అర్జీల సత్వర పరిష్కారమే లక్ష్యం
ఏలూరు (మెట్రో): విభిన్న ప్రతిభావంతుల సమస్యలపై వచ్చిన అర్జీలను సానుకూలంగా పరిష్కరించాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల పరిష్కారంకోసం వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. విభిన్న ప్రతిభావంతుల నుంచి అర్జీలు స్వీకరించేందుకు వేదిక కిందకు వచ్చి వారి సమస్యలను స్వయంగా తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విభిన్న ప్రతిభావంతుల వైకల్యాన్ని గుర్తించి సదరం ధృవీకరణ పత్రాలు, రేషన్ కార్డు, పెన్షన్ మంజూరుకు ఆయా శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మధుమేహం వల్ల తన కాలు తీసివేశారని, కుడికాలుకు సంబంధించి సమస్య ఉందని, సదరం ధ్రువీకరణ పొందానని ప్రస్తుతం ఇస్తున్న రూ.6 వేల పెన్షన్‌ను రూ.15 వేల పెంపునకు చర్యలు తీసుకోవాలని భీమడోలు మండలం గుండుగొలనుకు చెందిన చింతా రవికుమార్ కోరారు. ఉంగుటూరు మండలం వెల్లమెల్లికి చెందిన ఉమ్మట్ల నాగమణి పింఛన్ మంజూరు కోసం నూతన బియ్యం కార్డు ఇవ్వాలని కోరారు. అవసరమైన చర్యలకోసం సంబంధిత అధికారులకు కలెక్టర్ అక్కడికక్కడే ఆదేశాలు ఇచ్చారు.
దివ్యాంగులకు ప్రత్యేక సేవా కేంద్రం
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో వినతులిచ్చే అర్జీదారుల సౌకర్యార్థం కలెక్టర్ పలు ఏర్పాట్లు చేశారు. కుర్చీలు, తాగునీటి సౌకర్యాలు కల్పించారు. విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దివ్యాంగుల కొరకు ప్రత్యేక రిసెప్షన్ కౌంటరు ఏర్పాటు చేశారు. వారి సమస్యలకు సంబంధించి అర్జీలను రాసేందుకు సహాయ కేంద్రం నెలకొల్పారు. దివ్యాంగుల కోసం మూడు చక్రాల సైకిళ్లు అందుబాటులో ఉంచారు. అర్జీలు సమర్పించేందుకు అవసరమైన వారికి మూడుచక్రాల సైకిళ్లను ఏర్పాటు చేసి వేదిక వరకు తీసుకువెళ్లే ఏర్పాట్లు చేశారు.
అందిన అర్జీల్లో కొన్ని
తన భూమిని తన నుంచి స్వాధీనం చేసుకోవాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని, తన భూమిని సర్వేచేసి ఇప్పించాలని కొయ్యలగూడెం మండలం ధర్మారావుపేట కు చెందిన పెనుమత్స శ్రీరామరాజు కోరారు.
తన భూమి ఆన్ లైన్ చేయించాలని జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెంకు చెందిన వెంకటేశ్వరరావు అర్జీ అందజేశారు.
పాస్‌బుక్ ఆధారంగా తన భూమిని చూపించాలని కుక్కునూరు మండలం సీతానగరానికి చెందిన కొయ్యల అశోక్ అర్జీ పెట్టుకున్నారు.
గుర్రమ్మకుంట చెరువు ఆక్రమణతో రైతులు ఇబ్బంది పడుతున్నారని దెందులూరు మండలం శ్రీరామవరానికి చెందిన శ్రీనివాసరావు అర్జీ పెట్టుకున్నారు.
తమ భూమిని కొలిపించి సర్వే చేసి అప్పగించాలని లింగపాలెం మండలం రాయుడుపాలెంకు చెందిన వెంపాటి స్వాతి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment