అడ్డగోలుగా ఘాట్ రోడ్డు నిర్మాణం
నూజివీడు: ప్రజాప్రతినిధుల అండ చూసుకుని నలగట్టుపై దట్టంగా పెరిగిన చెట్లను తొలగించేసి ఏకంగా కిలోమీటర్ మేర ఘాట్ రోడ్డు నిర్మించడం గ్రామస్తులతోపాటు అధికారులను సైతం విస్మయానికి గురిచేసింది. నూజివీడు మండలంలోని పాతరావిచర్ల పరిధిలోని నల్లగట్టు పైభాగాన ఓ విద్యాసంస్థ యాజమాన్యం ఒడిగట్టిన ఈ దుస్సాహసాన్ని చూసి రెవెన్యూ అధికారులే నివ్వెరపొయారు. పట్టణం నుంచి విజయవాడ వెళ్లే రోడ్డులో ఉన్న ఒక విద్యాసంస్థ యాజమాన్యం నల్లగట్టుపై అక్రమంగా ఘాట్‌రోడ్డు వేస్తున్న విషయాన్ని ఆదివారం రెవెన్యూ అధికారులకు తెలపడంతో తహసీల్దార్ బీవీ సుబ్బారావు ఆర్‌ఐ అశోక్‌కుమార్, వీఆర్వోలను పంపి నిలుపుదల చేయించి పొక్లయిన్‌ని సీజ్ చేసి తహసీల్దార్ కార్యాలయానికి తీసుకొచ్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో నల్లగట్టుపై జరిగిన తవ్వకాలను తహసీల్దార్ సుబ్బారావు సోమవారం పరిశీలించారు. కాలినడకన ఆయన గట్టుపై వరకు ఎక్కి ఘాట్ రోడ్డును పరిశీలించారు. దాదాపు కిలోమీటరుకు పైగా గట్టుపైన దట్టంగా పెరిగిన చెట్లను తొలగిస్తూ వేసిన మట్టిరోడ్డును చూసి తహసీల్దార్‌తో పాటు గ్రామస్తులు సైతం విస్మయం వ్యక్తం చేశారు. గట్టు కింద నుంచి పైభాగానికి ఇలా రోడ్డు వేయాల్సిన అవసరమేమిటనే ప్రశ్న వారి నుంచి వ్యక్తమైంది. ఈ గట్టు వద్ద యజమానికి రెండు ఎకరాల పట్టా భూమి ఉండగా, మరో ఆరు ఎకరాల చేతులు మారిన అసైన్‌మెంట్ భూమి ఉండగా వాటిలో శాశ్వత కట్టడాలు కట్టడమేమిటని తహసీల్దార్ ప్రశ్నించారు. పట్టా భూమిలో నిర్మించాలన్నా ల్యాండ్ కన్వర్షన్ చేసుకోవాల్సి ఉంటుందని, అసైన్‌మెంట్ ల్యాండ్‌లో ఎలాంటి కట్టడాలు నిర్మించడానికి లేదని పేర్కొన్నారు. ఇక్కడ వేసిన ఘాట్ రోడ్డును చూస్తే నాలుగైదు రోజులు క్రితమే రోడ్డు పనులు నిర్వహించారనేది స్పష్టంగా కనిపిస్తోంది. గ్రామస్తులు కూడా అదే విషయాన్ని చెబుతున్నారు. స్కూల్ యాజమాన్యానికి కొందరు టీడీపీ నాయకుల మద్దతు ఉందని, దాని వల్లనే ఇంత ధైర్యంగా గట్టుపైకి రోడ్డును వేస్తున్నారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే వ్యవసాయభూమిలో షెడ్డులు వేయడంపైనా చర్యలు తీసుకునేందుకు తహసీల్దార్ నివేదిక సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.
గ్రామస్తుల ఆగ్రహం
రెవెన్యూకి చెందిన నల్లగట్టును ఆక్రమించుకోవడానికి ఘాట్‌రోడ్డును నిర్మిస్తుండటంపై పాఠశాల యాజమాన్యంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు రోజుల పాటు ఆదమరిస్తే గట్టు పైభాగంలో సమతలంగా ఉన్న 20 ఎకరాలకు పైగా ఉన్న భూమిని ఆక్రమించేసి ఉండేవారని పేర్కొంటున్నారు. గట్టు పైభాగానికి ఏ సంబంధం లేని ప్రైవేటు వ్యక్తి రోడ్డు నిర్మించాల్సిన పనేమిటని ప్రశ్నిస్తున్నారు. నీ భూమి ఎంత వరకు ఉందో అందులోనే ఉండాలి గాని ఇష్టారాజ్యంగా కొండను కబళిస్తామంటే సహించేది లేదన్నారు. జీవాలకు మేత లభ్యమయ్యే పచ్చని కొండను నాశనం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోమని పేర్కొంటున్నారు.
నల్లగట్టుపై రోడ్డు నిర్మాణాన్ని చూసి తహసీల్దార్ ఆశ్చర్యం
రోడ్డు నిర్మించాల్సిన అవసరమేమిటని ప్రశ్నిస్తున్న గ్రామస్తులు
Comments
Please login to add a commentAdd a comment