంలోని పాలమూరు గ్రామానికి చెందిన గీత కార్మికుడు పాలా నాగమునేశ్వరరావు (64) సోమవారం సాయంత్రం చెట్టుపై నుంచి పడి మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు పాలకొల్లు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment