విద్యుత్ చార్జీలపై పోరుబాట
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు షాకులమీదు షాకులిస్తోందని వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు అన్నారు. సోమవారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చంద్రబాబు విద్యుత్ చార్జీలు అసలు పెంచనని చెప్పి ఎంత మోసం చేశారో ప్రజలు గుర్తుంచుకుంటారన్నారు. కూటమి ప్రభుత్వం ఆరు నెలలు తిరగకుండానే జనంపై చార్జీల మోత మోగించడం దారుణమన్నారు. అబద్ధపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేశారన్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడానికి తీసుకున్న నిర్ణయం, క్లాసిఫికేషన్ పేరిట ప్రభుత్వ వనరులన్నీ ఏం చేస్తారని ప్రశ్నించారు. ఒక్క నవంబర్‌లోనే ప్రజలపై రూ.15,485.36 కోట్ల భారం మోపడం వాస్తవం కాదా! అని ప్రశ్నించారు. సూపర్‌సిక్స్ పథకాల వైఫల్యం గురించి మాట్లాడాలంటే ఒక రోజు చాలదని ఎద్దేవా చేశారు. తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్రంలో కొత్త అలజడులు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ చార్జీల పెంపుపై ఈ నెల 27న జిల్లా కేంద్రం ఏలూరులో పోరుబాట నిర్వహిస్తున్నామని తెలిపారు. అదే రోజున ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో ఆయా నియోకవర్గాల ప్రతినిధులు కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ధరలు ఆకాశాన్నంటుతున్నాయి : జేపీ
వైఎస్సార్‌సీపీ ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాశ్ మాట్లాడుతూ పార్టీ పిలుపు మేరకు జిల్లా కేంద్రం ఏలూరులోని విద్యుత్ భవన్ వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. రైతులకు ఉచిత కరెంటును ఎత్తివేశారని, ఇప్పుడు రైతులు బిల్లులు కట్టుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, ప్రజలు కొనుగోలు చేయలేక, ఏమి తినాలో అర్థం కాక పస్తులు పడుకుంటున్నారన్నారు. చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త కంభం విజయరాజు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలోనే రెండుసార్లు చార్జీలు పెంచి ప్రజల నడ్డివిరిచారన్నారు. అనంతరం పార్టీ నాయకులు పోరుబాటకు సంబంధించిన వాల్‌పోస్టర్లు ఆవిష్కరించారు. పార్టీ నాయకులు మున్నుల జాన్ గురునాథ్, గుడిదేశి శ్రీనివాస్, కిలాడి దుర్గారావు, నూకపెయ్యి సుధీర్ బాబు, ఎండీ ఖైసర్ మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గంటా మోహన రావు, దాసరి రమేష్, దేవరకొండ నాగేశ్వర రావు, తులసి, పెరికే వరప్రసాద్, డీవీఆర్‌కే చౌదరి, ఎచ్చెర్ల ఉమా మహేష్, బండ్లమూడి సునీల్ తదితరులు పాల్గొన్నారు.
షాక్‌ల మీద షాకులిస్తున్న కూటమి ప్రభుత్వం
27న ప్రతి నియోజకవర్గంలో నిరసన కార్యక్రమం
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
దూలం నాగేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment