సైబర్ నేరాలపై అవగాహన అవసరం
ఏలూరు (టూటౌన్): సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 47 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులతో ఎస్పీ ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సైబర్ నేరాలపై అవగాహనను కలిగి ఉండాలని చెప్పారు. ఎస్పీ మాట్లాడుతూ ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చైన్నె నుంచి సీబీఐ, ఈడీ అధికారులు అని చెప్పి ఫోన్లు చేసి బెదిరించి డబ్బులు చెల్లించాలని చెప్పే కాల్స్, సందేశాలపై సైబర్ క్రైమ్‌లో తక్షణమే ఫిర్యాదు చేయాలన్నారు.
ఓవర్ లోడుకు రూ.1.70 కోట్ల జరిమానా!
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఓవర్ లోడ్‌తో వెళుతున్న ఒక లారీని గుర్తించిన ఏలూరులో పని చేస్తున్న ఓ సీనియర్ వాహన తనిఖీ ఇన్స్‌పెక్టర్ ఆ వాహనానికి జరిమానా విధించారు. ఈ వాహన యజమానికి జరిమానా చూసి బెంబేలెత్తిపోయాడు. ఏలూరులో పని చేస్తున్న సీనియర్ మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్ ఆదివారం వాహన తనిఖీలు చేస్తూ.. ఓ లారీపై ఓవర్ లోడ్ కేసు నమోదు చేశారు. సదరు అధికారి 3 టన్నుల అదనపు లోడ్‌కు బదులు 3 వేల యూనిట్లుగా ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. వెంటనే కంప్యూటరైజ్డ్ బిల్లు 3 వేల టన్నులకు రూ.1.70 కోట్ల జరిమానా విధించినట్లుగా రసీదు ఇచ్చింది. దీంతో లబోదిబోమంటూ బాధితుడు రవాణా శాఖ ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నాడు. విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆరా తీసిన జిల్లా ఉప రవాణా కమిషనర్ షేక్ ఖాసిమ్ సదరు అధికారి 3 వేల కిలోలను 3 వేల యూనిట్లుగా నమోదు చేసినట్లు గుర్తించారు. సోమవారం ఉదయం దానిని సరి చేసి విషయాన్ని వాహనదారుడికికి తెలిపినట్టు ఖాసిమ్ ఒక ప్రకటనలో తెలిపారు. వాహనానికి విధించిన జరిమానా కేవలం రూ.26,200 మాత్రమేనని స్పష్టం చేశారు.
సర్పంచుల హక్కులు కాలరాస్తున్నారు
ఏలూరు (టూటౌన్): జాతీయ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తూ, గ్రామ పంచాయతీ సర్పంచుల హక్కులకు సహకరించని జిల్లా, మండల స్థాయి అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్సీ సర్పంచుల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మెండెం సంతోష్ కుమార్ కలెక్టర్‌కు సోమవారం వినతి పత్రం అందజేశారు. తాను దెందులూరు మండలం ముప్పవరం పంచాయతీ సర్పంచ్‌గా ఉన్నానని, గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా పనులు జరగకూడదని చెప్పినా దెందులూరు మండల ఫీల్డ్ ఆఫీసర్ (ఎంపీడీఓ)పనులు పెట్టించి తమ హక్కులను కాలరాస్తున్నారన్నారు. సర్పంచ్‌కు తెలియకుండా ఏమీ జరగకూడదని సీఎం చంద్రబాబు, పంచాయతీరాజ్ మంత్రి చెప్పిన విషయాలు గుర్తుచేశారు. దెందులూరు మండల అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పీజీఆర్‌ఎస్ అర్జీదారులకు ప్రత్యేక బస్సులు
భీమవరం (ప్రకాశంచౌక్): పీజీఆర్‌ఎస్ అర్జీదారుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని ప్రతి సోమవారం ప్రత్యేక ఉచిత బస్సు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మెయిన్ రోడ్డు నుంచి కలెక్టరేట్ కు వయోవృద్ధులు, వికలాంగులు చేరుకోవాలంటే రెండున్నర కిలోమీటర్లు ప్రయాణించాల్సి రావడం వ్యయ ప్రయాసలతో పాటు ఖర్చుతో కూడుకుంది. ఈ విషయమై డీఈఓతో చర్చించి ప్రతివారం ఒక స్కూల్ బస్సును రెండు ట్రిప్పులు వేసేలా చర్యలు తీసుకున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి సుమారు ఉదయం 9 గంటలకు, 10 గంటలకు, తిరిగి కలెక్టరేట్ నుండి మధ్యాహ్నం 12 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు వయోవృద్ధులు, దివ్యాంగ అర్జీదారులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment